Anjali 50th movie Geethanjali Malli Vachindi review in Telugu: అంజలి ప్రధాన పాత్రలో రూపొందిన 'గీతాంజలి' మంచి విజయం సాధించింది. పదేళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' తీశారు. ఇది అంజలికి 50వ సినిమా కావడం విశేషం. శ్రీనివాస్ రెడ్డి, 'స‌త్యం' రాజేష్‌, 'ష‌క‌ల‌క' శంక‌ర్‌, రవిశంకర్, అలీ, సునీల్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, రాహుల్ మాధ‌వ్ ప్రధాన పాత్రల్లో శివ తుర్లపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ... కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే, సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ నిర్మించారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. 


కథ (Geethanjali Malli Vachindi Movie Story): తొలి సినిమా 'గీతాంజలి' విజయం తర్వాత దర్శకుడు శ్రీను (శ్రీనివాస రెడ్డి) వరుసగా మూడు ఫ్లాపులు ఇస్తాడు. దాంతో అతనితో సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రారు. ఖర్చులకు డబ్బుల కోసం విశాఖలోని తన స్నేహితుడు అయాన్ (స్వామిరారా సత్య)ను మోసం చేస్తాడు. 'దిల్' రాజు సినిమా చేయడానికి ఓకే అన్నాడని, నువ్వే హీరో అని చెప్పడంతో లక్షలకు లక్షలు డబ్బులు పంపిస్తాడు అయాన్. శ్రీనుకు చెప్పకుండా హైదరాబాద్ వచ్చిన అయాన్ అసలు నిజం తెలుసుకుంటాడు. చేసేది లేక రైటర్స్ ఆరుద్ర, ఆత్రేయ ('సత్యం' రాజేష్, 'షకలక' శంకర్)తో పాటు శ్రీను, అయాన్ ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటారు.


కృష్ణానగర్ వదిలేసి ఇళ్లకు బయలుదేరుతున్న సమయంలో ఊటీలోని విష్ణు రిసార్ట్స్ యజమాని విష్ణు (రాహుల్ మాధవ్) మేనేజర్ గోవిందా గోవిందా (శ్రీకాంత్ అయ్యంగార్) నుంచి ఫోన్ వస్తుంది. డైరెక్షన్ ఛాన్స్ ఆఫర్ చేయడం అందరూ ఊటీకి వెళతారు. తాను రాసిన కథతో సంగీత్ మహల్‌లో షూటింగ్ చేయాలని విష్ణు పెట్టిన కండిషన్‌కు ఓకే చెప్పడంతో పాటు హీరోయిన్‌గా అంజలి (అంజలి)ని ఒప్పించి సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళతారు. సంగీత్ మహల్‌లో శాస్త్రి (రవిశంకర్), ఆయన భార్య (ప్రియా) ఆత్మలు ప్రతి ఆగస్టు 8కి ప్రేమికుల మీద పగ తీర్చుకుంటాయని ఊటీ ప్రజల నమ్మకం.


సంగీత్ మహల్‌లో నిజంగా ఆత్మలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే అక్కడ అంజలి, శ్రీను & గ్యాంగ్ షూటింగ్ ఎలా చేశారు? అంజలి సోదరి గీతాంజలి (అంజలి) ఆత్మ మళ్లీ ఎందుకు వచ్చింది? గీతాంజలి చేతిలో మరణించిన రమేష్ (రావు రమేష్)కు, విష్ణుకు సంబంధం ఏమిటి? చివరకు ఏమైంది? అనేది మిగతా సినిమా. 


విశ్లేషణ (Geethanjali Malli Vachindi Review): హారర్ కామెడీ తెలుగులో అరగదీసిన ఫార్ములా. పదేళ్ల క్రితం 'గీతాంజలి' వచ్చినప్పుడు ఎక్కువ సినిమాలు రాలేదు. కానీ, ఆ తర్వాత కుప్పలు తెప్పలుగా వచ్చాయి. అందువల్ల, సంథింగ్ స్పెషల్ అన్నట్టు ఉంటే తప్ప ప్రేక్షకులు హారర్ కామెడీ ఫిలిమ్స్ చూడటం లేదు. ఆ స్పెషల్ మూమెంట్స్ 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' ఉన్నాయా? అంటే... 'లేవు' అని చెప్పాలి. 


రెగ్యులర్ అండ్ రొటీన్ కథతో 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' సినిమా తెరకెక్కింది. ఫస్ట్ పార్టుతో ఈ కథను లింక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ సినిమా చూడని వాళ్లకు సైతం ఈ కథ అర్థం అవుతుంది. ఎందుకంటే... 'గీతాంజలి'లో ఉన్న ఎమోషన్ ఈ కథలో క్యారీ చేయడంలో దర్శక రచయితలు ఫెయిల్ అయ్యారు. కామెడీ, కామెడీ, కామెడీ... ఎంతసేపూ నవ్వించడం మీద దృష్టి పెట్టారు తప్ప ఎమోషన్ గురించి కేర్ తీసుకోలేదు. కామెడీ 100 పర్సెంట్ వర్కవుట్ అయినప్పుడు కథ, ఎమోషన్స్ సోసో అనిపించినా ప్రేక్షకుడు పెద్దగా పట్టించుకోడు. కామెడీ తగ్గినప్పుడు మిగతా అన్నీ లెక్కల్లోకి వస్తాయి.



పాడుబడిన బంగ్లాలో హారర్ సినిమా తీయడానికి వెళ్లిన కొంత మందికి నిజమైన దెయ్యాలు ఎదురైతే ఏం జరిగింది? అనేది క్లుప్తంగా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' కథ. సినిమా స్టార్టింగ్ సోసోగా ఉంది. ఫస్టాఫ్ అంతా రొటీన్. ఇంటర్వెల్ తర్వాత షూటింగులోకి దెయ్యాలు వచ్చిన తర్వాత కోన వెంకట్ & రైటర్స్ నుంచి కొన్ని మంచి సీన్లు వచ్చాయి. నవ్వులు పూశాయి. సినిమాటిక్ లిబర్టీ మరీ ఎక్కువ తీసుకుని క్లైమాక్స్ రాశారు. దాంతో ఎటువంటి ఫీలింగ్ ఉండదు. సుజాత సిద్ధార్థ సినిమాటోగ్రఫీ బావుంది. ప్రవీణ్ లక్కరాజు పాటలు ఓకే. క్లైమాక్స్ రీ రికార్డింగ్, ఆ సాంగ్ వింటే 'హనుమాన్'లో రామదూత స్తోత్రం గుర్తుకు వస్తుంది. ప్రొడక్షన్ వేల్యూస్ ఓకే. 


అంజలికి సవాల్ విసిరే సన్నివేశాలు సినిమాలో లేవు. కాఫీ షాప్ యజమానిగా, తన స్నేహితుల కోసం హీరోయిన్ రోల్ ఓకే చేసిన అమ్మాయిగా తనదైన శైలిలో ఆమె నటించారంతే. క్లాసికల్ డ్యాన్సర్ గెటప్ ఆమెకు బావుంది. పతాక సన్నివేశాల్లో నటన మాత్రమే కాస్త కొత్తగా ఉంది. శ్రీనివాస రెడ్డి, రవిశంకర్, 'సత్యం' రాజేష్, 'షకలక' శంకర్, శ్రీకాంత్ అయ్యంగార్, ముక్కు అవినాష్ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మలయాళ నటుడు రాహుల్ మాధవ్ లుక్స్ ఓకే. అతనికి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఛాన్సులు రావచ్చు.


Also Readమైదాన్ రివ్యూ: ఫుట్‌బాల్ కోచ్ రహీమ్ బయోపిక్ - అజయ్ దేవగణ్ సినిమా ఎలా ఉందంటే?


సినిమాలో తీసే సినిమాలోనే కాదు, ఈ 'గీతాంజలి మళ్ళీ వచ్చింది'కి అసలైన హీరో 'స్వామి రారా' సత్య. ఇంటర్వెల్ తర్వాత సన్నివేశాల్లో చెలరేగిపోయాడు. అతను స్క్రీన్ మీదకు వచ్చిన ప్రతిసారి థియేటర్లలో నవ్వులు వినబడతాయి. ఒకానొక సమయంలో సత్య నటనను సునీల్ ఇమిటేషన్ అని కొందరు అన్నారు. ఆ సునీల్, సత్య కాంబినేషన్ సీన్లు సైతం బాగా నవ్విస్తాయి. సినిమాటోగ్రాఫర్ కిల్లర్ నానిగా సునీల్ క్యారెక్టర్ చేస్తే... ఓ ప్రముఖ తెలుగు సినిమాటోగ్రాఫర్ గుర్తుకు వస్తారు. 'దిల్' రాజు, గోపరాజు రమణ, సురేష్ కొండేటి అతిథి పాత్రల్లో సందడి చేశారు.


'గీతాంజలి మళ్ళీ వచ్చింది' కథలో షాకింగ్ ట్విస్ట్ లేదా సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రేక్షకుడి ఊహకు అనుగుణంగా సినిమా వెళుతుంది. నో హారర్ మూమెంట్స్ అండ్ నో థ్రిల్స్... జస్ట్ 'స్వామి రారా' సత్య కామెడీ తప్ప! 'గీతాంజలి' మేజిక్, ఆ హ్యూమర్ రిపీట్ చేయడంలో ఈ సినిమా ఫెయిలైంది.


Also Read: లవ్ గురు రివ్యూ: భార్య ప్రేమ కోసం రోమియోగా మారిన విజయ్ ఆంటోనీ - కొత్త సినిమా ఎలా ఉందంటే?