సినిమా రివ్యూ: Jurassic World Dominion
రేటింగ్: 2/5
నటీనటులు: క్రిస్ ప్రాట్, ఇసాబెల్లా సెర్మాన్, బ్రైస్ డల్లాస్ హోవార్డ్, లారా డెర్న్, శామ్ నీల్, జెఫ్ గోల్డ్‌బం తదితరులు
సంగీతం: మైకేల్ జియాచినో
నిర్మాణ సంస్థలు: యాంబ్లిన్ ఎంటర్‌టైన్‌మెంట్, పర్‌ఫెక్ట్ వరల్డ్ పిక్చర్స్
దర్శకత్వం: కొలిన్ ట్రెవరో
విడుదల తేదీ: జూన్ 10, 2022
జురాసిక్ పార్క్, జురాసిక్ వరల్డ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఆ సిరీస్‌లో వచ్చే సినిమాల కోసం వెయిట్ చేసే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. హాలీవుడ్ మాస్టర్ మైండ్ స్టీఫెన్ స్పీల్‌బర్గ్ ప్రారంభించిన ఈ ఫ్రాంచైజీలో రెండు సిరీస్‌లు ఉన్నాయి. 1993 నుంచి 2001 వరకు వచ్చిన మూడు సినిమాలు జురాసిక్ పార్క్ ట్రయాలజీ కాగా... 2015 నుంచి ఇప్పుడు వచ్చిన జురాసిక్ వరల్డ్ డొమినియన్ వరకు వచ్చిన మూడు సినిమాలు జురాసిక్ వరల్డ్ ట్రయాలజీలో తెరకెక్కించారు. జురాసిక్ సిరీస్‌లో ఇదే ఆఖరి సినిమా అని ప్రకటించడం, మొత్తం ఆరు సినిమాల్లోని ప్రధాన పాత్రలను ఇందులో మళ్లీ తీసుకురావడంతో ‘జురాసిక్ వరల్డ్ డొమినియన్’పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఆసక్తికరంగా కట్ చేసిన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచింది. మరి సినిమా ఆ స్థాయిలో ఉందా?
కథ: దీని ముందు భాగం ‘జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్‌డం’ డైనోసార్లు జనావాసాల్లోకి రావడంతో ముగుస్తుంది. అక్కడి నుంచి సరిగ్గా నాలుగు సంవత్సరాల తర్వాత ‘జురాసిక్ వరల్డ్ డొమినియన్’ ప్రారంభం అవుతుంది. శాకాహార డైనోసార్ల వల్ల మనుషులకు ఇబ్బందులు లేకపోయినా మాంసాహార డైనోసార్ల కారణంగా ప్రాణాపాయాలు ఏర్పడుతూ ఉంటాయి. మరోవైపు ఒవెన్ గ్రేడీ (క్రిస్ ప్రాట్), క్లెయిర్ (బ్రైస్ డల్లాస్ హోవార్డ్) తీసుకువచ్చేసిన పాప మైసీ లాక్‌వుడ్ (ఇసాబెల్లా సెర్మాన్) కోసం దుండగులు గాలిస్తూనే ఉంటారు. ముందు భాగాల్లో ఒవెన్ ట్రైనింగ్ ఇచ్చిన ప్రమాదకరమైన డైనోసార్ బ్లూ కూడా వీరి పరిసరాల్లోనే నివసిస్తుంది. తన పునరుత్పత్తి సామర్థ్యంతో పురుష డైనోసార్ అవసరం లేకుండా మరో డైనోసార్‌కు జన్మనిస్తుంది.
అయితే బ్లూకు పుట్టిన డైనోసార్, మైసీ లాక్‌వుడ్ ఒకేసారి మాయం అవుతారు. మరోవైపు గుర్తు తెలియని మిడతల దండు భూమి మీద పంటపొలాల మీద దాడి చేస్తూ ఉంటుంది. ఈ సంఘటనలకు మొదటి జురాసిక్ పార్క్‌ను సందర్శించిన డాక్టర్ ఎల్లీ (లారా డెర్న్), డాక్టర్ అలన్ గ్రాంట్ (శామ్ నీల్), డాక్టర్ ఇయాన్ మాల్కమ్ (జెఫ్ గోల్డ్‌బం)లకు సంబంధం ఏంటి? వీరి సమస్యలకు పరిష్కారం దొరికిందా? తెలియాలంటే జురాసిక్ వరల్డ్ డొమినియన్ చూడాల్సిందే.
విశ్లేషణ: జురాసిక్ సిరీస్ సినిమాలు అనగానే మనకు గుర్తొచ్చేది గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్స్‌లు, చూడగానే భయపెట్టే భారీ డైనోసార్‌లు. జురాసిక వరల్డ్ డొమినియన్‌లో కూడా ఈ రెండూ ఉంటాయి. కానీ వీటితో పాటు నీరసం తెప్పించే సన్నివేశాలకు కూడా ఏమాత్రం కొదవ ఉండదు. డైనోసార్ల వల్ల మానవ జాతికి కలిగిన ప్రమాదాలు చూపిస్తూ ప్రారంభమయ్యే సినిమా కథలోకి వెళ్లడానికే దాదాపు గంట సమయం తీసుకుంటుంది. పాత జురాసిక్ పాత్రలను మళ్లీ పరిచయం చేయడానికి కూడా చాలా సమయం తీసుకున్నాడు. చుట్టూ ఉన్న పాత్రలన్నీ వీరిని ఆహా... ఓహో... అంటూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటాయి. ముందు భాగాలు చూసేసిన వారికి వీళ్లకి ఎందుకింత బిల్డప్ అనిపిస్తుంది. చూడని వారికి ఇంకెంత సేపు ఈ బోరింగ్ సీన్లు అనిపిస్తుంది.
‘జురాసిక్ వరల్డ్ డొమినియన్’ మీద ఆడియన్స్‌కు ఆసక్తి పెరగడానికి మరో కారణం ఈ సిరీస్‌లో ఇంతకు ముందు వచ్చిన ఐదు సినిమాలు ఒకే థీమ్ పార్కు నేపథ్యంలో నడుస్తాయి. థీమ్ పార్కులో డైనోసార్ల మధ్యలో కొందరు ఇరుక్కోవడం, అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడటం... గత ఐదు చిత్రాల్లో ఇదే కథ. కానీ ‘జురాసిక్ వరల్డ్ డొమినియన్’ ట్రైలర్‌లో మనుషులు నివసించే నగరాల్లో యాక్షన్ సీక్వెన్సులు చూపించడం ఆసక్తిని కలిగిస్తుంది. ఇంతకు ముందు సినిమాల్లో చూడని కొత్త తరహా సెటప్‌ను ఇందులో చూడవచ్చని ప్రేక్షకులు ఎంతగానో ఆశతో ఎదురు చూస్తారు. మీరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్తే కచ్చితంగా నిరాశ పడతారు.
సిటీ బ్యాక్‌డ్రాప్‌లో కేవలం ఒక్క యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే కనిపిస్తుంది. తర్వాత కథ యాజిటీజ్‌గా థీమ్ పార్కుకు వెళ్లిపోయి రొటీన్ టెంప్లేట్‌లో సాగిపోతుంది. కానీ సినిమాలో మిమ్మల్ని సీట్ ఎడ్జ్‌కు కూర్చోబెట్టే సీన్ ఏదైనా ఉందా అంటే ఆ ఒక్క యాక్షన్ సన్నివేశం మాత్రమే. ఆ సీన్‌ను అద్భుతంగా తెరకెక్కించారు. సిరీస్‌లో ఆఖరి సినిమా, నాలుగు సంవత్సరాల గ్యాప్ తర్వాత థియేటర్లలోకి రావడం వంటి అంశాలు సినిమా హైప్‌ను బాగా పెంచుతాయి. కానీ ఆ హైప్‌కు మ్యాచ్ అయ్యే రేంజ్‌లో సినిమా లేదనే చెప్పాలి. సినిమా క్లైమ్యాక్స్‌లో ఇచ్చిన డైనోసార్లు మనుషుల మధ్య ఇమడగలవా అనే ప్రశ్నకు ఇచ్చిన జస్టిఫికేషన్ కూడా కన్విన్సింగ్‌గా అనిపించదు. దాని గురించి చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రస్తావించలేదు.
ఇక నటీనటుల విషయానికి వస్తే... కథంతా మైసీ లాక్‌వుడ్ పాత్ర చుట్టూనే నడుస్తుంది. ఆ పాత్ర పోషించిన ఇసాబెల్లా సెర్మాన్ అమాయకంగా బాగా నటించింది. క్రిస్ ప్రాట్ యాక్షన్ సన్నివేశాల్లో మంచి ప్రతిభ చూపించాడు. అవెంజర్స్ సినిమాలో స్టార్ లార్డ్ పాత్రకు తను చేసిన హోం వర్క్ ఈ సినిమాకు కూడా ప్లస్ అయిందని అనుకోవచ్చు. జురాసిక్ వరల్డ్ సిరీస్, పాత జురాసిక్ పార్క్‌లోని నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఓవరాల్‌గా చెప్పాలంటే... జురాసిక్ పార్క్, గాడ్జిల్లా, కాంగ్ ఈ జోనర్‌ను మీరు ఇష్టపడేవారు అయితే ‘జురాసిక్ వరల్డ్ డొమినియన్’ను ఒక్కసారి ట్రై చేయవచ్చు. లేకపోతే ఓటీటీలోకి వచ్చేదాకా వెయిట్ చేయవచ్చు.
Also Read: 'మేజర్' రివ్యూ: బరువెక్కిన గుండెతో బయటకు వస్తారు, సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఎలా ఉందంటే?
Also Read: '9 అవర్స్' రివ్యూ: వెబ్ సిరీస్ చూశాక ఆ ఒక్క ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుంది