Football Coach Syed Abdul Rahim Biopic Maidaan Review: రహీమ్ సాబ్... భారత ఫుట్ బాల్ టీమ్ కోచ్. ఏషియన్ గేమ్స్‌లో దేశానికి గోల్డ్ మెడల్స్ తెచ్చిన ఘనత ఆయన సొంతం. ఆయన మరణం తర్వాత మేజర్ టోర్నమెంట్లలో మన ఫుట్ బాల్ జట్టు ఒక్క మెడల్ కూడా సాధించలేదు. హైదరాబాద్‌కు చెందిన ఆయన జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ 'మైదాన్'. ఎస్ఎ రహీమ్ పాత్రలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, రహీమ్ భార్య పాత్రలో ప్రియమణి నటించారు. జీ స్టూడియోస్ సంస్థతో కలిసి బోనీ కపూర్ ప్రొడ్యూస్ చేశారు. ఏప్రిల్ 10న థియేటర్లలో సినిమా విడుదల అవుతోంది. రెండు రోజుల ముందు మీడియాకు ప్రీమియర్ షో వేశారు. మరి, ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.
కథ (Maidaan Movie Story): మన దేశంలో ఫుట్‌బాల్ అంటే బెంగాల్ అని ముద్ర పడిన రోజులు... అది 1950, 60వ దశకం. ఇండియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అంతటా బెంగాలీల ఆధిపత్యమే. ఆ సమయంలో హైదరాబాదీ రహీమ్ సాబ్ (అజయ్ దేవగణ్) ఫుట్‌బాల్ కోచ్. ఆయన అంటే ఓ ఫెడరేషన్ సభ్యుడు, బెంగాలీ ప్రతికాధినేతకు పడదు. వాళ్లకు రహీమ్ ముక్కుసూటితనం నచ్చదు. ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ ఆటతీరు మెరుగు పడినా... టోర్నమెంట్లలో విజేతగా నిలవలేదని కోచ్ రహీమ్‌ను ఇంటికి పంపిస్తారు.
ఇంటికి పంపిన తర్వాత మళ్లీ రహీమ్ ఫెడరేషన్ దగ్గరకు ఎందుకు వెళ్లారు? కోచ్ కావడంలో ఆయనకు సాయం చేసింది ఎవరు? ఇండియన్ ఫుట్‌బాల్ కోసం రహీమ్ ఏం చేశారు? ఆయన జీవితంలో విలన్ ఎవరు? ప్రతిభావంతులైన ఆటగాళ్లను ఎలా ఎంపిక చేశారు? జట్టులో స్ఫూర్తి ఎలా నింపారు? రహీమ్ కుటుంబం ఏ విధమైన మద్దతు ఇచ్చింది? ఏషియన్ గేమ్స్ కోసం జకార్తా వెళ్లే ముందు ఏం జరిగింది? టోర్నమెంట్‌లో ఆటగాళ్లు, రహీమ్ ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? అనేది సినిమా.
విశ్లేషణ (Maidaan Review): మన భారతీయులకు వినోదం అంటే గుర్తుకు వచ్చేవి రెండు. ఒకటి... సినిమా. ఇంకొకటి... క్రికెట్! ఇండియాలో ఐపీఎల్ అంతలా హిట్ అవ్వడానికి కారణం ప్రజల్లో క్రికెట్ మీద ఉన్న మక్కువ కారణం. క్రికెట్ కంటే ముందు హాకీ, ఫుట్‌బాల్ వంటివీ ఆడారు. ఇంటర్నేషనల్ టోర్నమెంట్లలో మెడల్స్ కూడా సాధించారు. అయితే, ఇప్పుడు ఆ ఆటలు అంత పాపులర్ కాదు. హాకీ మీద 'చెక్ దే ఇండియా' వచ్చింది. ఫుట్‌బాల్ మీద 'మైదాన్' తీశారు.
స్పోర్ట్స్ బయోపిక్ అంటే పాపులర్, సక్సెస్‌ఫుల్ పర్సన్స్ జీవితాలే. రొటీన్ టెంప్లేట్‌లో ఉంటడంతో ఇటీవల ఆ జానర్ ఫిల్మ్స్ సక్సెస్ రేట్ తగ్గింది. ప్రతి సోర్ట్స్ పర్సన్ జీవితంలో ఎవరో ఒకరు అవరోధాలు, ఆటంకాలు సృష్టించడం, చివరకు విజేతగా నిలవడం... స్పోర్ట్స్ సినిమాల్లో కనిపించే రెగ్యులర్ ఫార్ములా. 'మైదాన్' ఫస్టాఫ్ చూసినప్పుడు సేమ్ ఫీలింగ్ కలుగుతుంది. సుమారు గంట ఉన్నప్పటికీ సీట్లలో ఎక్కువ సేపు కూర్చున్నట్లు ఉంటుంది. అసలు మజా ఇంటర్వెల్ తర్వాత మొదలైంది.
థియేటర్లలో కాకుండా మైదానంలో కూర్చున్న అనుభూతి ప్రేక్షకులకు ఇవ్వడంలో ఆర్టిస్టులతో పాటు టెక్నికల్ టీమ్ మెంబర్స్ 200 పర్సెంట్ సక్సెస్ అయ్యారు. గోల్ పోస్ట్ దగ్గరకు ఇండియన్ ఆటగాళ్లు వెళ్లిన ప్రతిసారీ గోల్ కొట్టాలని, దేశానికి పాయింట్ రావాలని, ఆపోజిట్ టీమ్ వచ్చినప్పుడు అడ్డుకోవాలని కోరుకునేంతలా... ఆయా సన్నివేశాల్లో లీనమై చూసేలా చిత్రాన్ని తెరకెక్కించారు. సెకండాఫ్ అంతటా ప్రేక్షకులు ఉత్కంఠ, ఉద్వేగానికి లోను అవుతారు.
'మైదాన్' సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సినిమాటోగ్రాఫర్స్ తుషార్ & Fyodor Lyass ఎక్స్‌ట్రాడినరీ వర్క్ సినిమాను మరో స్థాయికి తీసుకు వెళ్లింది. ఇంటర్వెల్ ముందు రహీమ్ లంగ్ క్యాన్సర్ బారిన పడ్డారని తెలిసే సన్నివేశంలో గానీ, ఫుట్ బాల్ సీన్స్ వచ్చేటప్పుడు గానీ సన్నివేశాల్లో ప్రేక్షకులు లీనమయ్యారంటే కారణం వాళ్ల పనితీరు ప్రధాన కారణం. ముఖ్యంగా పాటల్లో, నేపథ్య సంగీతంలో రెహమాన్ మార్క్ వినిపించింది. సినిమాకు ప్రాణం పోసింది. రియల్ ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తున్న ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు.
కథలోని కీలక మలుపుల దగ్గరకు వెళ్లడానికి దర్శకుడు అమిత్ శర్మ సమయం తీసుకున్నారు. ఫ్యామిలీ సీన్లు సైతం అంతగా ఆకట్టుకోలేదు. అయితే, ఒక్కసారి కథలోకి వెళ్లిన తర్వాత చూపు పక్కకు తిప్పుకోనివ్వలేదు. రన్ టైమ్ కాస్త తగ్గించి ఉంటే బావుండేది. ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. 1950, 60 వాతావరణం ప్రతిబింబించేలా ప్రొడక్షన్ డిజైనర్ వర్క్ చేశారు.
రహీమ్ ఎలా ఉంటారో ఈతరం ప్రేక్షకులకు తెలియదు. సినిమా పూర్తయ్యాక రహీమ్ ఫోటో చూపిస్తే... ఒక్క క్షణం 'రహీమ్ అంటే అజయ్ దేవగణ్ కదా! ఆయన బదులు మరొకర్ని తెరపై చూపిస్తున్నారేంటి?' అనుకోవడం సహజం. అంతలా రహీమ్ పాత్రలో అజయ్ దేవగణ్ జీవించారు... ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ వచ్చిన తర్వాత, జకార్తాలో విజయం సాధించిన తర్వాత సన్నివేశాల్లో నటన అద్భుతం. ప్రియమణి పాత్ర పరిధి మేరకు నటించారు.
ప్రభు ఘోష్ పాత్రలో గజరాజ్ రావు మేకోవర్, ఆయన నటన సూపర్బ్. ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ '800' ఫేమ్ మధుర్ మిట్టల్ ఓ పాత్రలో కనిపించారు. ఇంకా చైతన్య శర్మ, జకార్తా మ్యాచ్ గోల్ కీపర్ రోల్ చేసిన తేజస్ రవి శంకర్ ప్రేక్షకులకు గుర్తు ఉంటారు.
ఫుట్‌బాల్ గేమ్ గురించి తెలియని ప్రేక్షకులు సైతం స్క్రీన్ మీద ఏషియన్ గేమ్స్ మ్యాచ్‌లు వచ్చినప్పుడు, ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించాలని కోరుకునేలా... ఆ ఆటలో లీనమై చూసేలా చేసిన సినిమా 'మైదాన్'. థియేటర్లలో మూడు గంటలు ఐపీఎల్ మ్యాచ్ కంటే మించిన కిక్ ఇస్తుంది. అజయ్ దేవగణ్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన సినిమాల్లో 'మైదాన్' ఒకటిగా నిలుస్తుంది. జస్ట్ గో అండ్ వాచ్.
Also Read: విజయ్ దేవరకొండది బలుపా? పొగరా? కాన్ఫిడెన్సా? ఆయన క్యారెక్టర్, బిహేవియర్ మీద డీటెయిల్డ్ అనాలసిస్