Vijay Antony's Romeo Movie Review In Telugu: విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తమిళ సినిమా 'రోమియో'. తెలుగులో 'లవ్ గురు' పేరుతో అనువదించారు. ఇందులో మృణాళిని రవి హీరోయిన్. విజయ్ ఆంటోనీ తల్లిగా తెలుగు నటి సుధ, మావయ్యగా వీటీవీ గణేష్ నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ రోజు సినిమా విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 


కథ (Love Guru Movie Story): అరవింద్ (విజయ్ ఆంటోనీ) మలేసియా నుంచి ఇండియాలోని ఇంటికి వస్తాడు. 35 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు. తల్లిదండ్రులు సంబంధాలు చూస్తే... తన మనసులో ప్రేమ పుట్టినప్పుడు పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. చావు ఇంటిలో లీలా (మృణాళిని రవి)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో వందేళ్ల జీవితాన్ని ఊహించుకుంటాడు. హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలని లీలా పెట్టిన కండిషన్‌కు ఓకే చెప్పి మరీ వారంలో పెళ్లి చేసుకుంటాడు.


ఊరిలో చాలా పద్ధతిగా ఉన్న అమ్మాయి హైదరాబాద్ వచ్చాక మోడ్రన్ గెటప్‌లోకి వస్తుంది. హీరోయిన్ అవ్వాలనేది తన లక్ష్యం అని, తన మాట వినకుండా పెళ్లి చేశారని, విడాకులు ఇస్తానని చెబుతుంది. లీలాపై ప్రేమతో, ఆమెకు దగ్గరవ్వడం కోసం సినిమా ప్రొడ్యూస్ చేయడానికి అరవింద్ ముందుకు వస్తాడు. సినిమా నిర్మాణంలో ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? లీలాతో ఫోనులో మాట్లాడే విక్రమ్ ఎవరు? నిప్పు అంటే అతనికి ఎందుకంత భయం? జనని ఎవరు? లీలా, అరవింద్ చివరకు కలిశారా? లేదా? అనేది సినిమా.


విశ్లేషణ (Love Guru Review 2024): శోభనం గదిలో మంచం మీద మందు గ్లాసుతో అమ్మాయి, చెంబుతో అబ్బాయి... 'లవ్ గురు' / 'రోమియో' పోస్టర్ వైరల్ అవ్వడమే కాదు, కాంట్రవర్సీకి కారణమైంది. హీరో హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్స్ చెప్పడానికి డిజైన్ చేసిన పోస్టర్ తప్ప... సినిమాలో కాంట్రవర్షియల్ అంశాలు లేవు. ఇక, 'లవ్ గురు' సినిమా విషయానికి వస్తే...


'లవ్ గురు' / 'రోమియో'తో షారుఖ్ ఖాన్, అనుష్క శర్మ జంటగా నటించిన 'రబ్ నే బనాదీ జోడీ'ని గుర్తు చేశారు విజయ్ ఆంటోనీ. కోర్ పాయింట్, స్క్రీన్ ప్లే పరంగా రెండు సినిమాల మధ్య సారూప్యతలు కనిపిస్తాయి. అయితే... 'లవ్ గురు'లో హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్లు కొత్తగా ఉంటాయి. క్యారెక్టర్లకు తగ్గట్టు రాసిన పంచ్ డైలాగ్స్ బావున్నాయి. విజయ్ ఆంటోనీకి మృణాళిని రవి వైఫ్ అని తెలిశాక షూట్‌లో ఇంటిమసీ కోచ్ రియాక్షన్, పబ్బులో యోగిబాబు డైలాగ్స్ బావున్నాయి.


ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న అమ్మాయి, ఆమె ప్రేమ పొందడం కోసం భర్త చేసే ప్రయత్నాలు ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో చూసి ఉండొచ్చు. ఈ కథలో భార్య హీరోయిన్ కావాలనుకోవడం... ఆమె కోసం భర్త నటుడిగా, నిర్మాతగా మారడం... సిస్టర్ సెంటిమెంట్, క్లైమాక్స్ కథను కొత్తగా మార్చాయి. కథ, స్క్రీన్ ప్లే ప్రేక్షకుడి ఊహకు అందుతాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది? అనేది ఊహించడం కష్టం ఏమీ కాదు. అయితే... కామెడీ సినిమాను సేవ్ చేసింది.


అరవింద్ పాత్రకు ఏం కావాలో విజయ్ ఆంటోనీ అది చేశారు. డైలాగుల్లో ఆయన క్యారెక్టర్ మీద పడిన సెటైర్స్ నవ్విస్తాయి. నటుడిగా కంటే ఎడిటర్‌గా విజయ్ ఆంటోనీ ఎక్స్‌ట్రాడినరీ వర్క్ చేశారు. ల్యాగ్ లేకుండా సీన్ టు సీన్ ట్రాన్సిషన్ బాగా చూపించారు. ఇంటర్వెల్ ముందు నిర్మాతను కొట్టే సన్నివేశంలో ఎడిటింగ్ వర్క్ చాలా బావుంది. లీల పాత్రలో మృణాళిని రవి ఓకే.


Also Read: 'పుష్పరాజ్'కు ముందు అల్లు అర్జున్ టాప్ ఫైవ్ బెస్ట్ పెర్ఫార్మన్స్‌ లు... ఈ సినిమాలే ఎందుకంత స్పెషల్?



'లవ్ గురు' క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో షా రా (Tamil Artist Shah Ra) ప్రేక్షకులకు గుర్తు ఉంటారు. ఆయన కామెడీ టైమింగ్, డైలాగ్స్ బావున్నాయి. వీటీవీ గణేష్, యోగి బాబుకు ఇటువంటి క్యారెక్టర్లు కొత్త కాదు. వాళ్లకు చేయడం కష్టమూ కాదు. ఇద్దరికీ రాసిన పంచ్ డైలాగ్స్ కొన్ని పేలాయి. తెలుగు ప్రేక్షకులు సన్నివేశాల్లో పంచ్ మిస్ కాకుండా భాషా శ్రీ డైలాగ్స్ రాశారు. పాటల్లో సాహిత్యం అర్థమయ్యేలా లేదు. ట్యూన్స్ & సౌండింగ్ కూడా అందుకు కారణం. భరత్ ధనశేఖర్ అందించిన సాంగ్స్‌లో బీట్స్ బావున్నాయి. రీ రికార్డింగ్ ఓకే. నిర్మాణంలో విజయ్ ఆంటోనీ రాజీ పడలేదు. లావిష్‌గా తీశారు.


వీకెండ్ కాసేపు సరదాగా నవ్వుకోవడానికి 'లవ్ గురు'కు వెళ్ళవచ్చు. కథ, కథనం పరంగా ప్రేక్షకులకు సర్‌ప్రైజెస్ ఏమీ లేవు. సిస్టర్ సెంటిమెంట్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే అవకాశం ఉంది. అయితే... సినిమా బ్యాక్‌డ్రాప్‌లో తీసిన సన్నివేశాలు, విజయ్ ఆంటోనీ క్యారెక్టర్ మీద రాసిన పంచ్ డైలాగ్స్ అందర్నీ నవ్విస్తాయి. 'లవ్ గురు'... నవ్వులు పంచుతాడు.


Also Read: మైదాన్ రివ్యూ: ఫుట్‌బాల్ కోచ్ రహీమ్ బయోపిక్ - అజయ్ దేవగణ్ సినిమా ఎలా ఉందంటే?