సినిమా రివ్యూ : మేమ్ ఫేమస్ 
రేటింగ్ : 2/5
నటీనటులు : సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య లక్ష్మణ్, సిరి రాసి, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, కిరణ్ మచ్చ, అంజిమామ, శివ నందన్ తదితరులు
ఛాయాగ్రహణం : శ్యామ్ దూపాటి
సంగీతం : కళ్యాణ్ నాయక్
నిర్మాతలు : అనురాగ్ రెడ్డి,శరత్ చంద్ర, చంద్రు మనోహర్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సుమంత్ ప్రభాస్
విడుదల తేదీ: మే 26, 2023


యూట్యూబ్ సిరీస్, మ్యూజిక్ వీడియో సాంగులతో ఫేమస్ అయిన యువకుడు సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas). అతను కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా 'మేమ్ ఫేమస్' (Mem Famous Movie). 'మేజర్', 'రైటర్ పద్మభూషణ్' తర్వాత ఛాయ్ బిస్కెట్ అధినేతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించిన చిత్రమిది. లహరి ఫిల్మ్స్ చంద్రు మనోహర్ నిర్మాణ భాగస్వామ్యంతో తెరకెక్కించారు. విడుదలకు ముందు ప్రముఖులు చాలా మంది ప్రమోట్ చేశారు.  ప్రచారంతో హోరెత్తించారు. మరి, సినిమా ఎలా ఉంది? (Mem Famous Review)


కథ (Mem Famous movie story) : మయి అలియాస్ మహేష్ (సుమంత్ ప్రభాస్), దుర్గ (మణి ఏగుర్ల), బాలి అలియాస్ బాలకృష్ణ (మౌర్య చౌదర్య) స్నేహితులు. ఈ ముగ్గురూ ఆవారాగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు చేసే పనులకు ఊరిలో జనాలు ఇబ్బంది పడుతూ ఉంటారు. పంచాయతీ ప్రెసిడెంట్ జింక వేణు (కిరణ్ మచ్చా), అంజి మామ (అంజి మామ మిల్కూరి) మాత్రం మద్దతు ఇస్తారు. ఊరి జనాల చేత 'తూ' అనిపించుకున్న మయి... ఫేమస్ ఎలా అయ్యాడు? మామ కూతురు మౌనిక (సార్య లక్ష్మణ్)తో అతడి ప్రేమ కథ ఏమిటి? అది ఏ తీరానికి చేరింది? మధ్యలో ఫేమస్ టెంట్ హౌస్, ఫేమస్ టీవీ యూట్యూబ్ ఛానల్ కహానీ ఏమిటి? హీరో అండ్ ఫ్రెండ్స్ చేసిన పనుల వల్ల ఊరి సమస్యలు ఎలా తీరాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Mem Famous Telugu Movie Review) : పేపర్ మీద రాసిన సన్నివేశాన్ని స్క్రీన్ మీదకు తీసుకు రావడం అంత సులభం కాదు! ముఖ్యంగా కామెడీని! 100 పర్సెంట్ స్క్రీన్ మీదకు వస్తే? ఆ సినిమాకు బాక్సాఫీస్ బరిలో అడ్డు ఉండదు. అందుకు చక్కటి ఉదాహరణ... 'జాతి రత్నాలు'. ఇప్పుడు ఆ సినిమా ప్రస్తావన ఎందుకంటే... ఆ సినిమా స్ఫూర్తితో 'మేమ్ ఫేమస్' తీశారేమో అనిపిస్తుంది. ఈ సినిమాలో ముగ్గురు స్నేహితులు, ప్రారంభ సన్నివేశాల్లో 'జాతి రత్నాలు' ఛాయలు కొందరికి గుర్తు రావచ్చు. అయితే, ఆ సినిమాలో ఉన్నంత కామెడీ ఇందులో లేదు. కంపేరిజన్ పక్కన పెట్టి, కేవలం ఈ సినిమాకు వస్తే... 


'మేమ్ ఫేమస్'లో యూత్ ఫుల్ కామెడీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్... లిప్‌స్టిక్ స్పాయిలర్ క్యారెక్టర్ సీన్స్! కామన్ ఆడియన్ రిలేట్ చేసుకునే సీన్స్ కొన్ని ఉన్నాయి.  ఫ్రెండ్స్ మధ్యలో ఎమోషనల్ సీన్స్ బావున్నాయి. బావపై మరదలు ప్రేమను వ్యక్తం చేసే సన్నివేశంలో గాఢత యువతీ యువకుల్ని ఆకట్టుకుంటుంది. అయితే, కథలో డెప్త్ మిస్ అయ్యింది. 'రైతే రాజు' వంటి డైలాగులు చెప్పించడం కథా గమనంలో అతకలేదు. అలాగే, దుర్గతో తండ్రి రెండెకరాల భూమి సంపాదించిన విషయం చెప్పడం వంటివి స్పేస్ తీసుకుని మరీ ఏదో సందేశం ఇవ్వడానికి, బలవంతంగా భావోద్వేగాలను కథలో ఇరికించడానికి చేసిన ప్రయత్నంలా ఉంది.


కథలో కామెడీని, భావోద్వేగాలను బ్యాలన్స్ చేయడంలో దర్శకుడిగా సుమంత్ ప్రభాస్ తడబడ్డాడు. మొదటిసారి పంచాయతీ పెట్టినప్పుడు ఓకే. మళ్ళీ మళ్ళీ పంచాయతీ అంటే 'ఏందీ లొల్లి' అన్నట్టు ఉంది. ఫేమస్ కావడం చేసే ప్రయత్నాల్లో లిప్‌స్టిక్ స్పాయిలర్ సీన్స్ ఓకే. మిగతావి ఆల్రెడీ యూట్యూబ్ లో చూసిన సన్నివేశాలకు పేరడీలా ఉన్నాయి. అవి అంతగా ఆకట్టుకునేలా లేవు. కథలో కొత్తదనం కరువైంది. తెలంగాణ నేపథ్యంలో సీసా తీసుకుని పాత సరుకుతో నింపేశారు. 


విశ్రాంతి కోసం, ఆ తర్వాత శుభం కార్డు కోసం ఎదురుచూసేలా సినిమాను సాగదీశారు. నిడివి ఎక్కువైంది. కొన్ని అనవసరమైన సన్నివేశాలకు కత్తెర వేస్తే బావుండేది. సినిమాటోగ్రఫీ ఓకే. స్వరాల కంటే నేపథ్య సంగీతంలో కళ్యాణ్ నాయక్ ఎక్కువ ప్రతిభ చూపించారు. విశ్రాంతికి ముందు సన్నివేశాల్లో ఎమోషనల్ హై ఇచ్చారు. నిర్మాణ విలువలు కథకు తగ్గ స్థాయిలో ఉన్నాయి.


నటీనటులు ఎలా చేశారు? : హీరోగా సుమంత్ ప్రభాస్ ఓకే. ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు ఇంకా ఇంప్రూవ్ కావాలి. హీరో స్నేహితులుగా మణి, మౌర్య చక్కగా చేశారు. కమర్షియల్ కథానాయికలా కాకుండా పక్కింటి అమ్మాయిలా సార్య కనిపించారు. యూట్యూబర్ సిరి రాసికి స్క్రీన్ స్పేస్ ఉన్న క్యారెక్టర్ లభించింది. అంజి మామ, కిరణ్ మచ్చా, 'డీజే టిల్లు' ఫేమ్ మురళీధర్ గౌడ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. లిప్‌స్టిక్ స్పాయిలర్ పాత్రలో నటించిన శివ నందన్ కామెడీ టైమింగ్ బావుంది.    


Also Read : '2018' రివ్యూ : మలయాళంలో వంద కోట్లు వసూలు చేసిన సినిమా - ఎలా ఉందంటే?


చివరగా చెప్పేది ఏంటంటే? : కొన్ని కామెడీ సీన్లు, కొంత ఎమోషన్... 'మేమ్ ఫేమస్'లో ఉన్నది అంతే! పార్టులు పార్టులుగా ఎంజాయ్ చేస్తామనుకుంటే థియేటర్లకు వెళ్ళవచ్చు. లేదంటే ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయవచ్చు. టైటిల్‌లో ఫేమస్ ఉంది కానీ సినిమాలో ఫేమస్ అయ్యేంత స్టఫ్ లేదు.


Also Read '8 ఎఎం మెట్రో' రివ్యూ : 'మల్లేశం' దర్శకుడు తీసిన హిందీ సినిమా