సినిమా రివ్యూ: కిన్నెరసాని
రేటింగ్: 2.5/5
నటీనటులు: కళ్యాణ్ దేవ్, అన్ షీతల్, రవీంద్ర విజయ్, కాశీష్ ఖాన్, సత్య ప్రకాష్, మహతి భిక్షు, శ్రియ త్యాగి, భాను చందర్, షానీ సాల్మన్ తదితరులు
కథ, కథనం, మాటలు: దేశరాజ్ సాయి తేజ్ పాటలు: కిట్టూ విస్సాప్రగడ, శ్రీ హర్ష ఈమని
సినిమాటోగ్రఫీ: దినేష్ కె. బాబు
సంగీతం: మహతి స్వర సాగర్
నిర్మాతలు: రజని తాళ్లూరి, రవి చింతల
దర్శకత్వం: రమణ తేజ
విడుదల తేదీ: జూన్ 10, 2022 (జీ 5 ఓటీటీలో)
కళ్యాణ్ దేవ్ (Kalyaan Dhev) కథానాయకుడిగా నటించిన సినిమా 'కిన్నెరసాని'. రవీంద్ర విజయ్, అన్ షీతల్, కాశీష్ ఖాన్ ప్రధాన తారాగణం. నాగశౌర్య 'అశ్వథ్థామ' ఫేమ్ రమణ తేజ దర్శకత్వం వహించారు. 'జీ 5' ఓటీటీలో విడుదలైంది. కళ్యాణ్ దేవ్ ఎలా చేశారు? సినిమా ఎలా ఉంది? (Kinnerasani Movie Review)
కథ (Kinnerasani Movie Story): వెంకట్ (కళ్యాణ్ దేవ్) లాయర్. అతడు వెరీ స్మార్ట్. టాలెంట్ ఉన్న యువకుడు. వేద (అన్ షీతల్) ఒక లైబ్రరీ రన్ చేస్తుంది. తన తండ్రి ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని అన్వేషిస్తూ ఉంటుంది. ఆమెకు వెంకట్ సాయపడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే... వేదను చంపాలని తిరుగుతున్న జయదేవ్ (రవీంద్ర విజయ్) ఎవరు? వెంకట్ లవర్ లిల్లీ (కాశీష్ ఖాన్)ని చావుకి కారణం ఎవరు? వెంకట్ ప్రేమించింది లిల్లీని అయితే... వేద వెంట నీడలా ఉంటూ ఆమెకు ఎందుకు సాయం చేస్తున్నాడు? 'కిన్నెరసాని' పుస్తకానికి... వేద, వెంకట్ కథకు సంబంధం ఏమిటి? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Kinnerasani Review): 'కిన్నెరసాని'... అనూహ్యంగా వీక్షకుల ముందుకు వచ్చిన చిత్రమిది. పాటలు, ప్రచార చిత్రాలు మూడు నెలల క్రితమే యూట్యూబ్‌లో విడుదల అయ్యాయి. థియేటర్లలో విడుదల అవుతుందని ప్రేక్షకులు భావించారు. కారణాలు ఏమైనా ఓటీటీలో విడుదలైంది. సినిమా ఎలా ఉంది? అనే విషయంలోకి వెళితే...
'కిన్నెరసాని'... ఇదొక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఇటువంటి కథను నేరుగా చెబితే ఎటువంటి కిక్ ఉండదు. అయితే, వీక్షకుడిలో అటువంటి ఫీలింగ్ రానివ్వకుండా స్క్రీన్ ప్లేతో మేజిక్ చేశారు. ఓ అమ్మాయి హత్యతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత అది ఎవరు చేశారు? హత్యకు గురయ్యే ముందు ఆ అమ్మాయి కుక్కపిల్లతో ఎవరికి ప్రేమ రాయబారం పంపింది? అనే అంశాలు సస్పెన్స్‌లో ఉంచిన దర్శకుడు... ఏమాత్రం ఆలస్యం చేయకుండా హీరో హీరోయిన్ పాత్రలను పరిచయం చేశారు. ప్రతి పదిహేను నిమిషాలకు ఒక థ్రిల్ ఇస్తూ... సినిమాను ముందుకు తీసుకు వెళ్లారు.
సినిమాలో స్క్రీన్ ప్లే బావుందని చెప్పాలి. అలాగే, అన్ షీతల్ క్యారెక్టరైజేషన్ కూడా! అదేంటో చెబితే... సినిమా చూడబోయే వాళ్ళకు కిక్ ఉండదు. అందుకని, చెప్పడం లేదు! అయితే, వీక్షకులు లాజిక్స్ గురించి ఎక్కడ ప్రశ్నిస్తారో? అని హీరో పరిచయ సన్నివేశంలో మనసులో ఆలోచనలను అదుపులో పెట్టుకోగల వ్యక్తిగా చూపించారు. లాజిక్ కరెక్టుగా ఉన్నప్పటికీ... పెర్ఫార్మన్స్ పరంగా ఇంటెన్స్ చూపించగల హీరో ఉన్నప్పుడు ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేది. అది మిస్ అయ్యింది. హీరో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ మరీ రొటీన్. అందులో కొత్తదనం ఏమీ లేదు. ప్రేమ సన్నివేశాలు ప్రభావం చూపే విధంగా ఉంటే... ఆ తర్వాత సన్నివేశాల్లో వీక్షకులు లీనం అయ్యేవాళ్ళు. రవీంద్ర విజయ్ నటన కారణంగా ఆయన ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు ఎఫెక్టివ్‌గా మారాయి.
కమర్షియల్ హంగులు, కామెడీ జోలికి వెళ్లకుండా కథనంపై నమ్మకంతో సినిమా రూపొందించిన దర్శక - రచయితలు, నిర్మాతలను అభినందించాలి. మహతి స్వర సాగర్ అందించిన పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతంలో వినిపించే థీమ్ మ్యూజిక్ బావుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ నీట్‌గా ఉన్నాయి.
నటీనటులు ఎలా చేశారు?: నటుడిగా కళ్యాణ్ దేవ్ బలహీనత ఏంటి? బలం ఏంటి? అనేది దర్శకుడు రమణ తేజ చక్కగా అంచనా వేశారు. హీరోను ప్రతి సన్నివేశంలో ఫ్రంట్ సీటులోకి తీసుకోలేదు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే హీరోను చూపించారు. ఇంతకు ముందు విడుదలైన రెండు సినిమాలతో పోలిస్తే... కళ్యాణ్ దేవ్ కొంచెం కొత్తగా కనిపించారు. నటనలో ఇంకా మెరుగవ్వాలి. కళ్యాణ్ దేవ్ ప్రేయసిగా నటించిన కాశీష్ ఖాన్ పాత్ర నిడివి తక్కువే. ఉన్నంతలో మోడ్రన్‌గా కనిపించారు. హీరోయిన్ అన్ షీతల్‌కు ఇంపార్టెంట్ రోల్ లభించింది. పాత్రకు తగ్గట్టుగా భావోద్వేగాలను బాగా పలికించారు. ఫస్టాఫ్‌లో డామినేట్ చేశారు. రవీంద్ర విజయ్ మరోసారి నటుడిగా ఆకట్టుకుంటారు. జయదేవ్ పాత్రకు ఆయన న్యాయం చేశారు.
Also Read: జురాసిక్ వరల్డ్ డొమినియన్ రివ్యూ: డైనోసార్లు గెలిచాయా? మనుషులు గెలిచారా?
చివరగా చెప్పేది ఏంటంటే: సినిమా నిడివి రెండు గంటలే! అయినప్పటికీ... నిదానంగా ముందుకు వెళుతుంది. రొటీన్ స్టోరీ కావడంతో కొత్తదనం ఫీల్ అవ్వరు. రెగ్యులర్ సైకో కిల్లర్స్‌లా కాకుండా తీశారు. ట్రీట్మెంట్ బావుంది. స్క్రీన్ ప్లే, థ్రిల్స్ సర్‌ప్రైజ్ ఇస్తాయి. కామెడీ, కమర్షియల్ హంగులు లేవు. అందువల్ల, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను, థ్రిల్లర్ జానర్ అభిమానులను మాత్రమే ఆకట్టుకుంటుంది. వీకెండ్ మర్డర్ మిస్టరీ, థ్రిల్లర్ సినిమా చూడాలనుకునే వాళ్ళకు 'కిన్నెరసాని' బెటర్ ఆప్షన్.