సినిమా రివ్యూ: 'గెహరాయియా'
రేటింగ్: 3/5
నటీనటులు: దీపికా పదుకోన్, సిద్ధాంత్ చతుర్వేది, అనన్యా పాండే, ధైర్య్ కర్వా, నసీరుద్దీన్ షా, రజత్ కపూర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: కౌశల్ షా
సంగీతం: కబీర్ కె, సవేరా మెహతా
నిర్మాతలు: హీరూ యశ్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, శకున్ బత్రా
దర్శకత్వం: శకున్ బత్రా
విడుదల తేదీ: ఫిబ్రవరి 11, 2022 (అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో)
'గెహరాయియా'లో ముద్దులు ఉన్నాయి. బెడ్ రూమ్ సీన్స్ ఉన్నాయి. ప్రచార చిత్రాలు విడుదలైన తర్వాత కథ కంటే ఆ రొమాంటిక్ సీన్స్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ జరిగింది. నటీనటులకూ ఆ సీన్స్ గురించే ప్రశ్నలు, ట్రోల్స్. ఆ సన్నివేశాల్లో నటించేటప్పుడు భర్త అనుమతి తీసుకున్నారా? అని దీపికా పదుకోన్‌ను అడిగిన నెటిజన్స్ కూడా ఉన్నారు. అయితే... సినిమాలో ఏముంది? (Gehraiyaan Review in Telugu) జస్ట్, రొమాన్స్ మాత్రమేనా? అంతకు మించి ఏమైనా చెప్పారా?
కథ: అలీషా (దీపికా పదుకోన్), కరణ్ (ధైర్య్ కర్వా) ఆరేళ్ళుగా సహా జీవనం (Live In Relationship) లో ఉన్నారు. వాళ్ళిద్దరినీ అలీషా కజిన్ టియా (అనన్యా పాండే) ఓ ట్రిప్‌కు రమ్మని ఆహ్వానిస్తుంది. తనకు కాబోయే భర్త జైన్ (సిద్ధాంత్ చతుర్వేది)ని పరిచయం చేస్తుంది. ట్రిప్‌లో అలీషాకు జైన్ లైన్ వేయడం మొదలు పెడతాడు. ట్రిప్ తర్వాత వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు. త్వరలో టియాకు గుడ్ బై చెబుతానని, మనిద్దరం సంతోషంగా ఉండమని అలీషాకు జైన్ ప్రామిస్ చేస్తాడు. అయితే... వ్యాపారంలో ఎదురైన ఆర్థిక సమస్యల కారణంగా టియాను జైన్ వదల్లేని పరిస్థితి. ఎందుకంటే... ఆమె కాబోయే భార్య మాత్రమే కాదు, వ్యాపారంలో భాగస్వామి కూడా! జైన్ కంపెనీలో టియా తండ్రి కోట్ల రూపాయల పెట్టుబడి ఉంటుంది. పైగా, ఆమెకు చెందిన మరో ప్రాపర్టీని (కోట్ల రూపాయల ఆస్తిని) అమ్మేయాలని ప్లాన్ చేస్తాడు. ఈ లోపు అలీషా గర్భవతి అని తెలుస్తుంది. అప్పుడు జైన్ ఏం చేశాడు? జైన్ మోసాల గురించి తెలుసుకున్న అలీషా ఏం చేసింది? జైన్, అలీషా మధ్య ఎఫైర్ గురించి టియాకు తెలిసిందా? లేదా? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ:
'నువ్వు ఓడిపోయావ్' - కుమార్తె!
'నా దురదృష్టం అనుకుంటున్నా' - తల్లి సమాధానం ఇచ్చింది.
'బాధ పడకమ్మా! మనం మళ్ళీ మొదలు పెడదాం' - కుమార్తె!
కుదరదన్నట్టు అడ్డంగా తల ఊపుతుంది తల్లి. 'ఎందుకు?' - కుమార్తె ప్రశ్న!
(ఇదీ వైకుంఠపాళి ఆటలో తల్లీకుమార్తెల మధ్య సంభాషణ! సినిమాలో ఓపెనింగ్ సీన్! ఆ తర్వాత చిన్నారి తండ్రి వస్తాడు)
'ఎందుకంటే... మళ్ళీ మొదలు పెట్టడం కష్టం! నేను కరెక్టుగానే చెప్పానా?'
- చిన్నారి తండ్రి మాట. అతడు కుమార్తెకు సమాధానం చెప్పలేదు. భార్యను ప్రశ్నించాడు.
'ఎప్పుడూ అదంత సులభం కాదు' అని భర్తతో భార్య చెబుతుంది.
'నువ్వు కావాలని కోరుకుంటే... అది నీ ఇష్టం' - భర్త ముగింపు!
(భార్యాభర్తల సంభాషణ వైకుంఠపాళి ఆట గురించి కాదు... జీవితం గురించి! ఆ సంభాషణలో పైకి ధ్వనించని భావం ఉంది. మనసు పొరల్లో దాగున్న మనిషి బాధ ఉంది. అది సినిమా చివర్లో గానీ తెలియదు)
ఓపెనింగ్ సీన్ గురించి ఇంత విపులంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... ఆ సంభాషణలో ఎంత లోతైన భావం ఉందో? అర్థం చేసుకోవాలే గానీ... సినిమాలోనూ అంతే లోతైన భావం ఉంది. 'గెహరాయియా' అంటే ముద్దులు, రొమాంటిక్ సీన్లు కాదు... అంతకు మించి! ప్రేమ - మొహం, నమ్మకం - మోసం, సంతోషం - బాధ నుంచి మొదలైన సంబంధాల గురించి చెప్పిన కథ.
మోడ్రన్ రిలేషన్‌షిప్స్ మీద తీసిన సినిమా 'గెహరాయియా'. ఆర్ధిక అవసరాల కోసం శారీరక సంబంధం పెట్టుకున్న యువతీ యువకులతో పాటు బాధ, భావోద్వేగం కారణంగా మరొకరి తోడు కోరుకుంటున్న వారూ సమాజంలో ఉన్నారని దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశారు. హీరోయిన్లు దీపికా పదుకోన్, అనన్యా పాండే దుస్తుల నుంచి ముద్దులు, మోడ్రన్ డే ఎఫైర్స్ వరకూ ప్రతి అంశంలో ఎటువంటి మొహమాటం లేకుండా సినిమా తీశారు. సినిమా ప్రారంభమైన గంట వరకూ... కథ, పాత్రలతో ఎమోషనల్‌గా కనెక్ట్ కావడం కొంచెం కష్టమే. ఈ తరం యువత ఇంతేనని సరిపెట్టుకోవచ్చు. ఆ తర్వాత తర్వాత దీపికా పదుకోన్, అనన్యా పాండే పాత్రలపై జాలి పడతాం. వాళ్ళిద్దరూ మోసపోతున్నారని, ఇద్దరికీ అన్యాయం జరుగుతోందని సింపతీ చూపించడం మొదలు పెడతాం. రోలర్ కోస్టర్ రైడ్‌లా అక్కడక్కడా బోరింగ్ మూమెంట్స్ ఉన్నప్పటికీ... చివర్లో ఇచ్చిన సందేశం బావుంది. దీపికా పదుకోన్, అనన్యా పాండే, సిద్ధాంత్ చతుర్వేది... ముగ్గురూ తమలో కొన్ని రహస్యాలు దాచుకోవడం, అందువల్ల తమలో తాము సతమతం అవ్వడాన్ని దర్శకుడు బాగా చూపించాడు.
దీపికా పదుకోన్ క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ మినహా మిగతా పాత్రలు, అంశాల మీద దర్శకుడు శకున్ బత్రా దృష్టి పెట్టలేదు. కొన్ని సీన్లలో రొటీన్ డ్రామా ఎక్కువ అయ్యింది. సినిమాలో 'ఎఫ్'తో మొదలయ్యే ఇంగ్లిష్ పదాన్ని లెక్కకు మించి వాడారు. ఇది 'ఎ' సర్టిఫికెట్ సినిమా, పెద్దలకు మాత్రమే. ఇంట్లో పిల్లలతో కలిసి సినిమా చూడటం కష్టం. 'ఎఫ్' వర్డ్స్, హీరోయిన్స్ డ్రస్సింగ్ వల్ల సినిమాలో భావోద్వేగం కొందరికి చేరడం కష్టమని చెప్పాలి.
పతాక సన్నివేశాల్లో దీపికా పదుకోన్ భావోద్వేగభరిత నటన ఆకట్టుకుంటుంది. అంతకు ముందు సన్నివేశాల్లోనూ ఆమె చక్కగా నటించారు. రొమాంటిక్ సన్నివేశాల్లో పెద్దగా ఇబ్బంది పడినట్టు లేదు. అనన్యా పాండే క్యూట్‌గా కనిపించారు. సిద్ధాంత్ చతుర్వేది పర్వాలేదు. ధైర్య్ కర్వా పాత్రకు అంత ప్రాముఖ్యం లేదు. నసీరుద్దీన్ షా, దీపిక మధ్య సన్నివేశాలు తక్కువే అయినా... ఇద్దరూ ఇరగదీశారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో! రజత్ కపూర్ ఇంపార్టెంట్ రోల్ చేశారు.
Also Read: 'మహాన్' రివ్యూ: తండ్రీ కొడుకుల మధ్య యుద్ధంలో విజయం ఎవరిది?
'ఆ ఒక్క తప్పు కంటే జీవితం పెద్దది!' అంటూ సినిమాలో అంతర్లీనంగా ఇచ్చిన సందేశం బావుంది. జీవితమనే వైకుంఠపాళి ఆటలో చేసిన తప్పు నుంచి దూరంగా వెళ్లాలని ప్రయత్నించకుండా, తప్పును అంగీకరించి ముందుకు సాగాలని ఇచ్చిన సందేశం మనసుకు హత్తుకుంటుంది. ఆ రొమాంటిక్ మిస్టేక్ చుట్టూ ఎంత భావోద్వేగం ఉందనేది సినిమాలో చూడాలి. కమర్షియల్, మాస్ మసాలా ఫిల్మ్స్ ఇష్టపడే ప్రేక్షకులకు 'గెహరాయియా' అసలు ఏమాత్రం నచ్చదు. మోడ్రన్ లైఫ్ స్టైల్, రిలేషన్షిప్స్ నేపథ్యంలో వచ్చే సినిమాలను అభిమానించే ప్రేక్షకులు ఈ సినిమాను హ్యాపీగా చూడొచ్చు. ఇది క్లాస్ ఆడియన్స్ కోసమే!
Also Read: 'సామాన్యుడు' మూవీ రివ్యూ: నిజంగానే సింహమా? లేదంటే సామాన్యుడా?