సినిమా రివ్యూ : రామబాణం
రేటింగ్ : 2/5
నటీనటులు : గోపిచంద్, డింపుల్ హయతి, జగపతి బాబు, నాజర్, ఖుష్బూ, తరుణ్ అరోరా తదితరులు 
కథ : భూపతి రాజా
మాటలు : మధుసూదన్ పడమటి
ఛాయాగ్రహణం : వెట్రి పళనిసామి
సంగీతం : మిక్కీ జే మేయర్
నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూఛిబొట్ల
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శ్రీవాస్
విడుదల తేదీ: మే 5, 2023


జయాపజయాలతో సంబంధం లేకుండా ఫిక్స్‌డ్ మార్కెట్‌తో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న హీరో గోపిచంద్. తన చివరి సినిమా ‘పక్కా కమర్షియల్’ నిరాశ పరిచింది. దీంతో తనకు అచ్చొచ్చిన ఫ్యామిలీ జానర్‌తో, రెండు సూపర్ హిట్లిచ్చిన డైరెక్టర్ శ్రీవాస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫ్యామిలీ సినిమాలను ఆకట్టుకునే విధంగా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని, రామబాణం కచ్చితంగా విజయం సాధిస్తుందని ప్రచారంలో నమ్మకం వ్యక్తం చేశారు. మరి ఆ నమ్మకం ఏ మేరకు నిజం అయింది? రామబాణం ఎలా ఉంది?


కథ (Rama Banam Story): రఘుదేవ పురం అనే గ్రామంలో రాజారాం (జగపతి బాబు), అతని భార్య భువనేశ్వరి (ఖుష్బూ) ఆర్గానిక్ హోటల్ నడుపుతూ ఉంటాడు. అతని తమ్ముడు విక్కీ (గోపీచంద్). చిన్నప్పుడే అన్నయ్యతో గొడవ పెట్టుకుని విక్కీ ఊరు వదిలి పారిపోతాడు. కోల్ కతాలో పెద్ద డాన్ గా ఎదుగుతాడు. అక్కడే భైరవి (డింపుల్ హయతి) ప్రేమలో పడతాడు. కానీ కుటుంబం ఉంటేనే భైరవిని ఇచ్చి పెళ్లి చేస్తానని ఆమె తండ్రి (సచిన్ ఖేడ్కర్) కండిషన్ పెడతాడు. దీంతో 14 సంవత్సరాల తర్వాత విక్కీ అన్న దగ్గరకి వస్తాడు. కానీ బిజినెస్ మాన్ జీకే (తరుణ్ అరోరా) కారణంగా అన్నకి సమస్య ఉందని తెలుస్తుంది. ఈ సమస్యని విక్కీ ఎలా పరిష్కరించాడు? తమ్ముడు డాన్ అని రాజారాంకి తెలిసిందా? ఈ విషయాలన్నీ తెలియాలంటే 'రామ బాణం' చూడాల్సిందే.


విశ్లేషణ: చిన్నపుడు ఎప్పుడో ఇంటి నుంచి వెళ్లిపోయిన హీరో తిరిగి వచ్చి ఫ్యామిలీ కష్టాలు తీర్చడం అనే ఫార్ములా కథలు మనకు కొత్తేమీ కాదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచి ఇలాంటి కథలు చూస్తూనే ఉన్నాం. కనెక్ట్ అయిన ప్రతిసారీ సక్సెస్ లు కూడా అవుతూనే ఉన్నాయి. లక్ష్యం, లౌక్యంలతో వరుసగా రెండు హిట్లు కొట్టిన గోపీచంద్, శ్రీవాస్ కాంబో కూడా హ్యాట్రిక్ సక్సెస్ కోసం ఈ ఫార్ములానే నమ్ముకుంది. కానీ ఫార్ములాతో పాటు ట్రీట్‌మెంట్ కూడా పాతదే కావడం ‘రామబాణం’ని గురి తప్పేలా చేసింది. 


చిన్నప్పుడు ఇంట్లో గొడవ పడి హీరో పారిపోవడం, కోల్‌కతా వెళ్లి పెద్ద డాన్ అవ్వడం, వెంటనే హీరోయిన్ ఎంట్రీ... ఇలా సీన్లన్నీ వరుసగా పేర్చుకుంటూ వెళ్లిపోయారు. హీరో, హీరోయిన్ల మధ్య ప్రత్యేకమైన లవ్ ట్రాక్ పెట్టకుండా ఒక సాంగ్‌లోనే వారు ఎలా ప్రేమించుకున్నారో తేల్చేయడం పెద్ద రిలీఫ్. కామెడీ సీన్లు అస్సలు పేలలేదు. ఇంటర్వల్ బ్యాంగ్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. గుళ్లో ఫైట్, ఆ తర్వాత విలన్‌కి వార్నింగ్... ఈ సీన్లు మంచి హై ఇస్తాయి. 


ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ కూడా అంతే రొటీన్‌గా సాగుతుంది. హీరో, విలన్‌ల మధ్య క్యాట్ అంట్ మౌజ్ గేమ్ ఏమాత్రం ఇంట్రస్టింగ్‌గా ఉండదు. చాలా చప్పగా సాగుతుంది. సాంగ్స్ ప్లేస్‌మెంట్ కూడా కథ ఫ్లోని దెబ్బ తీస్తాయి. ప్రీ-క్లైమ్యాక్స్ ముందు వచ్చే ఎమోషనల్ సీన్, దాని వెంటనే వచ్చే క్లైమ్యాక్స్ యాక్షన్ ఫైట్ ఆకట్టుకుంటాయి. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అయితే యాక్షన్ సీన్ల కోసం థియేటర్లకు వచ్చే గోపిచంద్ ఫ్యాన్స్ మాత్రం అస్సలు డిజప్పాయింట్ అవ్వరు.


ఇక నటీనటుల విషయానికి వస్తే... గోపిచంద్‌కు ఇలాంటి పాత్రలు చేయడం అస్సలు కొత్తేమీ కాదు. తన లుక్స్ ఆకట్టుకుంటాయి. భైరవి పాత్రలో కనిపించిన డింపుల్ హయతి నటించడానికి పెద్దగా స్కోప్ లేదు. గోపిచంద్ అన్న పాత్రలో జగపతిబాబు బాగా నటించాడు. జగపతి బాబు, ఖుష్బూ పాత్రల్లో మంచి ఎమోషన్స్ పండాయి. నాజర్, తరుణ్ అరోరా విలన్ పాత్రల్లో నటించారు. మిగతా నటీనటులందరూ పాత్రల పరిధి మేర నటించారు.


ఓవరాల్‌గా చెప్పాలంటే... గోపిచంద్, శ్రీవాస్ కాంబినేషన్‌కు హ్యాట్రిక్ మిస్ అయిందని చెప్పాలి. కేవలం యాక్షన్ సన్నివేశాలు బాగుంటే చాలు అనుకునేవారు, గోపిచంద్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం ఒక లుక్ వేయవచ్చు.