వెబ్ సిరీస్ రివ్యూ: 9 అవర్స్ (తొమ్మిది ఎపిసోడ్లు)
రేటింగ్: 3/5
నటీనటులు: నందమూరి తారకరత్న, మధుశాలిని, అజయ్, రవివర్మ, వినోద్ కుమార్, బెనర్జీ, ప్రీతి అస్రాని, అంకిత్, జ్వాలా కోటి, రవిప్రకాష్, శ్రీతేజ్, గిరిధర్, సమీర్, 'జెమిని' సురేష్, రాజ్ మాదిరాజు, మౌనిక రెడ్డి తవనం తదితరులు మూలకథ: మల్లాది కృష్ణమూర్తి రచించిన 'తొమ్మిది గంటలు' నవల 
ప్రొడక్షన్ డిజైనర్: రాజ్ కుమార్ గిబ్సన్ తలారి ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి 
సంగీతం: శక్తికాంత్ కార్తీక్ 
నిర్మాతలు: వై. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి  
దర్శకత్వం: నిరంజన్ కౌశిక్, జాకబ్ వర్గీస్ రచన, సమర్పణ: కృష జాగర్లమూడి 
విడుదల తేదీ: జూన్ 2, 2022 (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో)


తెలుగు నవలా పాఠకులకు మల్లాది వెంకట కృష్ణమూర్తి రచనలు సుపరిచితమే. అయితే, డిజిటల్ తరంలో అందరికీ తెలిసే అవకాశం తక్కువ. తెలుగు సాహిత్యం, రచనలను అమితంగా ప్రేమించే దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఆయన మల్లాది రాసిన 'తొమ్మిది గంటలు' నవల ఆధారంగా '9 అవర్స్' వెబ్ సిరీస్ (9 Hours Web Series Review) రూపొందించారు. దీనికి ఆయన షో రన్నర్. నందమూరి తారకరత్న, మధు శాలిని, అజయ్, రవివర్మ తదితరులు నటించారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదలైంది (Nine Hours Web Series Streaming On Disney Plus Hotstar OTT). ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది? (9 Hours Review)


కథ (9 Hours Web Series Story): డెక్కన్ ఇంపీరియల్ బ్యాంక్‌కు చెందిన మూసారాంబాగ్, సైదాబాద్, కోఠి బ్రాంచీల్లో దొంగతనం జరిగింది. మూసారాంబాగ్, సైదాబాద్ బ్రాంచీల్లో దొంగలు డబ్బుతో పారిపోతారు. కోఠి బ్రాంచీలో దొంగలు ఉండగా... అఫ్జల్ గంజ్ సీఐ ప్రతాప్ (నందమూరి తారకరత్న)కు తెలుస్తుంది. ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తారు.  దొంగలు బయటకు వచ్చేలోపు బ్యాంకును పోలీసులు చుట్టుముడతారు. బ్యాంకులో దొంగలను వాళ్ళు పట్టుకున్నారా? లేదా? బ్యాంకులో ఉద్యోగులు, సామాన్యులను దొంగలు ఏం చేశారు? అసలు, ఆ దొంగలు సెంట్రల్ జైల్లో ఖైదీలు అనే సంగతి పోలీసులకు తెలిసిందా? లేదా? జైల్లో ఉండాల్సిన ఖైదీలు స్వేచ్ఛగా బయటకు ఎలా వచ్చారు? వాళ్ళకు అండగా నిలిచింది ఎవరు? ఈ బ్యాంకు దోపీడీ ప్లాన్ చేసింది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెబ్ సిరీస్‌లో దొరుకుతాయి.


విశ్లేషణ: '9 అవర్స్'... ఒక్క రోజులో జరిగే కథ. ఆ మాటకు వస్తే... తొమ్మిది గంటల్లో జరిగే కథ. ఒక్కో గంటలో ఏం జరిగిందనేది ఒక్కో ఎపిసోడ్‌గా తీశారు. అలాగని, ఎపిసోడ్ నిడివి గంట లేదులెండి. అటు ఇటుగా 25 నిమిషాలు ఉంది.


తొమ్మిది గంటల్లో బ్యాంకు దోపిడీ గురించి మాత్రమే కాదు... దంపతుల వ్యక్తిగత జీవితంలో వృత్తిపరమైన అంశాలు వస్తే ఎటువంటి సమస్యలు వస్తాయి? ఒంటరి మహిళ (భర్త మరణించిన తర్వాత) కామాంధుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది? గుర్రపు జూదానికి బానిసైన వ్యక్తి పరిస్థితి ఏంటి? వేశ్య జీవితం ఎలా ఉంటుంది? ఒకరికి వేశ్య మనసు ఇస్తే ఎంత దూరం వెళుతుంది? వంటి అంశాలనూ క్రిష్ జాగర్లమూడి స్పృశించారు. అందువల్ల, కథలో వేగం తగ్గింది. డ్రామా ఎక్కువ అయ్యింది. స్వేచ్ఛ తీసుకోవడం వల్ల కొన్ని సన్నివేశాల్లో లాజిక్స్ మిస్ అయ్యాయి.


'9 అవర్స్' ఎలా ఉంది?: ఈ వెబ్ సిరీస్‌లో థ్రిల్ కలిగించే అంశాలు చాలా అంటే చాలా తక్కువ. అయితే, ప్రతి ఎపిసోడ్‌లో వచ్చే మలుపులు ఆకట్టుకుంటాయి. బ్యాంకులో సహోద్యోగిని మహిళ చంపడానికి ముందు, వెనుక వచ్చే సన్నివేశాలలో క్రిష్ మార్క్ కనిపిస్తుంది. మాటలతో కంటే విజువల్స్‌తో కథను వివరించే ప్రయత్నం చేశారు. ముఖం మీద రక్తం చిందిన మహిళను చూసి... అప్పటివరకూ హంగామా చేసిన రవి వర్మ సైలెంట్ అవ్వడం '9 అవర్స్'లో బెస్ట్ సీన్. 'చిత్రం' శీను, రోహిణి ట్రాక్ కథకు ఏమాత్రం ఉపయోగపడలేదు. దీనివల్ల నిడివి పెరిగి సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కథలో ఎక్కువ భాగం బ్యాంకులో జరిగింది. అందువల్ల, బ్యాంకు సన్నివేశాలను మరింత వేగంగా నడిపితే బావుండేది. ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ 1985వ కాలం నాటి వాతావరణం ప్రతిబింబించే ప్రయత్నం చేశాయి. నేపథ్య సంగీతం బావుంది. నిర్మాణ విలువలు ఓకే.


నటీనటులు ఎలా చేశారు?: నందమూరి తారకరత్న, వినోద్ కుమార్, రవిప్రకాష్, అజయ్, శ్రీతేజ్... ప్రధాన తారాగణం అంతా క్యారెక్టర్లకు తగ్గట్లు నటించారు. అందరిలో రవి వర్మ స‌ర్‌ప్రైజ్‌ చేశారు. ఆయన క్యారెక్టర్‌లో షేడ్స్ ఉన్నాయి. షార్ట్ టెంపర్ ఉన్న వ్యక్తిగా కాసేపు, స్త్రీ లోలుడిగా కాసేపు... క్యారెక్టర్‌లో జీవించారు. అంకిత్, ప్రీతి అస్రాని జంట బావుంది. ఇద్దరి మధ్య సన్నివేశాలు కూడా! మధు శాలిని పాత్ర నిడివి తక్కువ. భర్త నుంచి విడాకులు కోరుకున్న మహిళగా, తర్వాత భర్తను అర్థం చేసుకున్న భార్యగా... పాత్రలో మార్పును ఉన్నంతలో బాగానే చూపించారు. ఆమె పాత్రకు ముగింపులో ట్విస్ట్ ఇచ్చారు. రెండో సీజన్‌లో మధు శాలిని పాత్రకు మరింత ఇంపార్టెన్స్ ఉంటుందని ఊహించవచ్చు. అలాగే, అజయ్ పాత్రకు కూడా!


Also Read: స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 రివ్యూ: స్ట్రేంజర్ థింగ్స్ కొత్త సీజన్ ఎలా ఉందంటే?


ఫైనల్ పంచ్: '9 అవర్స్' వెబ్ సిరీస్‌ను 1980ల నేపథ్యంలో తెరకెక్కించినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో మహిళల పట్ల కొందరు ప్రవర్తించే విధానంలో ఇప్పటికీ మార్పు రాలేదేమో? అనిపిస్తుంది. అది పక్కన పెడితే... ఇదొక డీసెంట్ వెబ్ సిరీస్. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త కొత్త మలుపులతో వీక్షకులను ఆకట్టుకుంటూ ఆసక్తికరంగా సాగుతుంది. అయితే... థ్రిల్స్ లేకపోవడం, చాలా అంటే చాలా నిదానంగా సాగడం మైనస్ పాయింట్స్. వెబ్ సిరీస్ చూశాక... అజయ్ ఎందుకు ఇదంతా చేశాడు? అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుంది. దాంతో పాటు జైలులో ఉరి వేసుకున్న అచ్యుత్ కుమార్‌కు, అజయ్ & మధు శాలినికి సంబంధం ఏమిటి? అనేది మనం సీజన్ 2లో తెలుసుకోవాలి. ఒక్క మాట... '9 అవర్స్'ను కుటుంబంతో చూడవచ్చు. ఇందులో ఎటువంటి అశ్లీల సన్నివేశాలు లేవు.


Also Read: 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?