వెబ్ సిరీస్ రివ్యూ : సైతాన్
రేటింగ్ : 3/5
నటీనటులు : రిషి, షెల్లీ, రవి కాలే, దేవయాని శర్మ, జాఫర్ సాదిక్, నితిన్ ప్రసన్న, కామాక్షీ భాస్కర్ల, మణికందన్ తదితరులు
ఛాయాగ్రహణం : షణ్ముగ సుందరం
సంగీతం : శ్రీరామ్ మద్దూరి
నిర్మాతలు : మహి వి రాఘవ్, చిన్నా వాసుదేవ్ రెడ్డి
రచన, దర్శకత్వం : మహి వి రాఘవ్
విడుదల తేదీ: జూన్ 15, 2023
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
ఎపిసోడ్స్ : 9
'సైతాన్' (Shaitan Web Series) ప్రచార చిత్రాలు సంచలనం సృష్టించాయి. బోల్డ్ సీన్స్ & బూతులతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. 'ఆనందో బ్రహ్మ', 'యాత్ర' చిత్రాలు తీసిన మహి వి. రాఘవ్ (Mahi V Raghav) దీనికి దర్శకుడు కావడంతో 'ఆయన ఇలా తీశారేంటి?' అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. క్రియేటర్ & నిర్మాతగా క్లీన్ కామెడీ హిట్ వెబ్ సిరీస్ 'సేవ్ ద టైగర్స్' తర్వాత ఆయన నుంచి 'సైతాన్' రావడం కూడా డిస్కషన్ పాయింట్ అయ్యింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికలో విడుదలైన ఈ వెబ్ సిరీస్ (Shaitan Web Series Review) ఎలా ఉంది?
కథ (Shaitan Web Series Story) : బాలి (రిషి), జయ (దేవయాని శర్మ), గుమ్తి (జాఫర్ సాధిక్)... సావిత్రి (షెల్లీ నబు కుమార్)కు ముగ్గురు పిల్లలు. భర్త వదిలేసి వెళ్లడంతో పిల్లల పోషణ కోసం ఓ పోలీసుకు ఉంపుడుగత్తెగా ఉంటుంది. తల్లి గురించి ఇరుగు పొరుగు, సమాజంలో నలుగురు నానా మాటలు అంటుంటే బాలి తల దించుకుని తిరగాల్సి వస్తుంది. తల్లి కోసం వచ్చే పోలీస్ కన్ను చెల్లి మీద పడటంతో అతని తల తెగ నరుకుతాడు.
మొదటిసారి తల్లిని ఉంచుకున్న పోలీసును చంపిన కేసులో బాలి జైలుకు వెళ్లి వస్తాడు. ఆ తర్వాత ఎంత మందిని చంపాడు? దళంలోకి ఎలా వెళ్ళాడు? దళ నాయకత్వంతో గొడవలు ఏమిటి? ఏకంగా హోమ్ మంత్రి నుదుటి మీద తుపాకీ పెట్టి బెదిరించే స్థాయికి ఎలా ఎదిగాడు? బాలి ప్రయాణంలో కళావతి (కామాక్షీ భాస్కర్ల), పోలీస్ అధికారి నాగిరెడ్డి (రవి కాలే) పాత్రలు ఏమిటి? ప్రశ్నలకు సమాధానాలు వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Shaitan Web Series Review) : కత్తి పట్టినోడు చివరికి కత్తి వేటుకు బలి అవ్వక తప్పదని చరిత్ర చెప్పింది. బాలి జీవితమూ అంతే! అతనూ బాధితుడే! తప్పనిసరి పరిస్థితుల్లో తప్పులు చేయడం మొదలు పెట్టి, చివరకు తనువు చాలించిన నేరస్థుల నేపథ్యంలో కథలతో కొన్ని సినిమాలు తెరకెక్కాయి. వాటికి, 'సైతాన్'కి వ్యత్యాసం ఏమిటంటే... బోల్డ్ ఫిల్మ్ మేకింగ్! బోల్డ్ అంటే ఎరోటిక్ లేదా రొమాంటిక్ సీన్స్ అని చెప్పే ఉద్దేశం కాదు, హార్డ్ రియాలిటీని బలంగా చెప్పడం!
'సైతాన్'లో తలలు తెగి పడిన దృశ్యాలు ఉన్నాయి. మహిళలను బలాత్కరించిన సన్నివేశాలు ఉన్నాయి. రాయలేని భాషలో డైలాగులు ఉన్నాయి. ప్రచార చిత్రాలు చూస్తే... సిరీస్ మీద ఓ అంచనా ఏర్పడుతుంది. ఆ అంచనాలకు తగ్గట్టు సిరీస్ ఉంది. 'సైతాన్' అంటే హింస, శృంగారం, బూతులే కాదు... అంతకు మించి! బాలి, అతని కుటుంబ సభ్యులు హత్యలు చేస్తుంటే... వాళ్ళు అలా చేయడంలో తప్పు లేదని భావించే స్థాయిలో మహి వి. రాఘవ్ సిరీస్ తెరకెక్కించారు. కెమెరా వర్క్, మ్యూజిక్ 'రస్టిక్ అండ్ రా' ఎఫెక్ట్ తీసుకురావడంలో కాస్త హెల్ప్ అయ్యాయి.
బిడ్డలకు ఏ తల్లి సంజాయిషీ చెప్పుకొనే పరిస్థితి రాకూడదని బాలి చెప్పే సీన్ గానీ... మాటలు రాని ఆటో డ్రైవర్‌ను జయ కౌగిలించుకునే సీన్ గానీ... ఎమోషనల్‌గా ఉంటాయి. అయితే... కటువైన సంభాషణలు, ఘాటైన సన్నివేశాల నడుమ అటువంటివి చిన్నబోయాయి. భర్త లేని మహిళ మరో పురుషుడితో సంబంధం పెట్టుకుంటే ఆమెపై 'లం...' అని ముద్ర వేసే సమాజం, ఆ మగాడికి ఎందుకు ఏ పేరు పెట్టలేదు? అని సమాజాన్ని ప్రశ్నించారు. అయితే... ఇతర సంభాషణల మధ్య అది రిజిస్టర్ కావడం కష్టమే. మాటల్లో ఘాటు తగ్గించడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. అయితే, ఆ విషయంలో దర్శకుడు క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకున్నారు.
మొదటి ఎపిసోడ్ నుంచి... 'సైతాన్' ప్రపంచంలోకి మహి వి. రాఘవ్ తీసుకు వెళ్లారు. జైల్లో దందాలు, సెటిల్మెంట్స్ చేయడం వంటివి గతంలో కొన్ని సినిమాల్లో చూసుంటారు. దళం సభ్యుడొకరు జైల్లో డీల్స్ మాట్లాడుతుంటే అవేవీ గుర్తుకు రావు. మహి బోల్డ్ టేకింగ్ అలా ఉంది మరి! బాలి అండ్ ఫ్యామిలీ నుంచి కథ పక్కకి జరిగినప్పుడు కాస్త డౌన్ అయ్యింది. దళం, పోలీస్ నేపథ్యంలో సీన్స్ అంతగా ఆకట్టుకోలేదు. లెంగ్త్ పెంచినట్టు అనిపించాయి. హోమ్ మంత్రికి ఓ రౌడీ షీటర్ ధమ్కీ ఇచ్చి వెళ్లిపోవడం సాధ్యమేనా? వంటి లాజిక్స్ తీస్తే సిరీస్ చూడలేం. బోల్డ్ మేకింగ్ కారణంగా అందరూ కలిసి చూడలేరు. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కు సిరీస్ పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
నటీనటులు ఎలా చేశారు? : బాలి పాత్రలో రిషి ఒదిగిపోయారు. కోపం, దుఃఖం, ఆవేశాన్ని చక్కగా చూపించారు. జయప్రదగా దేవయాని శర్మను చూస్తే... 'సేవ్ ద టైగర్స్'లో చైతన్యకృష్ణ జోడీగా, లాయర్ రోల్ చేసింది ఈమేనా? అనిపిస్తుంది. అంత వ్యత్యాసం చూపించారు. డీ గ్లామర్ లుక్‌లో బోల్డ్ యాక్టింగ్ చేశారు. జాఫర్ బదులు మరొకరిని ఆ పాత్రలో ఊహించుకోలేం. కామాక్షీ భాస్కర్ల, షెల్లీ, రవి కాలేకి సవాల్ విసిరే పాత్రలు కావవి. ఈజీగా పాత్రలకు తగ్గట్టు నటించారు.
Also Read : 'బ్లడీ డాడీ' రివ్యూ : జియో సినిమాలో షాహిద్ కపూర్ యాక్షన్ థ్రిల్లర్ - ఎలా ఉందంటే?
చివరగా చెప్పేది ఏంటంటే? : 'సైతాన్' రాత, తీత విషయంలో మహి వి. రాఘవ్ బోర్డర్స్ ఏం పెట్టుకోలేదు. దీనిని దేనితోనూ కంపేర్ చేయలేం. తెలుగులో ఇప్పటి వరకు ఈ తరహా సిరీస్ రాలేదు. 'సైతాన్' టీజర్, ట్రైలర్ చూసి సిరీస్ స్టార్ట్ చేసిన జనాలను డిజప్పాయింట్ చేయదు. ఎంగేజ్ చేస్తుంది. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. ఇది పెద్దలకు మాత్రమే!
PS : ఆల్రెడీ మహి వి. రాఘవ్ చెప్పినట్టు ఫ్యామిలీతో చూసే సిరీస్ కాదిది. ఫ్యామిలీ టైప్ కథలు కోరుకునే ప్రేక్షకులు 'సైతాన్'ను దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రతి మనిషిలోనూ కొంత జంతు ప్రవృత్తి ఉంటుంది. మృగం (సైతాన్) దాగి ఉంటుంది. ఆ ఇగోను ఎంటర్టైన్ చేసే సిరీస్ 'సైతాన్'.
Also Read : 'టక్కర్' రివ్యూ : మాస్ యాక్షన్ హీరో కావాలని సిద్ధార్థ్ ట్రై చేస్తే?