సినిమా రివ్యూ: 'జేమ్స్'
రేటింగ్: 2.5/5
నటీనటులు: పునీత్ రాజ్ కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, ఆదిత్య మీనన్, శరత్ కుమార్, అను ప్రభాకర్ తదితరులతో పాటు అతిథి పాత్రలో శివ రాజ్ కుమార్ 
సినిమాటోగ్రఫీ: స్వామి జె. గౌడ 
సంగీతం: చరణ్ రాజ్ 
నిర్మాత: కిషోర్ పత్తికొండ 
దర్శకత్వం: చేతన్ కుమార్ 
విడుదల తేదీ: మార్చి 17, 2022


పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar)కు గుండెపోటు వస్తుందని గానీ, అకాల మరణం చెందుతారని గానీ ఎవరూ ఊహించలేదు. ఆయన మరణించే సమయానికి 'జేమ్స్' (James Movie) సినిమా అండర్ ప్రొడక్షన్‌లో ఉంది. పునీత్ డబ్బింగ్ చెప్పలేదు. దివంగత కథానాయకుడికి నివాళిగా సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కన్నడలో తమ్ముడి పాత్రకు అన్నయ్య శివ రాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పారు. తెలుగులో డబ్బింగ్ ఆర్టిస్ట్ చేత చెప్పించారు. సినిమాను పూర్తి చేసి నేడు పునీత్ జయంతి (Puneeth Rajkumar Birth Anniversary) సందర్భంగా  విడుదల చేశారు (James Movie Release Day). కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్స్ విడుదల చేశారు. ప్రియా ఆనంద్ (Priya Anand) కథానాయికగా, టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా (James Movie Review In Telugu) ఎలా ఉంది?


కథ: విజయ్ గైక్వాడ్ (శ్రీకాంత్) తండ్రి వ్యాపారవేత్త. వేల కోట్ల ఆస్తిపరుడు. ఆయనపై ఎవరో ఎటాక్ చేయడంతో మరణిస్తారు. తనకూ ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందేమో అని గుండె ధైర్యం కల వ్యక్తిని సెక్యూరిటీగా నియమించమని స్నేహితుడు (ఆదిత్య మీనన్)కి విజయ్ చెబుతాడు. అప్పుడు సంతోష్ కుమార్ (పునీత్ రాజ్ కుమార్) గురించి తెలుస్తుంది. సెక్యూరిటీ కోసం అతడిని తీసుకుంటారు. విజయ్, అతని చెల్లెలు నిషా గైక్వాడ్ (ప్రియా ఆనంద్), ఇతర కుటుంబ సభ్యులను కంటికి రెప్పలా సంతోష్ కాపాడతాడు. వాళ్ళందరూ తనను పూర్తిగా నమ్మిన తర్వాత సంతోష్ ఎదురు తిరుగుతాడు. విజయ్ సెక్యూరిటీని చంపేస్తాడు. అలా ఎందుకు చేశాడు? ఆర్మీలో పని చేసే సంతోష్ బోర్డర్ వదిలి హైదరాబాద్ ఎందుకు వచ్చాడు? డ్రగ్ మాఫియాకు, విజయ్ ఫ్యామిలీకి, సంతోష్ కుమార్‌కు లింక్ ఏంటి? అసలు, జేమ్స్ ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ: 'జేమ్స్'... కమర్షియల్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ... కన్నడ ప్రేక్షకుల్లో, కర్ణాటకలో పునీత్ స్టార్‌డ‌మ్‌ను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా. హీరోయిజం ఎలివేట్ చేసే సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాల్లో హీరో ఎలివేషన్ షాట్స్ చాలా ఉన్నాయి. పునీత్ అభిమానులకు అవన్నీ నచ్చుతాయి. మరి, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయా? అంటే... కష్టమే!


కథ, కథనం పరంగా చూస్తే... 'జేమ్స్'లో తెలుగు చిత్రాల ఛాయలు కనిపిస్తాయి. ఆ సినిమాలో యాక్షన్ సీన్లు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. ఆల్రెడీ చూసినట్టు ఉంటాయి. పైగా, కామెడీ సన్నివేశాలకూ కనెక్ట్ కావడం కష్టమే. నేటివిటీ మిస్ కావడంతో కామెడీలో ఫీల్ లేదు, నవ్వులు రాలేదు. అందువల్ల, సగటు తెలుగు ప్రేక్షకులకు ఇదొక సాధారణ కమర్షియల్ సినిమాగా అనిపిస్తుంది. కన్నడ ప్రేక్షకులకు ఇదొక సరికొత్త స్టైలిష్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌. పునీత్ మరణించిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు.


పునీత్ ఇమేజ్‌కు తగ్గట్టు దర్శకుడు చేతన్ కుమార్ సినిమా తీశారు. కమర్షియల్ ఫార్మాట్‌లో కథ రాసుకున్నారు. కానీ, కొత్తదనం మీద దృష్టి పెట్టలేదు. యాక్షన్ సన్నివేశాలు పర్వాలేదు. బాగా తీశారు. సినిమాటోగ్రఫీ, సంగీతం పర్వాలేదు. కమర్షియల్ సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. నిర్మాణంలో రాజీ పడలేదని ప్రతి ఫ్రేమ్‌లో తెలుస్తోంది.


నటీనటుల విషయానికి వస్తే... కథానాయకుడి పాత్రకు పునీత్ రాజ్ కుమార్  వందకు రెండొందల శాతం న్యాయం చేశారు. స్టైలిష్‌గా కనిపించారు. యాక్టింగ్ పరంగా పర్ఫెక్షన్ చూపించారు. ముఖ్యంగా ఫైట్స్‌లో చాలా బాగా చేశారు. ప్రియా ఆనంద్ పాత్ర నిడివి తక్కువ. ఉన్నంతలో ఆమె బాగా చేశారు. శ్రీకాంత్, ఆదిత్య మీనన్, శరత్ కుమార్, ముఖేష్ రుషి తదితరులకు ఇటువంటి పాత్రలు చేయడం కొత్త కాదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో క్యారెక్టర్స్ కావడంతో అలవోకగా నటించారు. శివ రాజ్ కుమార్ అతిథి పాత్రలో కనిపించారు. ఇంట్రడక్షన్ సాంగ్‌లో హీరోయిన్లు రచితా రామ్, శ్రీలీల సహా కొంతమంది కన్నడ సంగీత దర్శకుడు తళుక్కున మెరిశారు.


Also Read: 'మారన్' రివ్యూ: కార్తీక్, ధనుష్ కలిసి ఇలా చేశారేంటి?


కన్నడ ప్రేక్షకులకు 'జేమ్స్' సినిమా కాదు, ఒక ఎమోషన్. పునీత్‌కు నివాళిగా అక్కడి ప్రేక్షకులు చూస్తున్నారు. కన్నడ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు సినిమాలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా పునీత్ పాత్రకు కన్నడలో శివ రాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పడం ఎమోషనల్ మూమెంట్. కన్నడలో ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ సాధించే అవకాశాలు ఉన్నాయి. పునీత్ 'పవర్'ఫుల్ యాక్షన్ చూడాలనుకునే తెలుగు ప్రేక్షకులు సినిమాకు వెళ్లొచ్చు.


Also Read: ది ఆడం ప్రాజెక్ట్ రివ్యూ: సీటు నుంచి కదలనివ్వని టైం ట్రావెల్ డ్రామా!