సినిమా రివ్యూ: సామాన్యుడు
రేటింగ్: 2/5
నటీనటులు: విశాల్, డింపుల్ హయతి, యోగిబాబు, తులసి, బాబురాజ్ జాకబ్ తదితరులు
ఆర్ట్: ఎస్.ఎస్. మూర్తి
ఎడిటర్: ఎస్.బి. శ్రీకాంత్ 
సినిమాటోగ్రఫీ: కెవిన్ రాజా 
సంగీతం: యువన్ శంకర్ రాజా
నిర్మాణ సంస్థ‌: విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ 
నిర్మాత: విశాల్ 
దర్శకత్వం: తు. ప. శరవణన్ 
విడుదల తేదీ: ఫిబ్రవరి 4, 2022


విశాల్ కథానాయకుడిగా నటించి, నిర్మించిన సినిమా 'సామాన్యుడు'. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో ఈ రోజే (ఫిబ్రవరి 4న) విడుదలైంది. 'ప్రాణాలు కాపాడుకోవడానికి వేరే దారి లేక హత్య చేసేవాడికి, మిగితావాళ్లను చంపి తాను బతకాలని అనుకునేవాడికి చాలా తేడా ఉంది' వంటి డైలాగులతో సినిమాపై ట్రైలర్ ఆసక్తి కలిగించింది. పోలీస్ కావాలనుకునే పాత్రలో విశాల్ కనిపించరు. 'ఓ నేరాన్ని కనిపెట్టడం కంటే దాన్ని ఏ కోణంలో చూస్తున్నామనేది పోలీసోడికి ముఖ్యమైన అర్హత' అనుకునే హీరో ఏం చేశాడు? సినిమా ఎలా ఉంది? 


కథ: ఎస్సై అవ్వాలనేది పోరస్ (విశాల్) లక్ష్యం. పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. అతడి తండ్రి కానిస్టేబుల్. తండ్రికి భోజనం తీసుకువెళ్ళినప్పుడు సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తుల పిల్లలు తప్పు చేస్తే పోలీసులు ఎలా వదిలేస్తున్నారనేది చూస్తాడు. అందుకని, తన చెల్లెలు - ఆమె ప్రియుడు హత్యకు గురైతే... పోలీసులకు ఫిర్యాదు చేయడు. ఒక్కో క్లూ పట్టుకుని హత్యల వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. పోరస్ ప్రయత్నాలకు వేద కెమికల్స్ ఫ్యాక్టరీ యజమాని, ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న నీలకంఠం (బాబురాజ్ జాకబ్) ఎందుకు అడ్డు తగులుతున్నాడు? పోరస్ చెలెల్లు, ఆమె ప్రియుడిని మాత్రమే కాదు... మరో కొందరిని నీలకంఠం ఎందుకు చంపించాడు? నీలకంఠాన్ని పోరస్ ఎలా పట్టుకున్నాడు? అనేది మిగతా సినిమా.


విశ్లేషణ: 'సామాన్యుడు' సినిమాలో కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులన్నీ ఉన్నాయి. కథలో కొత్తదనం లేదు. కానీ, కాన్‌ఫ్లిక్ట్ ఉంది. నిస్సహాయ స్థితి నుంచి సింహంలా గర్జించే స్థితికి కథానాయకుడు చేరుకునే ప్రయాణం ఉంది. తర్వాత ఏం జరుగుతుందోనని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూసేలా చేయగల సందర్భాలు, సన్నివేశాలు ఉన్నాయి. అయితే... కమర్షియల్ కథను కరెక్టుగా డీల్ చేయగల డైరెక్షన్ మిస్ అయ్యింది. ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగల స్క్రీన్ ప్లే మిస్ అయ్యింది. సినిమాలో స్పీడు తగ్గింది. దాంతో ప్రేక్షకులకు బోర్ పెరుగుతుంది. ఆల్రెడీ ఎన్నో సినిమాల్లో చూసేసిన సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.


'సామాన్యుడు'లో స్టార్టింగ్ సీన్స్, ఫస్టాఫ్ చూస్తే... ఇది ఒక్క కథేనా? లేదంటే మూడు కథలా? అనే సందేహం కలుగుతుంది. పోరస్ జీవితానికి, నీలకంఠం ప్రపంచానికి, దివ్య అనే మరో అమ్మాయి సమస్యకు అసలు సంబంధమే ఉండదు. ఇంటర్వెల్ ముందు గానీ మూడు కథలు ఒక్క చోటుకు చేరవు. అందువల్ల, సినిమా ఎక్కడికి వెళుతుందనేది అర్థం కాదు. ఇంటర్వెల్ తర్వాత ఏం జరుగుతుందో ఊహించడం ప్రేక్షకుడి పెద్ద పజిల్ ఏమీ కాదు. ఇదొక రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ యాక్షన్ థ్రిల్లర్.
Also Read: 'హీరో' మూవీ రివ్యూ: మహేష్ బాబు మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే...
విశాల్ ఎప్పటిలా తన పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించారు. డింపుల్ హయతి పాత్ర హీరోతో రెండు మూడు సన్నివేశాలకు, ఓ పాటకు పరిమితం అయ్యింది. సెకండాఫ్‌లో హీరోయిన్ ఉంద‌నే విష‌యాన్ని గుర్తు చేయ‌డానికి హీరోకు ఆమె స‌హాయ‌ప‌డిన‌ట్టు స‌న్నివేశాలు ఉన్నాయి. యోగిబాబు సన్నివేశాలు చూస్తే నవ్వు రాలేదు. విలన్‌గా బాబురాజ్ జాకబ్ సూట్ అయ్యారు. అయితే అదీ రొటీన్ క్యారెక్టరే. 'సిరివెన్నెల' కుమారుడు రాజా, 'ఖైదీ'లో కానిస్టేబుల్ రోల్ చేసిన జార్జ్ మర్యన్, విశాల్ చెల్లెలి పాత్రలో రవీనా రవి... రొటీన్ క్యారెక్టర్లు అయినా తమ వంతు న్యాయం చేసే ప్రయత్నం చేశారు.
Also Read: 'గుడ్ లక్ సఖి' మూవీ రివ్యూ: కీర్తీ సురేష్ సినిమా ఎలా ఉందంటే?
దర్శకుడు శరవణన్ కథను కొత్తగా, ఆసక్తికరంగా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. అసలు కథలోకి వెళ్ళడానికి చాలా టైమ్ తీసుకున్నారు. డైలాగుల్లో కొన్ని బావున్నాయి. ఆల్రెడీ విడుదల చేసిన స్నీక్ పీక్‌ చూసి ఉంటే... సెకండాఫ్‌లో వచ్చే ఆ ఫైట్, మెట్రో స్టేషన్ కింద ఫైట్, క్లైమాక్స్ ఫైట్స్ బాగా పిక్చరైజ్ చేశారు. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం బావుంది. పాటలు గుర్తు ఉండటం కష్టం. నిర్మాతగా విశాల్ బాగా ఖర్చు పెట్టారు. యాక్షన్ సీన్స్ బావుంటే చాలు, ఇంకేమీ అవసరం లేదని భావించే ప్రేక్షకులు సినిమాకు హ్యాపీగా వెళ్లొచ్చు. మిగతా వాళ్ళు ఆలోచించాలి. జయాపజయాలతో సంబంధం లేకుండా విశాల్ సినిమాలు చేస్తున్నారు. కొన్ని సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. మరికొన్ని ప్లాప్ అవుతున్నాయి. అయితే... నిర్మాతగా విశాల్ చేసిన సినిమాలు దాదాపుగా విజయాలు సాధించాయి. కథల్లో కొత్తదనం ఉండటమో... లేదంటే కమర్షియల్ ఫార్మాటులో స‌క్సెస్‌ఫుల్ క‌థ‌లు ఎంపిక చేసుకోవ‌డ‌మో చేశారు. ఈసారి హీరోగా, నిర్మాతగానూ విశాల్ రాంగ్ స్టెప్ వేశారు. టైటిల్‌కు త‌గ్గ‌ట్టు సినిమా ఆర్డ‌న‌రీగా ఉంది.