సినిమా రివ్యూ : ది స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్!
రేటింగ్ : 1.5/5
నటీనటులు : నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్, మధు నందన్, భార్గవ్ పోలుదాస్, సమర్ద్, దేవి నాగవల్లి, మెహర్ తదితరులు
ఛాయాగ్రహణం : అమర్ దీప్ 
నేపథ్య సంగీతం : గిడియన్ కట్ట
స్వరాలు : ఆర్వీజ్
నిర్మాతలు : ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపు
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం :రవి ప్రకాష్ బోడపాటి
విడుదల తేదీ: మే 12, 2023 


'బటర్ ఫ్లై'తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యువకుడు నిహాల్ కోదాటి (Nihal Kodhaty). ఆ సినిమా ఓటీటీలో విడుదలైనా అతనికి మంచి పేరు వచ్చింది. దాని కంటే ముందు అడివి శేష్ 'ఎవరు' సినిమాలో చేసిన పాత్ర కూడా పేరు తెచ్చింది. నిహాల్ హీరోగా నటించిన తాజా సినిమా 'ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్'. ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే (The Story Of A Beautiful Girl Film Review)? 


కథ (The Story Of A Beautiful Girl Movie Story) : ప్రముఖ వాయిస్ / డబ్బింగ్ ఆర్టిస్ట్ చరిత్ర (ద్రిషిక చందర్) మిస్సింగ్ కేసు నమోదు అవుతుంది. దానిని సాల్వ్ చేసే బాధ్యత సీబీఐ ఆఫీసర్ అయిన ఐపీఎస్ ఆదిత్య (భార్గవ్ పోలుదాసు)కు అప్పగిస్తారు. స్నేహితుడు విక్రమ్ (సమర్థ్ యోగి)తో డిన్నర్ కి వెళ్లిన తర్వాత నుంచి చరిత్ర కనిపించకుండా పోతుంది. అందుకని, పోలీసులు ముందుగా అతని ప్రశ్నిస్తారు. విక్రమ్ పరిచయం కావడానికి ముందు రవి (నిహాల్ కోదాటి)తో చరిత్ర సన్నిహితంగా ఉండేది. విక్రమ్ రాకతో ఆమె జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. లగ్జరీ లైఫ్ స్టైల్ ఆమెలో ఎటువంటి మార్పు తీసుకొచ్చింది? ఆన్ లైన్ వల్ల అమ్మాయిలు ఎన్ని వేధింపులకు గురి అవుతున్నారు? చరిత్ర కేసును పోలీసులు ఎలా పరిష్కరించారు? అనేది మిగతా సినిమా. 


విశ్లేషణ (The Story Of A Beautiful Girl Telugu Review) : అందం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు ఒక్కొక్కరూ ఒక్కోలా నిర్వచనం ఇస్తారు. అందమైన అమ్మాయి అని కాదు, అసలు అమ్మాయిలకు సమాజంలో చాలా వేధింపులు ఎదురవుతున్నాయి. అందులో ఆన్ లైన్ వేధింపులు ఒకటి. ఆ నేపథ్యంలో తీసిన చిత్రమిది. 'ది స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్' కాన్సెప్ట్ బావుంది. కానీ, తెరకెక్కించిన తీరులో తప్పులు దొర్లాయి. దర్శకుడు మంచి విషయం చెప్పాలనుకున్నారు. కానీ, మంచిని చెప్పిన తీరు హర్షించేలా లేదు.


హీరోయిన్ అంటే హీరోకి విపరీతమైన ప్రేమ! ఇద్దరూ శారీరకంగా దగ్గర అవుతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య మరొక అబ్బాయి రావడంతో దూరం పెరుగుతుంది. హీరో తీవ్ర మనోవేదనకు గురి అవుతాడు. మళ్ళీ హీరోయిన్ తన దగ్గరకు వచ్చినప్పుడు 'నువ్వు ఎవరితో అయినా ఉండు! నాతో కూడా ఉండు' అని చెబుతాడు. ఆ ఒక్క మాట విన్నాక మన రెండు చేతులు జేబులో పెట్టుకుని థియేటర్ నుంచి బయటకు రావాలనిపిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమను చూపిస్తున్నారా? కామాన్ని చూపిస్తున్నారా? దర్శకుడిలో క్లారిటీ లోపించింది. ఇటువంటి తప్పులు చేయడంతో సినిమాతో కనెక్ట్ కావడం కష్టంగా ఉంది. 


దర్శకుడు సన్నివేశాల్లో ఏం చెప్పాలనుకున్నాడో క్లారిటీ లోపిస్తే... గిడియన్ కట్ట అందించిన నేపథ్య సంగీతం మరింత ఇబ్బంది పెట్టింది. చెవులకు పట్టిన తుప్పు వదిలించేలా లౌడ్ రీ రికార్డింగ్ చేశారు. ఉన్నంతలో నిర్మాణ విలువలు బావున్నాయ్. ప్రతి ఫ్రేమును సినిమాటోగ్రాఫర్ అందంగా చూపించారు.  


నటీనటులు ఎలా చేశారు? : ఐపీఎస్ అధికారిగా భార్గవ్ పోలుదాసు చాలా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. ఆయన స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారీ ఓ క్యూరియాసిటీ కలిగింది. ఆయనతో పాటు మధునందన్ కూడా డీసెంట్ పెరఫార్మన్స్ చేశారు. 


హీరోయిన్ ద్రిషిక చందర్ ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. పాటలు, కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన బాగుంది. నిహాల్ కోదాటికి నటనలో ఎక్కువ వేరియేషన్స్ చూపించే ఛాన్స్ రాలేదు. ఉన్నంతలో బాగా చేశారు. సమర్థ్ యుగ్ ఓకే.   


Also Read : 'కస్టడీ' సినిమా రివ్యూ : నాగ చైతన్య సక్సెస్ కొట్టారా? డిజప్పాయింట్ చేశాడా?


చివరగా చెప్పేది ఏంటంటే? : 'ఏ స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్' కాన్సెప్ట్ బావుంది. కానీ, ఎగ్జిక్యూషన్ బాలేదు. ఈజీగా స్కిప్ కొట్టేయొచ్చు. అంతగా చూడాలని అనుకుంటే ఓటీటీలో వచ్చే వరకు ఓకే చేయవచ్చు.


Also Read : రామబాణం రివ్యూ : గోపిచంద్ ‘రామబాణం’ లక్ష్యాన్ని ఛేదించిందా? గురి తప్పిందా?