సినిమా రివ్యూ : 2018 Everyone Is A Hero (ప్రతి ఒక్కరూ హీరో)
రేటింగ్ : 3.5/5
నటీనటులు : టోవినో థామస్, లాల్, అసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, తన్వి రామ్, అపర్ణ బాల మురళి, కున్‌చకో బోబన్, అజు వర్గీస్, నరైన్, కలైయారసన్ తదితరులు
ఛాయాగ్రహణం : అఖిల్ జార్జ్
సంగీతం : నోబిన్ పాల్
నిర్మాతలు : వేణు కున్నప్పిళ్లై, సీకే పద్మ కుమార్, ఆంటో జోసెఫ్
తెలుగులో విడుదల : 'బన్నీ' వాస్
రచన, దర్శకత్వం : జూడ్ ఆంథనీ జోసెఫ్
విడుదల తేదీ: మే 26, 2023


మలయాళంలో వసూళ్ళ రికార్డులు తిరగరాస్తున్న సినిమా '2018'. థియేటర్లలో ఈ నెల 5న విడుదలైంది. బాక్సాఫీస్ బరిలో చిరుజల్లులా మొదలైన చిత్రమిది. ఇంకా వసూళ్ళ సునామీ సృష్టిస్తోంది. ఒక్క మలయాళంలోనే వంద కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగులో ఈ చిత్రాన్ని 'బన్నీ' వాసు ఈ శుక్రవారం (మే 26న) విడుదల చేస్తున్నారు. ఓటీటీలో విడుదలైన 'మిన్నల్ మురళి', 'కాలా' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన టోవినో థామస్ (Tovino Thomas) ఇందులో హీరో. 'ఆకాశమే నీ హద్దురా' ఫేమ్ అపర్ణా బాలమురళి (Aparna Balamurali) ఓ పాత్ర చేశారు. లాల్ సహా పలువురు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయా? (2018 Telugu Review)  


కథ (2018 movie story) : అనూప్ (టోవినో థామస్)ది కేరళలోని చిన్న ఊరు. ఆర్మీ ఉద్యోగం మానేసి దుబాయ్ వెళ్ళడానికి వీసా కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆ ఊరికి చెందిన టీజర్ మంజు (తన్వి రామ్)తో పెళ్లి కుదురుతుంది. 


నిక్సన్ (అసిఫ్ అలీ)ది కేరళలోని సముద్ర తీర ప్రాంతం! పడవ మీద సముద్రంలో చేపల వేటకు వెళ్లడమే అతని తండ్రి (లాల్), అన్నయ్య (నరైన్) వృత్తి. నిక్సన్ మాత్రం మోడల్ కావాలని ప్రయత్నాలు చేస్తాడు.


సేతుపతి (కలైయారసన్) లారీ డ్రైవర్! అతనిది కేరళ సరిహద్దులోని తమిళనాడుకు చెందిన గ్రామం. మంచి నీరు లేక అవస్థలు పడే ఊరు. కేరళలోని ఓ ఫ్యాక్టరీని ధ్వంసం చేయడానికి బాంబులు కావాలని కొందరు అడిగితే అక్రమంగా సరఫరా చేయడానికి లారీ వేసుకుని వెళతాడు. 


కోషీ (అజు వర్గీస్) టాక్సీ డ్రైవర్! పోలాండ్ నుంచి ఫేమస్ యూట్యూబర్ వస్తే కేరళ మొత్తం తన టాక్సీలో చూపించే కిరాయి వస్తుంది. వీళ్ళు మాత్రమే కాదు... ఎంతో మంది జీవితాల్లో 2018 సంవత్సరంలో కేరళలోని వరదలు ఎటువంటి మార్పులు తీసుకు వచ్చాయి? ప్రకృతి కన్నెర్ర చేసిన సమయంలో మానవత్వం ఎలా వెల్లివిరిసింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.  


విశ్లేషణ (2018 Telugu Movie Review) : సినిమా విజువల్ పోయెట్రీ (దృశ్య కావ్యం) అని చెప్పడానికి '2018' ఒక ఉదాహరణ. సంగీతం, ఛాయాగ్రహణం, దర్శకత్వం... ఈ మూడు శాఖల సమష్టి కృషి ఫలితమే '2018'. కేరళ జనాలు ఈ సినిమాకు కనెక్ట్ కావడానికి కొన్నేళ్ళ క్రితం తమకు ఎదురైన విపత్తును తెరపై కళ్ళకు కట్టినట్లు జూడ్ ఆంథనీ జోసెఫ్ ఆవిష్కరించడం కారణమై ఉండొచ్చు. తమను తాము తెరపై పాత్రల్లో చూసుకుని ఉండొచ్చు. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో ఏమున్నాయ్? అని చూస్తే...


కోపం, భయం... తెరపై ఓ సన్నివేశం చూసేటప్పుడు రెండిటినీ ఒకేసారి అనుభూతి చెంది ఎన్ని రోజులు అయ్యింది? మనమే వెళ్లి సాయం చేసి రావాలన్నంత కసి ఎప్పుడు కలిగింది? '2018' చూస్తుంటే... మనలో ఆ భావోద్వేగాలు అన్నీ ఒకేసారి కలుగుతాయి. 'ఇక చాలు... వాళ్ళను ఎవరైనా సేవ్ చేస్తే చూడాలని ఉంది' అని మన మనసులో అనిపిస్తుంది. అంతలా దర్శకుడు జూడ్ ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. ముఖ్యంగా వికలాంగుడైన బాలుడు, అతని తల్లిదండ్రులు వరదల్లో చిక్కుకుని నిస్సహాయులై ఉన్నప్పుడు! తల్లి, కుమార్తెతో సేతుపతి ఫోనులో మాట్లాడినప్పుడు! రాతి గుండెలను సైతం కదిలించే సన్నివేశాలు అవి!


గర్భవతిని ఎయిర్ లిఫ్ట్ చేసే సీన్... సర్టిఫికెట్స్ కోసం ఇంట్లోకి నిక్సన్ వెళ్లే సీన్... ఇంకా చెబుతూ వెళితే బోలెడు సన్నివేశాలను చూసినప్పుడు ఉలిక్కి పడతాం. గుండెను గట్టిగా చేతులతో అదిమి పట్టుకుంటాం! తెరపై ఆ వరదల్లో మనమే చిక్కుకున్నట్లు ఫీలవుతాం. అందుకు కారణం... నోబిన్ పాల్ సంగీతం! ఆ మ్యూజిక్ అంత ఎఫెక్ట్ చూపించింది. అఖిల్ జార్జ్ కెమెరా వర్క్ సైతం అంతే గొప్పగా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉంది. డ్యామ్ నుంచి చేప రాయి మీద పడే సీన్ నుంచి మొదలు పెడితే వరదలను చూపించడం వరకు... ఎన్నో సన్నివేశాలు ఆశ్చర్యపరుస్తాయి.


విశ్రాంతి తర్వాత కొన్ని సన్నివేశాల్లో దర్శకుడిగా అత్యుత్తమ ప్రతిభ చూపిన జూడ్ ఆంథనీ జోసెఫ్... సినిమా మొత్తంగా చూస్తే దర్శకుడిగా కంటే కథకుడిగా ఎక్కువ ఆకట్టుకుంటారు. అంత పకడ్బందీగా కథనం రాసుకున్నారు. సినిమా ప్రారంభమైన కాసేపటికి 'ఇందులో ఏముంది? ఎందుకు ఇంత పొగుడుతున్నారు?' అనిపిస్తుంది. తెరపై చాలా పాత్రలు వస్తాయి. అన్ని పాత్రలను చూడటం ఒకింత గందరగోళంగా కూడా ఉంటుంది. ఒక దానికి మరొక దానికి పొంతన లేదనిపిస్తుంది. విశ్రాంతి తర్వాత ఒక్కో పాత్రను కలుపుతూ, ఒక్క చోటుకు చేర్చుతూ ముందుకు వెళుతూ ఉంటుంటే ఉత్కంఠ పెరుగుతూ ఉంటుంది. కథ ముగిసిందని అనుకున్న ప్రతిసారీ మలుపు వచ్చింది. మ్యాగ్జిమమ్ పాత్రలకు కాంటాక్ట్ పాయింట్ టోవినో థామస్! 


ప్రభుత్వ ప్రమేయాన్ని తక్కువ చేసి చూపించడం, ముఖ్యమంత్రి పాత్రకు పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వకుండా చూపడం నిడివి పెంచినట్లు అనిపిస్తుంది. ప్రభుత్వం, అధికారులు, మీడియా ప్రతినిథులు వరదల సమయంలో కష్టపడ్డారు. కానీ, సినిమా మొత్తం ప్రజల కోణంలోనే ఉంది. మానవత్వం, తోటి మనుషుల కోసం ఇతరులు నిలబడిన తీరుపై దర్శకుడు దృష్టి పెట్టారు.టోవినో థామస్ పాత్రకు ఇచ్చిన ముగింపు సైతం తెలుగు ప్రేక్షకులు హర్షించే విధంగా లేదు. కున్‌చకో బోబన్ పాత్రను మరింత ఉపయోగించుకోవాల్సింది. మీడియా కవరేజ్ సైతం ఆశించిన రీతిలో చూపించలేదు. కేరళ వరదల నేపథ్యం కనుక మలయాళీలు కనెక్ట్ అయినంత తెలుగు వాళ్ళు కనెక్ట్ కాలేరేమో! '2018'లో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అయితే... అన్నిటి కంటే మానవత్వమే గొప్పదని ఇచ్చిన సందేశం ముందు ఆ చిన్న చిన్న తప్పుల్ని క్షమించి చూసేయొచ్చు.


నటీనటులు ఎలా చేశారు? : అనూప్ పాత్రలో టోవినో థామస్ జీవించారు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు చూస్తే... అతని క్యారెక్టర్ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేస్తుంది. చావును చూసి భయపడి ఆర్మీ నుంచి వచ్చిన వ్యక్తి, ఆ చావుకు ఎదురెళ్లి మరీ ప్రాణాలు కాపాడటం కదిలిస్తుంది.


టోవినో తర్వాత తెలుగు ప్రేక్షకులకు నటుడు లాల్! మత్యకారునిగా ఇరగదీశారు. ఆయన సన్నివేశాల్లో హీరోయిజం ఎలివేట్ అయ్యింది. అపర్ణ బాలమురళి పాత్ర నిడివి తక్కువే. అసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాస్, కున్‌చకో బోబన్, తన్వి రామ్... ప్రతి ఒక్కరు తమ పాత్రలకు న్యాయం చేశారు. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు తక్కువ ఉండటం కూడా సినిమాకు మైనస్.


Also Read : '8 ఎఎం మెట్రో' రివ్యూ : 'మల్లేశం' దర్శకుడు తీసిన హిందీ సినిమా


చివరగా చెప్పేది ఏంటంటే? : పెను తుఫాను సైతం చిరుజల్లులతో మొదలు అవుతుంది. '2018' ప్రారంభం సైతం ఆ విధంగానే ఉంటుంది. అయితే, ముగింపు వచ్చేసరికి గుండెలను బరువెక్కిస్తుంది. కొన్నేళ్ళ క్రితం జరిగిన విపత్తును కళ్ళకు కట్టినట్లు చూపించిన చిత్రమిది. ఉత్కంఠతో పాటు ఉద్రేకానికి గురి చేసే చిత్రమిది. గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమాల్లో ఇదీ ఒకటి. ప్రేమ - పగ, కులం - మతం, ప్రాంతం - నేపథ్యం, జీవిత లక్ష్యం - పంతం... అన్నిటి కంటే మానవత్వం ముఖ్యమని చెప్పే చిత్రమిది. డోంట్ మిస్ ఇట్!


Also Read : 'డెడ్ పిక్సెల్స్' రివ్యూ : మెగా డాటర్ నిహారిక వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?