సినిమా రివ్యూ : సత్తిగాని రెండెకరాలు 
రేటింగ్ : 2.5/5
నటీనటులు : జగదీష్ ప్రతాప్ బండారి, మోహన శ్రీ, 'వెన్నెల' కిశోర్, రాజ్ తిరందాసు, అనీషా దామా, 'బిత్తిరి' సత్తి, మురళీధర్ గౌడ్, రియాజ్ తదితరులు
పాటలు : కాసర్ల శ్యామ్, నిఖిలేష్ సంకోజి, జగదీష్ ప్రతాప్ బండారి  
ఛాయాగ్రహణం : విశ్వనాథ్ రెడ్డి సీహెచ్
సంగీతం : జై క్రిష్
నిర్మాతలు : నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
రచన, దర్శకత్వం : అభినవ్ రెడ్డి దండ
విడుదల తేదీ: మే 26, 2023
ఓటీటీ వేదిక : ఆహా


'పుష్ప' సినిమాతో నటుడు జగదీష్ ప్రతాప్ బండారి (Jagadeesh Prathap Bandari)కి మంచి గుర్తింపు వచ్చింది. అందులో అల్లు అర్జున్ స్నేహితునిగా, కేశవ పాత్రలో నటించారు. జగదీష్ కథానాయకుడిగా నటించిన సినిమా 'సత్తిగాని రెండెకరాలు' (Sathi Gani Rendu Ekaralu Movie). 'పుష్ప' సహా పలు హిట్ చిత్రాలు నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే ఈ చిత్రాన్నీ నిర్మించింది. 'వెన్నెల' కిశోర్, మోహన శ్రీ, మురళీధర్ గౌడ్, అనీషా దామా తదితరులు నటించారు. ఈ సినిమా ఆహా ఓటీటీ (Aha Original Movie)లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? 


కథ (Sathi Gani Rendu Ekaralu Movie Story) : సత్తి (జగదీష్ ప్రతాప్ బండారి)కి భార్య, ఇద్దరు పిలల్లు! బతుకు దెరువు కోసం చిన్న ట్రక్కు నడుపుతూ ఉంటాడు. ఊరిలో అతనికి రెండెకరాల భూమి ఉంది. దానిని అమ్మవద్దని సత్తి చిన్నతనంలో తాతయ్య చెబుతాడు. తాతకు ఇచ్చిన మాటకు కట్టుబడి సత్తి జీవితాన్ని వెళ్ళదీస్తూ ఉంటాడు. అయితే, అతని తలకు మించిన కష్టం వచ్చి పడుతుంది. కుమార్తె గుండెలో రంధ్రం ఉందని, ఆపరేషన్ చేయడానికి 30 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతారు. సత్తి బంధువు, ఊరు సర్పంచ్ (మురళీధర్ గౌడ్) స్వలాభం కోసం సత్తిగానితో రెండెకరాలు అమ్మించేయాలని చూస్తాడు. పొలం అమ్మడానికి సత్తి రెడీ అవుతున్న సమయంలో ఓ సూట్ కేస్ అతని చేతికి వస్తుంది. దానిని ఓపెన్ చేయడానికి గతంలో తనతో పాటు చిన్న చిన్న దొంగతనాలు చేసిన స్నేహితుడు అంజి (రాజ్ తిరందాసు) దగ్గరకు వెళతాడు. 


సత్తి, అంజి కలిసి సూట్ కేస్ ఓపెన్ చేశారా? లేదా? ఓపెన్ చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేశారు? ఎలాగైనా సరే సూట్ కేస్ తీసుకు రమ్మని హైదరాబాదులోని లలిత్ (రియాజ్) తన అనుచరులకు ఎందుకు చెప్పాడు? అందులో ఏముంది? సూట్ కేస్ కోసం సత్తిగాని ఊరు వచ్చిన ('వెన్నెల' కిశోర్) ఏం చేశాడు? ఊరిలో కారు తగలబెడితే ఎస్సై (బిత్తిరి సత్తి) ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడు? చివరకు, సూట్ కేసులో ఏముందో సత్తి తెలుసుకున్నాడా? కష్టాల నుంచి బయటపడ్డాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.  


విశ్లేషణ (Sathi Gani Rendu Ekaralu Movie Review) : 'సత్తిగాని రెండెకరాలు' కథను కామెడీగా చెప్పవచ్చు. లేదంటే క్రైమ్ థ్రిల్లర్ తరహాలో తీయవచ్చు. దర్శకుడు అభినవ్ రెడ్డి దండ కామెడీకి ఓటు వేశారు. ప్రతి పాత్రనూ ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. సినిమాకు ఆ క్యారెక్టరైజేషన్లు బలంగా నిలిచాయి. తెలంగాణ పల్లె నేపథ్యం కూడా! అయితే, కథ కాస్త వీక్ అయ్యింది. అది మైనస్!


'సత్తిగాని రెండెకరాలు' కథలో కొత్తదనం లేదు. ఆడియన్స్ ఊహలకు అనుగుణంగా ముందుకు వెళుతూ ఉంటుంది. అయితే, ఈ కథకు తెలంగాణ పల్లె నేపథ్యంతో పాటు దర్శకుడు అభినవ్ క్రియేట్ చేసిన క్యారెక్టర్లు కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. తమకు సాయం చేయమంటూ యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ వస్తాయి. ఒక్కోసారి కొందరు అధికారులు పరిచయం లేనివాడు అయినా సరే తమ వర్గమని తెలిశాక అభిమానం చూపిస్తూ ఉన్నారు. ఈ సినిమా స్టార్టింగ్ సీన్ చూసినప్పుడు గానీ, బిత్తిరి సత్తి - 'వెన్నెల' కిశోర్ సీన్స్ చూసేటప్పుడు గానీ రైటింగ్ పరంగా దర్శకుడు మంచి వర్క్ చేశాడని అనిపిస్తుంది.   


ప్రతి మనిషిలో మంచి, చెడు ఉంటాయి. కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కోసారి మంచిని పక్కన పెట్టి చెడు వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుంది. అవసరం తప్పుల్ని చేయిస్తుంది. దానిని దర్శకుడు వినోదాత్మకంగా చూపించిన తీరు బావుంది. ఆ వినోదం మధ్య కొంత సాగదీత కూడా ఉందనుకోండి. నటీనటుల చేత మంచి పెర్ఫార్మన్స్ చేయించారు. సినిమా ప్రారంభం సాదాసీదాగా ఉంటుంది. ఒక్కసారి సూట్ కేస్ వచ్చిన తర్వాత క్యూరియాసిటీ మొదలవుతుంది. ముగింపు బావుంది. అంటే... సీక్వెల్ కోసం రెడీ చేసిన సెటప్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.


తెలంగాణ పల్లె వాతావరణాన్ని సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి సీహెచ్ సహజంగా, అందంగా తెరపై ఆవిష్కరించారు. జై క్రిష్ పాటలు, నేపథ్య సంగీతం కథలో భాగంగా తెరపై సన్నివేశాల్లో వీక్షకులను లీనం చేస్తూ ముందుకు వెళ్ళాయి.  సాహిత్యం కూడా సహజంగా ఉంది. నిర్మాణ విలువలు బావున్నాయి.


నటీనటులు ఎలా చేశారు? : సత్తి పాత్రకు జగదీష్ ప్రతాప్ బండారి పర్ఫెక్ట్ యాప్ట్! డార్క్ హ్యూమర్, డ్రామా సీన్స్ చాలా బాగా చేశారు. సినిమా చివరకు వచ్చేసరికి అమాయకత్వం, అలాగే ఎత్తుకు పైఎత్తులు వేసే జిత్తులమారిగా మంచి నటన కనబరిచారు. కామెడీ విషయానికి వస్తే జగదీష్ కంటే 'వెన్నెల' కిశోర్ ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తారు. రీసెంట్ టైంలో ఆయనకు లభించిన బెస్ట్ క్యారెక్టర్ ఇది. 


సరైన క్యారెక్టర్, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ పడితే 'వెన్నెల' కిశోర్ చెలరేగిపోతారు. ఈ 'సత్తిగాని రెండెకరాలు'లో కూడా అంతే! డైలాగుల కంటే ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎక్కువ నవ్వించారు. 'బిత్తిరి' సత్తి కాంబినేషన్ సన్నివేశాల్లో ఇరగదీశారు. హీరో స్నేహితుని పాత్రలో రాజ్ తిరందాసు చక్కగా నటించారు. సత్తి భార్యగా మోహన శ్రీ ఇంపార్టెంట్ రోల్ చేశారు. రెగ్యులర్ వైఫ్ క్యారెక్టరే. కానీ, ఫ్లోలో మంచి సీన్స్ పడటంతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. అంజి ప్రేయసిగా, సర్పంచ్ కుమార్తెగా అనీషా దామా కనిపించారు. పల్లెటూరి అందగత్తెగా కాస్త ప్రాముఖ్యం ఉన్న పాత్రలో నటిగానూ మెరిశారు. 'గల్లీ బాయ్స్' రియాజ్ క్యారెక్టర్ అందరికీ గుర్తుంటుంది. దానికి ఇచ్చిన బిల్డప్ అలా ఉంది మరి! 


సత్తి కుమారుడిగా నటించిన చిన్నారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణ పల్లెల్లో పిల్లల పాత్రకు ప్రతిరూపం అన్నట్లు డిజైన్ చేశారు. అతడి డైలాగులూ బాగా రాశారు. సర్పంచ్ పాత్రలో మురళీధర్ గౌడ్ ఓకే. 


Also Read : 'మేమ్ ఫేమస్' రివ్యూ : 'మేజర్', 'రైటర్ పద్మభూషణ్' తర్వాత ఛాయ్ బిస్కెట్‌కు మరో హిట్టేనా?


చివరగా చెప్పేది ఏంటంటే? : సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు 'సత్తిగాని రెండెకరాలు'లో వినోదం ఆకట్టుకుంటుంది. సిల్లీ కామెడీ చాలా సన్నివేశాల్లో ఎంటర్టైన్ చేస్తుంది. ముఖ్యంగా 'వెన్నెల' కిశోర్ సీన్స్! కథ డిజప్పాయింట్ చేస్తుంది. కథలో సోల్ మిస్సైన ఫీలింగ్ కలుగుతుంది. అయితే,  ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే కామెడీ ఎంజాయ్ చేయవచ్చు. వీకెండ్ టైమ్ పాస్ ఫిల్మ్!


Also Read : '2018' రివ్యూ : మలయాళంలో వంద కోట్లు వసూలు చేసిన సినిమా - ఎలా ఉందంటే?