సినిమా రివ్యూ : కస్టడీ
రేటింగ్ : 2.25/5
నటీనటులు : అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, గోపరాజు రమణ, 'వెన్నెల' కిశోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులతో పాటు అతిథి పాత్రల్లో జీవా, ఆనంది
మాటలు : అబ్బూరి రవి
ఛాయాగ్రహణం : ఎస్ఆర్ కతీర్
సంగీతం : ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
నిర్మాత : శ్రీనివాస చిట్టూరి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : వెంకట్ ప్రభు
విడుదల తేదీ: మే 12, 2023 


తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుది సపరేట్ స్టైల్! టేకింగ్, స్క్రీన్ ప్లేతో మేజిక్ చేస్తూ... మెస్మరైజింగ్ సినిమాలు చేశారు. అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కస్టడీ'. ఇందులో అరవింద్ స్వామి విలన్ రోల్ చేశారు. కృతి శెట్టి కథానాయికగా నటించారు. ఈ సినిమా ఎలా ఉందంటే? (Custody Movie Review Telugu)


కథ (Custody Movie Story) : శివ (నాగ చైతన్య) సఖినేటిపల్లి పోలీస్ స్టేషనులో కానిస్టేబుల్. అంబులెన్స్ కి దారి ఇవ్వడం కోసం ఏకంగా సీయం దాక్షాయణి (ప్రియమణి) కాన్వాయ్ ఆపి వార్తల్లోకి ఎక్కుతాడు. డ్యూటీ అంటే ప్రాణం పెడతాడు. అతడు అంటే రేవతి (కృతి శెట్టి)కి ప్రాణం. కులాలు వేరు కావడంతో అమ్మాయి ఇంట్లో ఒప్పుకోరు. వేరే అబ్బాయి (వెన్నెల కిశోర్)తో పెళ్లి నిశ్చయం చేస్తారు. రేవతికి ఆ పెళ్లి ఇష్టం లేదు. లేచిపోయి వస్తానని చెబుతుంది. లేదంటే చావడానికి రెడీ అంటుంది! 


రేవతి కోసం శివ వెళ్తుంటే... దారిలో డ్రంకన్ డ్రైవ్ కేసులో రాజు (అరవింద్ స్వామి), సీబీఐ ఆఫీసర్ జార్జ్ (సంపత్ రాజ్)ను అరెస్ట్ చేసి స్టేషనుకు తీసుకొస్తాడు. రాజును చంపాడనికి పోలీస్ కమీషనర్ నటరాజన్ (శరత్ కుమార్) సహా ఏకంగా పోలీస్ ఫోర్స్, రౌడీలు రంగంలోకి దిగుతారు. ఎందుకు? అసలు రాజు ఎవరు? స్టేషన్ నుంచి రాజును తప్పించిన శివ బెంగళూరు ఎందుకు తీసుకు వెళ్లారు? ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏమిటి? ఈ కేసులో సీఎం పాత్ర ఏమిటి? ఓ సాధారణ కానిస్టేబుల్ స్టేట్ మొత్తాన్నీ ఎదుర్కొని ఓ క్రిమినల్ చావకూడదని ఎందుకు ప్రయత్నించాడు? అనేది తెరపై చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Custody Telugu Review) : వెంకట్ ప్రభు సినిమాలు అంటే టిపికల్ స్క్రీన్ ప్లేతో రేసీగా సాగుతాయి. కథలో వచ్చే మలుపులు ఊహకు అందని విధంగా, మాంచి థ్రిల్ ఇస్తూ మనల్ని మెస్మరైజ్ చేస్తాయి. 'కస్టడీ'లో ఆ థ్రిల్ & రేసీ స్క్రీన్ ప్లే మిస్ అయ్యింది.
 
'కస్టడీ' కథకు వస్తే... ఇదొక సాధారణ రివేంజ్ డ్రామా! అయితే... ఎట్టి పరిస్థితుల్లోనూ విలన్ చావకూడదని హీరో ప్రయత్నించడమే కాన్సెప్ట్! ఇటువంటి కథలను చాలా అసాధారణంగా రేసీగా చెప్పడం వెంకట్ ప్రభు స్టైల్. కానీ, ఎందుకో ఈసారి ఆయన స్టైల్ పక్కకి పెట్టి... కథా నేపథ్యానికి తగ్గట్టు నిదానంగా ముందుకు వెళ్లారు. దానికి తోడు ఇళయరాజా, యువన్ శంకర్ రాజాల నేపథ్య సంగీతం సైతం ఆశించిన రీతిలో లేదు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గుర్తుంచుకునే పాట ఒక్కటీ లేదు. ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టు నెమ్మదిగా సినిమా ముందుకు వెళ్లడంతో కాస్త నిరాశ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ రొటీన్ కావడంతో సినిమాలో కావాల్సిన ఎమోషన్ క్యారీ కాలేదు.


'కస్టడీ' నిదానంగా ముందుకు వెళ్ళినప్పటికీ... కొన్ని సీన్లలో వెంకట్ ప్రభు తన మార్క్ చూపించారు. అండర్ వాటర్ సీక్వెన్సులు బాగా తీశారు. ఇంటర్వెల్ ముందు వరకు ఎక్కువగా ప్రేమ కథ, కామెడీ మీద కాన్సంట్రేట్ చేయడంతో ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అంత గొప్పగా లేదు. కానీ, ఆ తర్వాత వెంకట్ ప్రభు కొంత మ్యాజిక్ చేశారు. లాజిక్స్ పక్కన పెడితే... 'సింధూర పువ్వు' రాంకీ వచ్చినప్పుడు మాత్రం థియేటర్లలో విజిల్స్ పడతాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్ 90ల నేపథ్యాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించారు. 


నటీనటులు ఎలా చేశారు? : వెంకట్ ప్రభు సినిమాల్లో హీరోలు అంటూ ఎవరూ ప్రత్యేకంగా ఉండరు. క్యారెక్టర్లు, క్యారెక్టరైజేషన్లు హైలైట్ అవుతాయి. 'కస్టడీ'కి వస్తే... అరవింద్ స్వామి హైలైట్ అవుతారు. ఈతరం ప్రేక్షకులకు 'అగ్గిపెట్టె ఉందా?' అని వినబడితే ఆయన గుర్తుకు వస్తారేమో!? పేరుకు క్రిమినల్ క్యారెక్టర్ కానీ... కొన్ని సన్నివేశాల్లో ఆయన యాక్టింగ్, ఆ డైలాగ్స్ మంచి కామెడీ జెనరేట్ చేశాయి.


శివ పాత్రకి అక్కినేని నాగ చైతన్య న్యాయం చేశారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో లాంగ్ హెయిర్ స్టైల్ చూస్తే యంగ్ నాగార్జునను చూసినట్టు ఉంటుంది. కృతి శెట్టి రోల్ ఓకే. 'వెన్నెల' కిశోర్ కొన్ని సన్నివేశాల్లో నవ్వించే ప్రయత్నం చేశారు. సంపత్ రాజ్, శరత్ కుమార్, గోపరాజు రమణ తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు. సీఎంగా ప్రియమణి పాత్ర పరిథి తక్కువ. ఉన్నంతలో బాగా చేశారు. 'వంటలక్క' అలియాస్ ప్రేమి విశ్వనాథ్ ఓ సన్నివేశంలో మెరిశారు. 


నాగ చైతన్యకు అన్నయ్య పాత్రలో తమిళ హీరో జీవా, అతని ప్రేయసిగా ఆనంది అతిథి పాత్రల్లో మెరిశారు. ఓ పాటలో దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు, హీరో వైభవ్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు.  


Also Read : రామబాణం రివ్యూ: గోపిచంద్ ‘రామబాణం’ లక్ష్యాన్ని ఛేదించిందా? గురి తప్పిందా?


చివరగా చెప్పేది ఏంటంటే? : 'కస్టడీ'లో వెంకట్ ప్రభు మ్యాజిక్ మిస్ అయ్యింది. కానీ, ఆయన మార్క్ సీన్లు కొన్ని ఉన్నాయి. అరవింద్ స్వామి అదరగొట్టారు. మధ్య మధ్యలో నవ్వుకోవడానికి అయితే ఒకే. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకు వెళితే కొంతలో కొంత ఎంజాయ్ చేయవచ్చు. అక్కినేని అభిమానులు ఆశించే విజయం కోసం అయితే నాగ చైతన్య మరో ప్రయత్నం చేయాలి. 


Also Read : ఉగ్రం రివ్యూ: అల్లరోడి ఉగ్రరూపం ఆడియన్స్‌ను ఆకట్టుకుందా?