సినిమా రివ్యూ: భామాకలాపం
నటీనటులు: ప్రియమణి, శాంతిరావు, జాన్ విజయ్, శరణ్య తదితరులు
ఎడిటర్: విప్లవ్
సినిమాటోగ్రఫీ: దీపక్ ఎరగార
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, మార్క్ కె రాబిన్ 

నిర్మాతలు: బాపినీడు, సుధీర్
దర్శకత్వం: అభిమన్యు తడిమేటి
విడుదల తేదీ: ఫిబ్రవరి 11, 2022 (ఆహా ఓటీటీలో)

 

పాండమిక్ సమయంలో ఓటీటీల డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ఒరిజినల్ కంటెంట్ విషయంలో ఎవరు రాజీ పడడం లేదు. క్వాలిటీ కంటెంట్ తో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. జనాలు కూడా ఓటీటీ కంటెంట్ కు బాగా అలవాటు పడుతున్నారు. అందుకే స్టార్ హీరో, హీరోయిన్లు సైతం డిజిటల్ ఎంట్రీ ఇస్తూ.. ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. ఇప్పటికే నటి ప్రియమణి 'ది ఫ్యామిలీమ్యాన్' వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను అలరించింది. తాజాగా అనే నటించిన వెబ్ ఫిలిం 'భామాకలాపం' ఆహా యాప్ లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం!

 

కథ: 

అనుపమ(ప్రియమణి) మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన హౌస్ వైఫ్. తన భర్త, కొడుకుతో కలిసి జీవిస్తుంటుంది. యూట్యూబ్ లో వంట వీడియోలు చేసే ఈమెకి ఇరుగుపొరుగు వారి ఇళ్లల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే ఆసక్తి చాలా ఎక్కువ. ఈ క్యూరియాసిటీ కారణంగా అపార్ట్మెంట్ వాళ్లతో, భర్తతో ఎప్పుడూ తిట్లు తింటూంటుంది. అయినా తన పద్ధతి మాత్రం మార్చుకోదు. అయితే ఒకరోజు రాత్రి అనుపమ ఉండే అపార్ట్మెంట్స్ లో హత్య జరుగుతుంది. ఆ హత్యకి అనుపమకు

సంబంధం ఏంటి..? దీని వ‌లన అనుప‌మ జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింది..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

 

విశ్లేషణ: 

సాధారణ గృహిణి తనకున్న క్యూరియాసిటీ కారణంగా ఎలాంటి కష్టాలను అనుభవించిందనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు. ఈ కథతో ఓ మెసేజ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అతడు కథను కాస్త స్లోగా చెప్పడంతో మెసేజ్ జనాలకు పెద్దగా రీచ్ అవ్వదు. సినిమా మొదలైన వెంటనే మెయిన్ స్టోరీలోకి వెళ్లినా.. కాస్త సాగదీశారనే ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి ఇలాంటి థ్రిల్లర్ స్టోరీలు ఎంత క్రిస్పీగా ఉంటే జనాలకు అంత త్వరగా కనెక్ట్ అవుతాయి. కానీ దీన్ని కూడా కమర్షియల్ సినిమా మాదిరి రెండున్నర గంటల నిడివితో రిలీజ్ చేశారు. పైగా సినిమాలో పాటలు ఉండవు. మొత్తం డ్రామానే నడుస్తుండడంతో మాస్ ఆడియన్స్ ఈ సినిమాకి త్వరగా కనెక్ట్ అవ్వలేరు. స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గా అనిపిస్తుంది. 

 

దర్శకుడు డిఫరెంట్ కాన్సెప్ట్ ను తీసుకొని దానికి ఫాబెర్జ్ ఎగ్(Faberge Egg) స్టోరీను యాడ్ చేసి సరికొత్తగా రూపొందించాలని ప్రయత్నించినప్పటికీ.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. ఫస్ట్ హాఫ్ మొత్తం సాదాసీదాగా సాగిపోతుంది. కామెడీ కూడా వర్కవుట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ ని కాస్త ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది. క్లైమాక్స్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తం ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ లోనే నడుస్తుంటుంది. తక్కువ బడ్జెట్ లో క్వాలిటీగా సినిమా తీయడంలో మాత్రం దర్శకుడు సక్సెస్ అయ్యాడు. 

 

ప్రియమణి మొత్తం తానై ఈ సినిమాను నడిపించింది. సినిమాలో మిగిలిన క్యారెక్టర్స్ ఎన్ని కనిపించినా.. ప్రియమణి మాత్రం తన నటనతో అందరినీ డామినేట్ చేసేసింది. సింపుల్ శారీస్ కట్టుకుంటూ పక్కా హౌస్ వైఫ్ గెటప్ లో అందంగా కనిపించింది. ప్రియమణితో పాటు కనిపించే పని మనిషి శిల్ప(శరణ్య) తన నటనతో నవ్వించే ప్రయత్నం చేసింది. నటుడు కిషోర్ కుమార్ పొలిమేర నెగెటివ్ షేడ్స్ ఉన్న చర్చ్ ఫాదర్ క్యారెక్టర్ లో జీవించేశాడు. కొన్ని చోట్ల సైకోగా తన ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్నాడు. కామెడీ విలన్ క్యారెక్టర్ లో జాన్ విజయ్ ఓకే అనిపించాడు. లేడీ పోలీస్ ఆఫీసర్ గా శాంతిరావు నటన మెప్పిస్తుంది. 

 

ఈ కథను తమ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో హైలైట్ చేసే ప్రయత్నం చేశారు జస్టిన్ ప్రభాకరన్, మార్క్ కె రాబిన్. కొన్ని సన్నివేశాల్లో ఆర్ఆర్ మంచి థ్రిల్ ను కలిగిస్తుంది. సినిమా మెయిన్ ఎసెట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఒకే లొకేషన్ లో సినిమాను చిత్రీకరించినా.. ఒకే ప్లేస్ చూస్తున్నామనే ఫీల్ రాకుండా తన కెమెరా వర్క్ తో ఆకట్టుకున్నారు దీపక్ ఎరగార. సినిమాలో కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా ఒకసారి ఈ సినిమాను చూసే ప్రయత్నం చేయొచ్చు కానీ.. కాస్త ఓపికతో ఉండాలి. 

 

ప్లస్ పాయింట్స్: 

ప్రియమణి పెర్ఫార్మన్స్ 

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 

 

మైనస్ పాయింట్స్: 

సాగతీత 

రొటీన్ స్క్రీన్ ప్లే 

ఎడిటింగ్ 

 

రేటింగ్: 2/5