నందమూరి బాలకృష్ణ సినీ జీవితంలో ఎప్పటికీ గుర్తిండిపోయే సినిమా ‘భైరవ ద్వీపం’. అందగాడైన తమ హీరో ఆ జానపద చిత్రంలో కత్తితో ఖతర్నాక్‌గా కనిపిస్తాడని భావించిన అభిమానులకు బాలయ్య ఊహించని షాకిచ్చారు. విజయ్ పాత్రలో వీరుడిలా విశ్వరూపం చూపించిన బాలకృష్ణ.. ఓ సీన్‌లో కురూపిలా మారిపోతాడు. అప్పటివరకు మాస్ హీరోగా, లవర్‌ బాయ్‌గా కనిపించిన బాలయ్యను ‘భైరవద్వీపం’లో అలా చూసి అభిమానులు థియేటర్లో షాకయ్యారట. బాలకృష్ణ అలాంటి పాత్ర చేస్తారని ఎవరూ అనుకోలేదట. అలాంటి పాత్ర ఉంటుందని తెలిసి కూడా బాలకృష్ణ ఆ సినిమాకు అంగీకరించడం పెద్ద సాహసమని సినీ విమర్శకులు సైతం ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తారు. అయితే, ఆ వేషంతో బాలయ్య పడినపాట్లు గురించి తెలిస్తే.. తప్పకుండా మీకు ఆయనపై అభిమానం పెరిగిపోతుంది.


అప్పట్లో మాస్ చిత్రాలు ట్రెండవ్వుతున్నాయి. బాలకృష్ణ ‘రౌడీ ఇన్స్‌పెక్టర్’, ‘అశ్వమేధం’, ‘నిప్పురవ్వ’, ‘బంగారు బుల్లోడు’ వంటి సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇంకా అలాంటి కమర్షియల్ చిత్రాలు తీయడానికి చాలామంది దర్శక నిర్మాతలు క్యూలో ఉన్నారు. అయితే, వారు చెప్పిన కథలు కంటే.. రావి కొండలరావు అల్లిన జానపద కథ ఆయనకు బాగా నచ్చేసింది. ఆ కాలంలో జానపద చిత్రాలకు ఆస్కారం కూడా లేదు. ఇక వేళ సినిమా అటూ ఇటూ అయితే.. ఫ్లాప్ తప్పదు. అది తెలిసి కూడా బాలయ్య ఆ ప్రయోగం చేసేందుకు అంగీకరించారు. ఎన్టీఆర్ నటించిన ‘పాతాళభైరవి’ సినిమా తరహాలోనే ఈ చిత్రం కూడా ఉండాలని ఆయన కోరుకున్నారు. అయితే విజయం.. లేకపోతే చరిత్ర.. అనుకుంటూ బాలయ్య ఆ సినిమా కోసం పూర్తిగా సిద్ధమైపోయారు.


‘కురూపి’ పాత్ర కోసం బాలయ్య పాట్లు: ‘భైరవద్వీపం’ చిత్ర దర్శకుడు సింగీతం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘కురూపిగా శాపం పొందిన తర్వాత ఆయన రూపం పూర్తిగా మారిపోతుంది. అయితే, ఆ మేకప్ వేయాలంటే సుమారు రెండు గంటల సమయం పట్టేది. ఆయన ఏమైనా తినాలంటే.. తప్పకుండా ఆ మేకప్ మొత్తం తీసేయాలి. దీంతో ఆయన భోజనం చేసేవారు కాదు. జ్యూస్‌లు మాత్రమే తాగేవారు. ఆ పాత్ర చిత్రీకరణ పూర్తయ్యే వరకు ఆయన దాదాపు పస్తులున్నారు. సీన్‌లో భాగంగా ఆయనకు తల్లిగా నటించిన కే.ఆర్.విజయ ఆ కురూపి శాపాన్ని స్వీకరించాలి. ఆ పాత్ర చేసేందుకు మీరు సిద్ధమేనా? అని ఆమెను అడిగినప్పుడు.. ‘బాలకృష్ణే ఆ పాత్ర చేస్తున్నప్పుడు నాకెందుకు అభ్యంతరం’ అని ఆమె అన్నారు. తన కురూపి శాపాన్ని తల్లి స్వీకరిస్తుందని తెలియగానే కొండలు, గుట్టులపై హీరో పరుగులు పెట్టాలి. ఆ సీన్‌ కోసం బాలయ్య దెబ్బలను కూడా లెక్క చేయలేదు. రాళ్లు, ముళ్లు గుచ్చుకున్నా సరే ఆయన ఆ సీన్‌ను రక్తికట్టించారు. అలా ఆయన ఆ పాత్రలో జీవించడం వల్లే ఆ సినిమా అంత హిట్ అయ్యింది’’ అని చెప్పారు. సింగీతం చెప్పినట్లే ఆ పాత్రలో బాలయ్య లీనమయ్యారు. అందుకే ప్రేక్షకులు కూడా ఆయనలో విజయ్‌ను చూశారు. కురూపిగా విజయ్ పడుతున్న కష్టాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్న అభిమానులు ఎందరో. అంతగా పాత్రల్లో జీవించడం బాలకృష్ణకు మాత్రమే సాధ్యం. 
........అదీ బాలయ్య అంటే!!


Also Read: బాలకృష్ణ మొదటి చిత్రాన్ని అప్పటి ప్రభుత్వం ఎందుకు నిషేదించిందో తెలుసా?


Also Read: 'నీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ - నా జీవో గాడ్స్ ఆర్డర్' బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలే!