Yash Will Not Play Ravana In Ramayana Movie: బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్టు ‘రామాయణం’. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా తెరకెక్కనంత బడ్జెట్‌తో దీనిని తెరకెక్కించాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యింది. ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ‘కేజీఎఫ్’ స్టార్ యష్ ఈ చిత్రంలో రావణుడి పాత్ర పోషించబోతున్నాడని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ వార్తల్లో వాస్తవం లేదని తేలిపోయింది. ఈ సినిమాకు ఆయన కేవలం సహ నిర్మాతగానే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.


‘రామాయణం’ కో ప్రొడ్యూసర్ గా యష్


నితేష్ తివారీ ‘రామాయణం’ సినిమాను ప్రకటించిన తర్వాత ఈ సినిమాలో యష్ కీలక పాత్ర పోషించబోతున్నారనే టాక్ వినిపించింది. చివరకు ఈ చిత్రంలో ఆయన రావణుడిగా కనిపిస్తారనే ఊహాగానాలు వచ్చాయి. కానీ, చివరకు అవన్నీ అవాస్తవాలేనని తేలాయి. ఈ చిత్రంలో ఆయన నటించకపోయినా, సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన సుమారు రూ. 80 కోట్లు పెట్టుబడి పెడుతున్నారట.   


‘రామాయణం’లో మిగతా నటీనటులు ఎవరంటే?   


‘రామాయణం’ సినిమాలో కుంభకర్ణుడి పాత్రలో బాబీ డియోల్‌ కనిపించనున్నట్లు తెలుస్తోంది. అటు విజయ్ సేతుపతి రావణుడి తమ్ముడు విభీషణుడిగా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. లారా దత్తా, షీబా చద్దా కూడా ఈ చిత్రంలో భాగం కానున్నారు. లారా రాముడి సవతి తల్లి కైకేయి పాత్రలో నటిస్తుండగా, షీబా మందరగా కనిపించనుంది. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా తెరకెక్కనంత బడ్జెట్‌తో దీనిని తెరకెక్కించాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రం 2025 దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.  


రాముడి పాత్ర కోసం రణబీర్ స్పెషల్ ట్రైనింగ్   


ఇక ఈ సినిమా కోసం రణబీర్ తనను తాను పూర్తి మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫిట్ నెస్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు. తాజాగా వర్కౌట్స్ కు సంబంధించి గ్లింప్స్ ను కూడా ఆయన అభిమానులతో పంచుకున్నారు. రణబీర్ షర్ట్ లేకుండానే పచ్చటి పరిసరాల నడుమ వర్కౌట్స్ చేస్తూ కనిపించారు. ట్రైనర్ తో కలిసి పరిగెత్తడం, బరువులు మోయడం స్విమ్మింగ్, సైక్లింగ్, హైకింగ్‌ చేస్తూ కనిపించాడు.  


‘టాక్సిక్‘ పనుల్లో యష్ ఫుల్ బిజీ 


కన్నడ స్టార్ యష్ ప్రస్తుతం ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ యొక్క KVN ప్రొడక్షన్స్, యష్  మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.  డ్రగ్స్‌ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్‌ ఓరియెంటెడ్‌ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 10, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Read Also: ‘నడిగర్’ మూవీ తెలుగు టీజర్ - మైత్రీ మూవీస్ తొలి మలయాళీ చిత్రం, అదరగొట్టిన టోవినో థామస్