సినిమా రివ్యూ: హే సినామికా
రేటింగ్: 1.5/5
నటీనటులు: దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరి తదితరులు
సినిమాటోగ్రఫీ: ప్రీత జయరామన్
సంగీతం: గోవింద్ వసంత
నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్
దర్శకత్వం: బృందా మాస్టర్
విడుదల తేదీ: మార్చి 3, 2022
'మహానటి'తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). అంతకు ముందు మణిరత్నం దర్శకత్వంలో నటించిన అనువాద చిత్రం 'ఓకే బంగారం' సైతం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'కనులు కనులు దోచాయంటే' చిత్రంతో తెలుగునాట మరో విజయం అందుకున్నారు. ఈ రోజు 'హే సినామికా' సినిమా (Hey Sinamika Movie Review)తో థియేటర్లలోకి వచ్చారు. ఇందులో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), అదితి రావు హైదరి (Aditi Rao Hydari) కథానాయికలు. నృత్య దర్శకురాలిగా ఎన్నో పాటలకు కొరియోగ్రఫీ అందించిన బృందా మాస్టర్ 'హే సినామికా'తో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా (Brinda directorial debut Hey Sinamika Movie Review) ఎలా ఉంది?
కథ: ఆర్యన్ (దుల్కర్ సల్మాన్), మౌన (అదితి రావు హైదరి) తొలి పరిచయంలో ప్రేమలో పడతారు. పెళ్ళైన రెండేళ్లకు పరిస్థితి మారుతుంది. ఆర్యన్ నుంచి విడిపోవాలని మౌన నిర్ణయించుకుంటుంది. అందుకు కారణం తన భర్త నాన్ స్టాప్ వాగుడు, చేసిపెట్టే వంటలు అని చెబుతుంది. పలు ప్రయత్నాలు చేసిన తర్వాత సైకాలజిస్ట్ మలర్ (కాజల్ అగర్వాల్) దగ్గరకు వెళుతుంది. తన భర్తను వలలో వేసుకోమని, ప్రేమలో పడేయమని కోరుతుంది. అతడు ప్రేమలో పడితే... దాన్ని కారణంగా చూపించి విడిపోతానని అంటుంది. అందుకు మలర్ అంగీకరిస్తుంది. ఆర్యన్‌తో పరిచయం పెంచుకుని, అతడిని ప్రేమలో పడేసే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? మలర్ ప్రేమలో ఆర్యన్ పడ్డాడా? లేదా? ఆర్యన్ నుంచి మౌన విడిపోయిందా? లేదా? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ: 'ఎప్పుడు అయితే మదిలో ప్రశ్నలు ఆగిపోతాయో, అప్పుడు మనం మరణించినట్టు లెక్క. ప్రశ్నిస్తూ ఉండండి. మాట్లాడటం ఆపకండి' - సినిమాలో హీరో డైలాగ్ ఇది. 'హే సినామికా' ప్రారంభం నుంచి ప్రీ క్లైమాక్స్ వచ్చే వరకూ స్క్రీన్ ముందున్న ప్రేక్షకుల్ని ఒక ప్రశ్న వెంటాడుతూ ఉంటుంది. 'ఈ సినిమాను దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరి ఎలా ఓకే చేశారు? ఈ కథతో దర్శకురాలిగా పరిచయం కావాలని బృందా మాస్టర్ ఎందుకు అనుకున్నారు?' అని! స్క్రీన్ మీద ఏదో జరుగుతుంది. కానీ, ఏదీ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉండదు.
సినిమా ప్రారంభంలో దుల్కర్, అదితి ఎలా ప్రేమలో పడ్డారో ఎంత ఆలోచించినా అర్ధం కాదు. కాసేపటి ప్రేమలో సమస్య లేదు, పెళ్లి తర్వాత భర్త ప్రవర్తనతో కథానాయికకు సమస్య ఉందని, అదే అసలు కథ అని తెలుస్తుంది. అయితే... ఆ సమస్య నుంచి ఆమె బయట పడటం కోసం చేసే ప్రయత్నాలు సిల్లీగా అనిపిస్తాయి. సరైన సన్నివేశాలు లేవు. భర్త నుంచి విడిపోవడానికి భార్య చెప్పే కారణం సిల్లీగా ఉందంటే... సన్నివేశాలు ఇంకా సిల్లీగా ఉన్నాయి. భార్యాభర్తల తీరు మాత్రమే కాదు, కథానాయిక స్నేహితులు ప్రవర్తించే విధానం కూడా విచిత్రంగా ఉంటుంది. కథలో మంచి పాయింట్ ఉంది. కానీ, దానిని చెప్పిన విధానం బాలేదు. ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా కాస్త బావుంటుంది. ఎమోషనల్ సన్నివేశాలు హృద్యంగా ఉన్నాయి.
Also Read: 'వలిమై' రివ్యూ: తమిళ్ హీరో అజిత్ తెలుగులో హిట్ అందుకున్నాడా? విలన్‌గా కార్తికేయ ఎలా చేశాడు?
Also Read: దీపికా పదుకోన్ 'గెహరాయియా' రివ్యూ: ఆ ఒక్క రొమాంటిక్ మిస్టేక్ కంటే జీవితం పెద్దది!