Priyamani Reacts To Why She Was Not Cast Opposite Star Heros : సీనియర్ నటి ప్రియమణి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. అయితే ఇన్నాళ్ల తన సినీ కెరీర్ లో పెద్ద హీరోలతో ఎక్కువ సినిమాలు చేయలేదు. మీడియం రేంజ్ హీరోలతోనే ఎక్కువగా జతకట్టిన ప్రియమణి.. తెలుగు, తమిళ భాషల స్టార్ హీరోలతో నటించనేలేదు. ఇన్నేళ్ళ తన సినిమా కెరియర్ లో అగ్ర హీరోల సరసన నటించకుండా ఉండడానికి కారణం ఏంటనే ప్రశ్న ప్రియమణికి ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటుంది. తాజాగా అదే ప్రశ్న మరోసారి ఎదురయింది. ఇందుకు ప్రియమణి స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


అందుకే నన్ను స్టార్ హీరోల సినిమాల్లో తీసుకోరు


ప్రియమణి తాజాగా బాలీవుడ్ లో అజయ్ దేవగన్ సరసన 'మైదాన్' అనే సినిమాలో నటించింది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఇక్కడ కూడా అదే ప్రశ్న ఎదురవడంతో దానికి ప్రియమణి ఇలా బదులిచ్చింది. "స్టార్ లిస్ట్ లో ఉండే హీరోలకు జోడిగా నన్ను ఎందుకు తీసుకోరనేది నాకు అర్థం కాదు. ఇప్పటికీ దాని సమాధానం నా దగ్గర లేదు. అయితే ఈ ప్రశ్న దర్శక నిర్మాతలను అడిగితే బాగుంటుందని నా అభిప్రాయం. అయినా ఈ విషయంలో నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. చాలామంది దగ్గర నేను విన్నది ఏంటంటే, నన్ను స్టార్ హీరోల సినిమాలో తీసుకుంటే.. నా పక్కన ఉన్న వాళ్ళు కనబడకుండా డామినేట్ చేస్తానట. వారి పాత్రలను తినేస్తానట. అందుకనే స్టార్ హీరోకు జోడిగా లేదా వాళ్ళ సినిమాలోని తీసుకోవడానికి ఆసక్తి చూపించరని చెబుతుంటారు. ఏదో అలా అంటారు గాని, అది నిజం కాదు. సరైన కారణం ఏంటి అన్నది మాత్రం ఇప్పటికీ తెలియదు" అని చెప్పింది.


కొన్నిసార్లు బాధగా అనిపిస్తుంది


"స్టార్ హీరోల సినిమాల్లో నన్ను తీసుకోకపోయినా పర్వాలేదు ప్రస్తుతం నేను చేస్తున్న పాత్రలతో సంతృప్తి గానే ఉన్నాను. అయితే స్టార్ హీరోలతో నటించడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వాళ్లతో పని చేయకపోవడం వల్ల అవన్నీ మిస్ అయిపోతున్నానని అనిపిస్తుంది. దాదాపు సగం మంది స్టార్ హీరోలు నాకు పరిచయం ఉన్నవాళ్ళే. కనిపిస్తే హాయ్, బాయ్ అని పలకరించుకుంటాం. వారి సినిమాల్లో నన్ను ఎందుకు సెలెక్ట్ చేయట్లేదని కొన్నిసార్లు బాధగా అనిపిస్తుంది" అంటూ చెప్పుకొచ్చింది.


బాలీవుడ్ లో బిజీ బిజీ


ఒకప్పుడు తమిళ్, తెలుగు భాషల్లో వరుస అవకాశాలు అందుకున్న ప్రియమణి ఈ మధ్యకాలంలో ఎక్కువ బాలీవుడ్ ఆఫర్లు అందుకుంటుంది. మొదటిసారి 'చెన్నై ఎక్స్ ప్రెస్' మూవీలో షారుక్ ఖాన్ తో కలిసి స్టెప్పులేసిన ఈ సీనియర్ హీరోయిన్ గత ఏడాది 'జవాన్' సినిమాలో కీలక పాత్ర పోషించి తన నటనతో ఆకట్టుకుంది. ఇక రీసెంట్ గా 'ఆర్టికల్ 370' మూవీలో నటించింది. ఆ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఇక తాజాగా అజయ్ దేవగన్ సరసన 'మైదాన్' మూవీ చేసింది. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా డీసెంట్ టాక్ అందుకుంది. ఇక త్వరలోనే ప్రియమణి నుంచి 'ఫ్యామిలీ మెన్ సీజన్ 3' అనే హిందీ సిరీస్ కూడా రాబోతోంది.


Also Read : ఇది మీ సినిమా.. మీరంతా ప్రేమించాల్సిన సినిమా.. క‌చ్చితంగా క‌నెక్ట్ అవుతారు.. న‌వ‌దీప్