సినిమా రివ్యూ : మళ్ళీ పెళ్లి 
రేటింగ్ : 2.5/5
నటీనటులు : నరేష్ విజయకృష్ణ, పవిత్రా లోకేష్, జయసుధ, శరత్ బాబు, వనితా  విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవి వర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు
ఛాయాగ్రహణం : ఎంఎన్ బాల రెడ్డి
నేపథ్య సంగీతం : అరుల్ దేవ్!స్వరాలు : సురేష్ బొబ్బిలి 
నిర్మాత : నరేష్ విజయకృష్ణ 
రచన, దర్శకత్వం : ఎంఎస్ రాజు
విడుదల తేదీ: మే 26, 2023


నవరస రాయ డా. నరేష్ (Naresh VK), పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) వ్యక్తిగత జీవితంలో జరిగిన అంశాలను తీసుకుని 'మళ్ళీ పెళ్లి' తీశారా? అనే సందేహం చాలా మందిలో ఉంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి కోర్టును ఆశ్రయించారు కూడా! ఎంఎస్ రాజు (MS Raju) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉంది (Malli Pelli Review)? అందరూ భావిస్తున్నట్టు 'మళ్ళీ పెళ్లి' నరేష్, పవిత్రాల బయోపిక్ యేనా? లేదంటే కల్పిత కథతో తీశారా?


కథ (Malli Pelli Movie Story) : సీనియర్ కథానాయకుడు, నటుడు నరేంద్ర (నరేష్ విజయ కృష్ణ)కు, ఆయన మూడో భార్య సౌమ్యా సేతుపతి (వనితా విజయ్ కుమార్)కి మధ్య సత్సంబంధాలు అంతగా లేని రోజులవి! సరిగ్గా ఆ సమయంలో నరేంద్రకు కన్నడ నటి, ఒకప్పుడు కథానాయికగా చేసిన పార్వతి (పవిత్రా లోకేష్) పరిచయం అవుతుంది. వాళ్ళిద్దరూ మానసికంగా దగ్గర అవుతారు. ఒకరితో మరొకరు ప్రేమలో పడతారు. అసలు... నరేంద్ర, సౌమ్య మధ్య గొడవలు ఏమిటి? పార్వతి, ఆమెతో పదకొండేళ్ళు సహ జీవనం చేసిన కన్నడ నటుడు & రచయిత ఫణింద్ర (అద్దూరి రవి వర్మ) మధ్య గొడవలు ఏమిటి? బెంగళూరు మీడియాలో తనకున్న పరిచయాలను ఉపయోగించి సౌమ్యా సేతుపతి ఎటువంటి హైడ్రామా నడిపింది? అనేది సినిమా. 


విశ్లేషణ (Malli Pelli Telugu Movie Review) : నరేంద్ర, పార్వతి, సౌమ్యా సేతుపతి, విమలమ్మ... తెరపై నరేష్, పవిత్రా లోకేష్, వనితా విజయ్ కుమార్, జయసుధ పోషించిన పాత్రల పేర్లు. నరేష్, పవిత్ర నిజ జీవిత పాత్రల్లో కనిపిస్తే... రమ్య, విజయ నిర్మల పాత్రలను వనిత, జయసుధ చేశారు. కృష్ణగా శరత్ బాబును చూపించారు. 


బయోపిక్ కాదని, రమ్యా రఘుపతిపై రివేంజ్ తీర్చుకోవడానికి సినిమా తీయలేదని నరేష్ చెప్పారు. కానీ, సినిమా చూస్తే ఆయన జీవితంలో రమ్యా రఘుపతి, పవిత్రా లోకేష్ వచ్చిన తర్వాత జరిగిన అంశాలను ఎంఎస్ రాజు తెరకెక్కించారని ఈజీగా అర్థం అవుతోంది. 'మళ్ళీ పెళ్లి' చూస్తే నరేష్ తప్పేమీ లేదని, తప్పంతా రమ్యా రఘుపతిది అని ప్రేక్షకులకు అనిపిస్తుంది. బహుశా... నిజం కూడా అదే అయ్యి ఉండొచ్చు. అయితే... ఈ సినిమాకు నరేష్ హీరో & నిర్మాత కావడం వల్ల ఆయనకు అనుకూలంగా సినిమా తీసుకున్నట్లు ప్రేక్షకులు భావించే అవకాశం ఉంది. 


'మళ్ళీ పెళ్లి'ని సినిమాగా చూస్తే... ఎంఎస్ రాజు ఫ్రంట్ & బ్యాక్ స్క్రీన్ ప్లే బావుంది. ఎంగేజ్ చేశారు. కొన్ని సన్నివేశాలను బోల్డుగా తీశారు. ట్రైలర్‌లో చూపించినట్టు  నరేష్ వయసు మీద సెటైర్స్ వేశారు. అనన్యా నాగళ్ళను స్క్రీన్ మీద గ్లామరస్ గా చూపించారు. సాంగ్స్ బావున్నాయి. రీ రికార్డింగ్ కూడా ఓకే. ఖర్చు విషయంలో నరేష్ వెనకడుగు వేయలేదని తెలుస్తూ ఉంది. 


బయోపిక్స్ విషయంలో తెలుగు 'మహానటి', హిందీ 'సంజు' ఓ బెంచ్ మార్క్ సెట్ చేశాయి. ఆ సినిమాల తరహాలో 'మళ్ళీ పెళ్లి' ఉందా? అంటే... 'లేదు' అని చెప్పాలి. కానీ, ఒక్కొక్కరి జీవితంలో ఏం జరిగింది? అనేది చక్కగా చూపించారు. నరేష్, పవిత్ర ఫ్లాష్ బ్యాక్స్ చూసినప్పుడు వాళ్ళ మీద జాలి కలుగుతుంది. క్లైమాక్స్ వచ్చే సరికి ఆల్రెడీ టీవీల్లో మనం చూసిన ఎపిసోడ్స్ మళ్ళీ స్క్రీన్ మీద చూసినట్టు ఉంది.  


నటీనటులు ఎలా చేశారు? : నరేష్, పవిత్రా లోకేష్ నటించినట్టు అనిపించదు. నిజ జీవిత పాత్రలను తెరపై పోషించినట్టు ఉంటుంది. సౌమ్యా సేతుపతిగా వనితా విజయ్ కుమార్ విలనిజాన్ని చూపించడంలో సక్సెస్ అయ్యారు. పార్వతి యంగ్ వెర్షన్ రోల్ అనన్యా నాగళ్ళ చేశారు. గ్లామర్ ఒలకబోశారు. నరేంద్ర తల్లి విమలమ్మ పాత్రలో జయసుధ, సూపర్ స్టార్ పాత్రలో శరత్ బాబు కనిపించారు. సినిమాలో వాళ్ళ పరిధి తక్కువే. స్క్రీన్ మీద ఎక్కువ శాతం నరేష్, పవిత్రా లోకేష్ కనిపించారు. 


Also Read : 'మేమ్ ఫేమస్' రివ్యూ : 'మేజర్', 'రైటర్ పద్మభూషణ్' తర్వాత ఛాయ్ బిస్కెట్‌కు మరో హిట్టేనా?


చివరగా చెప్పేది ఏంటంటే? : నరేష్, పవిత్రల వ్యక్తిగత జీవితంలో ఏం జరిగింది?  బెంగళూరులో రమ్యా రఘుపతి ప్రెస్ మీట్ పెట్టక ముందు ఏం జరిగింది? వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోలని కుతూహలం ఉన్న ప్రజలను 'మళ్ళీ పెళ్లి' ఎంటర్టైన్ చేస్తుంది. అందులో ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. ఒక్కటి మాత్రం నిజం... 'మళ్ళీ పెళ్లి' నరేష్, పవిత్రాల వెర్షన్! రమ్యా రఘుపతిని కదిపితే దీనికి అపోజిట్ వెర్షన్ వినిపించే అవకాశం ఉంది. నరేష్, పవిత్ర ఎలా దగ్గర అయ్యారు? అనేదానికంటే జీవిత భాగస్వామ్యులతో వాళ్ళ సంబంధాలు ఎలా ఉన్నాయి? అనేది చూపించిన సన్నివేశాలు ఎంగేజ్ చేశాయి. నరేష్, పవిత్ర జీవితంపై ఆసక్తి లేనివాళ్లు సినిమాకు దూరంగా ఉండటం మంచిది. 


Also Read : 'సత్తిగాని రెండెకరాలు' రివ్యూ : ఆహాలో వినోదాత్మక నేర చిత్రం - ఎలా ఉందంటే?