సినిమా రివ్యూ: ఈటి - ఎవరికీ తలవంచడు
రేటింగ్: 2/5
నటీనటులు: సూర్య, ప్రియాంకా అరుల్ మోహన్, సత్యరాజ్, శరణ్య, వినయ్ రాయ్, దేవదర్శిని తదితరులు
సినిమాటోగ్రఫీ: రత్నవేలు
సంగీతం: డి. ఇమాన్ నిర్మాత: కళానిధి మారన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పాండిరాజ్
విడుదల తేదీ: మార్చి 10, 2022
సూర్య సినిమా థియేటర్లలోకి వచ్చి రెండేళ్లు దాటింది. ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాలు ఓటీటీల్లో విడుదల అయ్యాయి. ఈ నేపథ్యంలో సూర్య సినిమా కోసం తమిళనాడులో ఆయన ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు. ఓటీటీ వేదికల్లో విడుదలైన రెండు సినిమాలు బయోపిక్స్ అయితే... ఈటి (ఎవరికీ తలవంచడు) మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ ఫిల్మ్. తమిళంతో పాటు తెలుగులో నేడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది?
కథ: కృష్ణ మోహన్ (సూర్య) లాయర్. తండ్రి (సత్యరాజ్), తల్లి (శరణ్య)తో చాలా సరదాగా ఉంటాడు. అతడిది హ్యాపీ ఫ్యామిలీ లైఫ్. అయితే... అతడిని ఎప్పుడూ వెంటాడే ఆ ఎమోషన్ చెల్లి. ఆమె కనిపించదు. కానీ, అన్నయ్యా అనే పిలుపు వినిపించిన ప్రతిసారీ కృష్ణమోహన్ భావోద్వేగానికి గురవుతాడు. అందుకేనేమో, ఆడపిల్లకు అన్యాయం జరిగిందని తెలిస్తే వెంటనే స్పందిస్తాడు. అటువంటిది... తమ ఊరికి చెందిన 500 మంది ఆడపిల్లలు ఓ కేంద్ర మంత్రి కుమారుడు కామేష్ (వినయ్ రాయ్) కారణంగా మనోవేదన అనుభవిస్తున్నారని తెలిసిన తర్వాత కృష్ణమోహన్ ఏం చేశాడు? కామేష్ కారణంగా కట్టుకున్న భార్య అదిరా (ప్రియాంకా అరుల్ మోహన్) ఆత్మహత్య చేసుకుంటానని రోధిస్తే ... కృష్ణమోహన్ ఏ విధంగా ధైర్యం చెప్పాడు? కామేష్ అరాచకాలను ఎలా అరికట్టాడు? అనేది సినిమా.
విశ్లేషణ: ఇదొక సందేశాత్మక కమర్షియల్ ఫిల్మ్. సూర్య 'సింగం' వంటి కమర్షియల్ సినిమాలు చేశారు. అయితే... ఆయన చేసిన లాస్ట్ రెండు సినిమాలు కంటెంట్, కమర్షియల్ వేల్యూస్ ఉన్న సినిమాలు కావడంతో 'ఈటి' కొత్తదనం ఉంటుందని చాలా మంది తెలుగు ప్రేక్షకులు సైతం ఆశించారు. అయితే... ఆ ఆశలపై 'ఈటి' ఫస్టాఫ్ నీళ్లు చెల్లుతుంది. ఇటువంటి సిల్లీ సినిమాను సూర్య ఎలా చేశారని, అసలు ఎందుకు ఓకే చెప్పారని సందేహం కూడా కలుగుతుంది. ఆ సందేహాలకు సమాధానం సెకండాఫ్‌లో లభిస్తుంది. అయితే... అప్పటికే ప్రేక్షకుడికి నిరాసక్తి మొదలవుతుంది. అవునా? సినిమా అంత బ్యాడ్‌గా ఉందా? అనుకునే ముందు... విశ్లేషణలోకి వెళ్లాలి.
సినిమాలో చాలా సీరియస్ ఇష్యూను డిస్కస్ చేశారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత, మొబైల్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మహిళలకు ప్రైవసీ అనేది లేకుండా పోయింది. ఎక్కడ, ఏ కెమెరా కన్ను మహిళను వెంటాడుతుందో? వేధిస్తుందో? తెలియని పరిస్థితి. బ్లాక్ మెయిలింగ్‌కు తాళలేక బలవన్మరణానికి పాల్పడిన మహిళల ఉదంతాలు కూడా సమాజంలో ఉన్నాయి. ఆ సమస్య నేపథ్యంలో తీసిన చిత్రమిది. అయితే... అది సెకండాఫ్‌లో కానీ తెలియదు. బహుశా... మహిళల కోసం, మహిళల్లో ధైర్యం నింపడం కోసం సూర్య 'ఈటి' చేసి ఉండొచ్చు. అయితే... అసలు కథ అదని చెప్పడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నారు. ఫస్టాఫ్ అంతా తమిళ నేపథ్యంలో సన్నివేశాలతో నింపేశారు. హీరో హీరోయిన్ మధ్య ప్రేమకథ కూడా ఏమంత ఆసక్తికరంగా ఉండదు. దాంతో అసలు విషయం వచ్చేసరికి ప్రేక్షకుడిలో సినిమాపై ఆసక్తి సన్నగిల్లుతుంది. టెక్నికల్ గా మాత్రం సినిమా ఉన్నత స్థాయిలో ఉంది. డి. ఇమాన్ పాటలు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. నేపథ్య సంగీతం మాత్రం అందర్నీ ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీన్స్, హీరోయిజం ఎలివేషన్ సన్నివేశాలకు సూపర్బ్ రీరికార్డింగ్ ఇచ్చారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ క్లాసీగా ఉంది.
నటీనటులకు వస్తే... సూర్య హుషారుగా కనిపించారు. ఎక్కువ సన్నివేశాల్లో లుంగీ కట్టుకుని కనిపించారు. భావోద్వేగభరిత సన్నివేశాల్లో, ఎప్పటిలా అద్భుతమైన నటన కనబరిచారు. సూర్య, ప్రియాంకా అరుల్ మోహన్ జోడీ బావుంది. హీరోయిన్ అందంగా కనిపించింది. భావోద్వేగ భరిత సన్నివేశాల్లో ఆమె మరింత పరిణితి చూపించాల్సిన అవసరం ఉంది. సత్యరాజ్, శరణ్య, వినయ్ రాయ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. ఎవరూ ఎక్కువ చేయలేదు. ఎవరూ తక్కువ చేయలేదు. కానీ, సినిమా నేపథ్యం వల్ల తమిళ వాసన తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు.
Also Read: 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' రివ్యూ: ఫస్టాఫ్ హిట్టు - సెకండాఫ్ గురించి మీకు అర్థమవుతోందా?
ఎవరికీ తలవంచడు... టైటిల్‌లో పవర్ ఉంది. అది హీరో క్యారెక్టర్‌లో ఉంది. అది ఇంటర్వెల్ ముందు ఫైట్, సెకండాఫ్‌లో కనిపిస్తుందనుకోండి. ఎవరికీ తలవంచవద్దని మహిళలకు చక్కటి సందేహం ఇచ్చారు. అదీ బావుంది. సూర్య, ప్రియాంకా అరుల్ మోహన్ మధ్య ఓ సన్నివేశంలో సమాజాన్ని ప్రశ్నించిన తీరు బావుంది. కానీ, సినిమాలో తమిళ నేటివిటీ ఎక్కువ అయ్యింది. కొంత మందికి ఆ కామెడీ, సీన్స్ నచ్చినా... మెజారిటీ తెలుగు ప్రేక్షకులకు ఫస్టాఫ్ చూడటం కాస్త కష్టంగా ఉంటుంది. సెకండాఫ్ ఓకే అనిపిస్తుంది. కేవలం సందేశం కోసం సినిమా చూడాలని అనుకునే ప్రేక్షకుల కోసమే 'ఈటి'. సినిమా అంతా అయ్యాక... తమిళ ప్రేక్షకుల కోసమే సినిమా తీశారా? తెలుగు ప్రేక్షకుల గురించి ఆలోచించారా? ఆలోచించలేదా? అనే అభిప్రాయం కలిగితే ప్రేక్షకులది తప్పు కాదు.
Also Read: 'హే సినామికా' రివ్యూ: ఈ సినిమాను దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరి ఎలా ఓకే చేశారు?