Adollaki Amada Dhooram Song Promo: యువ హీరో రాజ్ తరుణ్ వరుస సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా చక్కటి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆయన హీరోగా ‘భలే ఉన్నాడే’ సినిమా తెరకెక్కుతోంది. మారుతి టీమ్ ప్రొడక్ట్ నిర్మాణ సంస్థ సమర్పణలో ఈ చిత్రాన్ని రవి కిరణ్ ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి మరో కీలక అప్ డేట్ ఇచ్చారు.


ఆకట్టుకుంటున్న ఫస్ట్ లిరికల్ ప్రోమో


‘భలే ఉన్నాడే’ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ‘ఆడోళ్లకి ఆమడదూరం’ అంటూ సాగే ఈ పాటకు సంబంధించి 15 సెకెన్ల ప్రోమోను నెట్టింట్లోకి వదిలారు. పూర్తి లిరికల్ సాంగ్ ను రేపు(ఏప్రిల్ 11న) ఉదయం 11:07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇక ఈ ప్రోమో కుట్టు మిషన్ తో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత వేడుకకు రెడీ అవుతున్న అమ్మాయికి రాజ్ తరుణ్ పట్టు చీర కడుతూ కనిపిస్తాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.



ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన ఫస్ట్ లుక్ సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇందులో రాజ్ తరణ్ స్టైలిష్ గా కనిపించడంతో పాటు కూల్ లుక్ తో ఆహా అనిపించాడు. చూడ్డానికి సాఫ్ట్ వేర్ కుర్రాడిలా కనిపించినా, బ్యాగ్రౌండ్ లో అమ్మాయిల బ్యూటీ ప్రొడక్ట్స్, చీర కనిపించాయి. ఈ సినిమా ఏదో కొత్త కాన్సెప్టుతో తెరకెక్కుతున్నట్లు అందరూ భావించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో కుట్టు మిషన్, చీర కట్టడం లాంటివి చూస్తుంటే తను టైలర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.


దర్శకుడిగా పరిచయం కాబోతున్న జె.శివసాయి వర్ధన్


ఇక ఈ సినిమాతో తొలిసారి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు జె.శివసాయి వర్ధన్. వెండి తెరకు కొత్త అయినా, వెబ్ సిరీస్ తో ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు వర్దన్. ‘గీతా సుబ్రహ్మణ్యం’, ‘పెళ్లి గోల 2’, ‘హలో వరల్డ్’ లాంటి వెబ్ సిరీస్‌లు యువతను బాగా అలరించాయి. ఈ సినిమాలో సీనియర్‌ దర్శకులు సింగీతం శ్రీనివాస రావు కీలక పాత్రలో కనిపించనున్నారు. మనీషా కంద్కూర్‌, అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్‌, హైపర్‌ ఆది, కృష్ణ భగవాన్‌, గోపరాజు రమణ సహా పలువురు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి నగేష్‌ బానెల్‌ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. శేఖర్‌చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఆర్ట్‌ డైరెక్టర్ గా సురేష్‌ భీమగాని బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


Read Also : శ్రీలీల ప్లేస్‌ లో కొత్త హీరోయిన్ -  రౌడీ హీరో సరసన 'మిస్టర్ బచ్చన్' బ్యూటీ !