సినిమా రివ్యూ: మారన్ 
రేటింగ్: 2/5
నటీనటులు: ధనుష్, మాళవికా మోహనన్, సముద్రఖని తదితరులు 
సినిమాటోగ్రఫీ: వివేకానంద్ సంతోషమ్ 
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
సమర్పణ: టి.జి. త్యాగరాజన్ 
నిర్మాతలు: సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ 
కథ, దర్శకత్వం: కార్తీక్ నరేన్ 
విడుదల తేదీ: మార్చి 11, 2022 (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీలో)


ధనుష్ (Dhanush) ఇమేజ్ తమిళ తెరను చాలా రోజులు అయ్యింది. ఓటీటీలకు ఆదరణ పెరగక ముందు కొన్ని హిందీ సినిమాలు చేశారు. తమిళం నుంచి తెలుగుకు అనువాదమైన 'రఘువరన్ బీటెక్' వంటి సినిమాలు విజయాలు సాధించాయి. ఓటీటీలకు ఆదరణ పెరిగిన తర్వాత 'అసురన్', 'కర్ణన్' వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు సైతం చూశారు. 'అసురన్'ను 'నారప్ప'గా వెంకటేష్ రీమేక్ చేయడం, 'కర్ణన్' రీమేక్ హక్కుల కోసం తెలుగు నిర్మాతలు పోటీ పడటం కూడా ధనుష్ సినిమాలపై తెలుగు ప్రేక్షకుల ఆసక్తికి కారణమైంది. ప్రస్తుతం తెలుగు, తమిళ బైలింగ్వల్ సినిమా 'సార్' చేస్తున్నారు  ధనుష్. ఈ నేపథ్యంలో 'మారన్' (Maaran Review) విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? ధనుష్ సరసన మాళవికా మోహనన్ (Malavika Mohanan) ఎలా నటించారు? దర్శకుడు కార్తీక్ నరేన్ (Karthick Naren) సినిమా ఎలా తీశారు? 


కథ: 'ఎవరు ఏం చెప్పినా నమ్మని ప్రజలు ఒక పాత్రికేయుడు చెబితే నమ్ముతారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం మన బాధ్యత కదా!' అని చెప్పే జర్నలిస్ట్ సత్యమూర్తి (రాంకీ). ఒక స్కామ్ గురించి బయట పెట్టడంతో ఆయన్ను చంపేస్తారు. చిన్న వయసులో తల్లిదండ్రులను కోల్పోయిన సత్యమూర్తి కుమారుడు మారన్ (ధనుష్) కూడా పెద్దవాడైన తర్వాత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అవుతాడు. తండ్రి బాటలో నడుస్తూ ఎటువంటి బెదిరింపులకు లోను కాకుండా స్కామ్స్ బయట పెడుతూ ఉంటాడు. మారన్ వార్తల వల్ల మాజీ మంత్రి పళని (సముద్రఖని) చిక్కుల్లో పడతాడు. అదే సమయంలో మారన్ చెల్లెలు మరణిస్తుంది. మారన్ చెల్లెల్ని చంపింది ఎవరు? ఆ హత్యకు కారణం పళనియేనా? చెల్లెలు మరణించిన తర్వాత మారన్ ఏం చేశాడు? అతని ప్రయాణంలో తార (మాళవికా మోహనన్) పాత్ర ఏమిటి? అనేది మిగతా సినిమా.     


విశ్లేషణ: రాజకీయం, జర్నలిజం... ఈ రెండిటి నేపథ్యంలో థ్రిల్లర్ సినిమా అంటే 'రంగం' గుర్తుకు వస్తుంది. ఇప్పుడు సేమ్ జానర్ సినిమా ధనుష్ చేశాడు. అయితే, ఇందులో కొత్తదనం ఉంటుందని ఆశిస్తే పొరపాటే. హీరో తండ్రిని పరిచయం చేసే సన్నివేశాలు, ఆయన మర్డర్ సినిమాపై ఆసక్తి కలిగించాయి. అయితే, ఆ ఆసక్తి సన్నగిల్లడానికి ఎంతోసేపు పట్టలేదు. హీరో చైల్డ్ హుడ్ ఎపిసోడ్ నుంచి రొటీన్ డ్రామా మొదలవుతుంది. హీరో, అతని చెల్లెలి మధ్య సన్నివేశాలు మాత్రమే కాదు... డైలాగులు కూడా ఊహించేలా ఉన్నాయి. ఇక, ట్విస్టుల సంగతి చెప్పనవసరం లేదు. పోలీసుల కంటే ముందుగా ప్రతి విషయాన్ని హీరో ఛేదిస్తూ ఉంటాడు. హీరో కదా... అంతేనని సరిపెట్టుకోవాలి. క్లైమాక్స్ ట్విస్ట్, ఆ ఎపిసోడ్ ఒక్కటీ కొంతలో కొంత పర్వాలేదు.


దర్శకుడిగా తొలి సినిమా (ధ్రువంగల్ పత్తినారు... డి-16)తో కార్తీక్ నరేన్ పేరు తెచ్చుకున్నారు. అది తెలుగులోనూ విజయం సాధించింది. ఆ సినిమా తీసిన దర్శకుడు, 'మారన్' తీశాడంటే నమ్మడం కష్టంగా ఉంటుంది. ఒక్కటంటే ఒక్కటీ థ్రిల్ మూమెంట్ లేకుండా ఫ్లాట్‌గా, రొటీన్ సన్నివేశాలతో 'మారన్' సాగింది. హీరోను స్టయిల్‌గా చూపించడం, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం మీద పెట్టిన దృష్టి... కథ, కథనాలపై పెట్టలేదు. నిజం చెప్పాలంటే... సినిమాలో బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్, రాజకీయ నాయకులు ఈవీఎంలు ట్యాపంరింగ్ చేస్తారనే పాయింట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంచి థ్రిల్లర్ తీసే అవకాశాలు ఉన్నాయి. అయితే, మంచి సినిమా తీయడంలో ఫెయిల్ అయ్యారు.


Also Read: సూర్య ఈటి - ఎవ‌రికీ త‌ల‌వంచ‌డు మూవీ రివ్యూ: తమిళ ప్రేక్షకుల కోసమేనా? తెలుగు గురించి ఆలోచించరా?


స్కిప్ట్ వీక్‌గా ఉండటంతో ధనుష్ నటన కూడా సినిమాను కాపాడలేకపోయింది. ఇక, మాళవికా మోహనన్ క్యారెక్టర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ధనుష్ - మాళవిక మధ్య సీన్స్ మరీ రొటీన్. ఫ్లైట్ సీన్ అయితే పరాకాష్ట. సముద్రఖని రోల్ కూడా రొటీన్. 'ఆడుకాలమ్' నరేన్, జయప్రకాశ్, మహేంద్రన్ తదితరుల పాత్రలు కూడా ఏమంత గొప్పగా లేవు. 'మారన్' నిడివి తక్కువే. కానీ, సినిమా రొటీన్ కథ, కథనాల వల్ల సినిమా సాగదీసినట్టు ఉంటుంది. ఈజీగా స్కిప్ కొట్టొచ్చు.


Also Read: ‘రాధే శ్యామ్’ రివ్యూ: విక్రమాదిత్య మెప్పించాడా?