సినిమా రివ్యూ: ది ఆడం ప్రాజెక్ట్ 
రేటింగ్: 3/5
నటీనటులు: ర్యాన్ రెనాల్డ్స్, మార్క్ రఫాలో, వాకర్ స్కోబెల్, జో సల్దానా తదితరులు
సినిమాటోగ్రఫీ: టోబియాస్ ష్లీజర్ 
సంగీతం: రాబ్ సైమన్సన్
నిర్మాత:  నెట్‌ఫ్లిక్స్ 
దర్శకత్వం: షాన్ లెవీ
విడుదల తేదీ: మార్చి 11, 2022 (నెట్‌ఫ్లిక్స్)


డెడ్‌పూల్ సినిమాల్లో హీరోగా కనిపించే ర్యాన్ రెనాల్డ్స్, అవెంజర్స్‌లో హల్క్‌గా కనిపించే మార్క్ రఫాలో ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది ఆడమ్ ప్రాజెక్ట్’ సినిమా ప్రకటించిన నాటి నుంచే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్లు మంచి యాక్షన్ సినిమా చూడబోతున్నామనే అంచనాలను కలిగించాయి. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా రిలీజ్ అయింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే?


కథ: 12 సంవత్సరాల ఆడమ్ రీడ్ (వాకర్ స్కోబెల్) ఆస్తమా సమస్యతో బాధ పడుతూ ఉంటాడు. తండ్రి చనిపోవడంతో తల్లి దగ్గర పెరుగుతూ ఉంటాడు. అయితే సడెన్‌గా ఒకరోజు 2050 సంవత్సరం నుంచి పెద్ద వయసు ఉన్న ఆడమ్ రీడ్ (డెడ్‌పూల్ ఫేమ్ ర్యాన్ రెనాల్డ్స్) 2022 సంవత్సరానికి వస్తాడు. అయితే అతను 2018 సంవత్సరానికి వెళ్లబోయి 2022కి వచ్చినట్లు చెబుతాడు. పెద్ద ఆడమ్ రీడ్ గతంలోకి ఎందుకు వచ్చాడు? తన అసలు లక్ష్యం ఏంటి? టైం ట్రావెల్‌ను ఎవరు కనిపెట్టారు? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ: సాధారణంగా టైం ట్రావెల్ యాక్షన్ సినిమాలు పూర్తిగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతాయి. కానీ ది ఆడమ్ ప్రాజెక్ట్‌లో కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో పాటు మనసుకు హత్తుకునే హృద్యమైన సన్నివేశాలు ఉన్నాయి. అన్ని రకాల ఎమోషన్స్‌కు తగ్గట్లు దర్శకుడు షాన్ లెవీ ఈ సినిమాను రాసుకున్నాడు. అవి స్క్రీన్ మీదకు కూడా అద్భుతంగా ట్రాన్స్‌లేట్ అయ్యాయి. తండ్రి ఒకేసారి తన ఏకైక కొడుకుని మూడు వేర్వేరు వయస్సుల్లో కలిస్తే అతని ఎమోషన్స్ ఎలా ఉంటాయి? చనిపోయిన తండ్రిని తిరిగి చూస్తున్న ఒక వ్యక్తి 12 సంవత్సరాల బాలుడు, 40 సంవత్సరాల మధ్య వయస్కుడు ఎలా రియాక్ట్ అవుతారు? ఇటువంటి సన్నివేశాలు స్క్రీన్ మీదకు అద్భుతంగా ట్రాన్స్‌లేట్ అయ్యాయి.


దీంతోపాటు ఆడమ్ రీడ్, తన భార్య లారా (జో సల్దానా)ల మధ్య జరిగే సన్నివేశాలు కూడా షాన్ బాగా తీశారు. సినిమా నిడివి కూడా కేవలం గంటా 46 నిమిషాలు మాత్రమే. తక్కువ రన్‌టైంలోనే క్రిస్ప్‌గా సినిమాను రూపొందించాడు. ఇక రాబ్ సైమన్సన్ అందించిన నేపథ్య సంగీతం యాక్షన్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసి... ఫ్యామిలీకి సంబంధించిన సన్నివేశాలను మరింత హృద్యంగా మార్చింది. టోబియాస్ ష్లీజర్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.


నటీనటుల విషయానికి వస్తే... ప్రధానంగా ర్యాన్ రెనాల్డ్స్ గురించి చెప్పుకోవాలి. డెడ్ ఫూల్, ఫ్రీ గయ్ లాంటి సినిమాల్లో తనకు ఎమోషనల్ సీన్లలో ఎక్కువ పెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ లభించలేదు. కానీ ఇందులో ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉండటంతో తనలోని నటుడిని బయటకు తీసి పాత్రతో ప్రేక్షకులు ఎమోషనల్ కనెక్ట్ అయ్యేలా చేశాడు. ఇక 12 సంవత్సరాల నాటి ఆడమ్ రీడ్‌గా నటించిన వాకర్ స్కోబెల్ కూడా అద్భుతంగా నటించాడు. మిగతా పాత్రల్లో నటించిన వారు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.


ఓవరాల్‌గా చెప్పాలంటే... సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇష్టపడేవారు మిస్ అవ్వకూడని సినిమా ఇది.