సినిమా రివ్యూ : ఉగ్రం
రేటింగ్ : 2.75/5
నటీనటులు : అల్లరి నరేష్, మిర్నా మీనన్, ఇంద్రజ, శత్రు తదితరులు 
కథ : తూము వెంకట్
మాటలు : అబ్బూరి రవి
ఛాయాగ్రహణం : జె. సిద్ధార్థ్
సంగీతం : శ్రీచరణ్ పాకాల
నిర్మాతలు : సాహూ గార్లపాటి, సురేష్ పెద్ది
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : విజయ్ కనకమేడల
విడుదల తేదీ: మే 5, 2023


ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అల్లరి నరేష్ కొన్నాళ్లుగా రూటు మార్చారు. కొన్నాళ్ల క్రితం ‘నాంది’తో సీరియస్ సబ్జెక్ట్ ట్రై చేసి బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు అదే సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడలతో కలిసి ‘ఉగ్రం’ అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి సీరియస్ సబ్జెక్టుతో అల్లరి నరేష్ ఇప్పటివరకు చేయని యాక్షన్ సీక్వెన్స్‌లతో ‘ఉగ్రం’ తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా?


కథ: శివ కుమార్ (అల్లరి నరేష్) సిన్సియర్ పోలీసాఫీసర్. ఒకరోజు భార్య అపర్ణ (మిర్నా మీనన్), కూతురుతో కలిసి కారులో వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ అవుతుంది. భార్య, కూతురు ఇద్దరినీ హాస్పిటల్‌లో జాయిన్ చేస్తాడు. తర్వాత రోజు శివ హాస్పిటల్‌కు ఎవరినీ తీసుకురాలేదని, అక్కడున్న డాక్టర్లు చెప్తారు. యాక్సిడెంట్‌లో శివ తలకు దెబ్బ తగలడం కారణంగా తనకు డిమెన్షియా అనే వ్యాధి వచ్చిందని, అందుకే భార్య, కూతురిని తీసుకురాకపోయినా అలా ఊహించుకున్నాడని డాక్టర్ (ఇంద్రజ) చెబుతుంది. హాస్పిటల్‌కు తీసుకురాకపోతే అపర్ణ, తన కూతురు ఏమయ్యారు? సిటీలో వరుసగా వెలుగు చూస్తున్న మిస్సింగ్ కేసులకు వీరికి సంబంధం ఏంటి? ఇవన్నీ తెలియాలంటే ఉగ్రం చూడాల్సిందే.


విశ్లేషణ: ‘నాంది’తో విజయ్ కనకమేడల టాలీవుడ్‌లో గుర్తుండిపోయే ఎంట్రీ ఇచ్చారు. అల్లరి నరేష్ ఇమేజ్ మారడానికి కూడా ‘నాంది’ చాలా ఉపయోగపడింది. మళ్లీ వీరి కలయికలో సినిమా అనగానే ఆడియన్స్‌లో ఆసక్తి కలిగింది. సినిమా చాలా ఇంట్రస్టింగ్‌గా స్టార్ట్ అవుతుంది. మొదటి సీన్ నుంచే దర్శకుడు విజయ్ పూర్తిగా కథలోకి వెళ్లిపోయాడు. అయితే అల్లరి నరేష్‌కు డిమెన్షియా అని తెలిసి కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాక సినిమా గాడి తప్పుతుంది. ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఎంత ఆసక్తికరంగా సాగుతుందో, లవ్ ట్రాక్, ఫ్లాష్ బ్యాక్, పాటలు అనాసక్తికరంగా ఉంటాయి.


ఉగ్రంలో యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా చాలా ఓవర్ ది బోర్డ్ ఉన్నాయి. అయితే వాటిని కన్విన్సింగ్‌గా తీయడంలో విజయ్ సక్సెస్ అయ్యారు. యాక్షన్ ఎపిసోడ్స్ గూస్ బంప్స్ తెప్పించడం మాత్రం ఖాయం. స్టార్టింగ్‌లో నైట్ ఎఫెక్ట్‌లో వచ్చే ఫైట్, ఇంటర్వెల్ రెయిన్ ఫైట్, సెకండాఫ్‌లో హిజ్రాలతో ఫైట్... ఇలా స్క్రీన్ మీద యాక్షన్ ఎపిసోడ్ వచ్చిన ప్రతిసారీ ఆడియన్స్ సీట్ ఎడ్జ్‌కు వస్తారు. ఇక క్లైమ్యాక్స్ అయితే నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి. అల్లరి నరేష్ విశ్వరూపం చూపించేశాడు. యాక్షన్ సీక్వెన్స్‌లను ఎఫెక్టివ్‌గా తీయగలనని విజయ్ కనకమేడల ప్రూవ్ చేసుకున్నారు.


అయితే ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. నిజానికి ఈ కథకు పాటలు అవసరం లేదు. సెకండాఫ్‌లో సినిమా ఇంట్రస్టింగ్‌గా సాగుతున్న దశలో వచ్చే పాట కథ నుంచి డిస్‌కనెక్ట్ చేస్తుంది. లవ్ ట్రాక్‌, ఫ్యాష్‌బ్యాక్ ఎపిసోడ్లను ట్రిమ్ చేసి నిడివిని రెండు గంటలకు తెచ్చి ఉంటే మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ అయ్యేది. 


శ్రీచరణ్ పాకాల రీ-రికార్డింగ్ అద్భుతంగా ఇచ్చారు. యాక్షన్ ఎపిసోడ్స్‌ను వేరే లెవల్‌కు తీసుకెళ్లారు. క్లైమ్యాక్స్‌ ఫైట్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ అయితే గూస్‌బంప్స స్టఫ్ అని చెప్పవచ్చు. జె.సిద్దార్థ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఈ సినిమా ఎక్కువగా రాత్రి వేళల్లోనే సాగుతుంది. లైటింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సాహూ గార్లపాటి, సురేష్ పెద్ది ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మించారు.


ఇక నటీనటుల విషయానికి వస్తే... అల్లరి నరేష్‌కు ఎస్ఐ శివ కుమార్ పూర్తిగా కొత్త పాత్ర. ఈ స్థాయి హీరోయిజం ఉన్న పాత్ర ఇంతవరకు నరేష్ చేయనేలేదు. కానీ ఈ సినిమాను పూర్తిగా భుజాలపై మోసింది నరేషే. ఒకరకంగా వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. మిర్నా మీనన్ అపర్ణ పాత్రలో బాగా నటించింది. వీరి కూతురి పాత్ర పోషించిన బేబి ఊహ క్యూట్‌గా నటించింది. మిగతా నటులందరూ తమ పాత్రల పరిధి మేరకు మంచి ప్రదర్శన కనబరిచారు.


Also Read: 'ఏజెంట్' సినిమా రివ్యూ : అయ్యగారు అఖిల్‌ని నంబర్ వన్ చేసేలా ఉందా? లేదా?


ఓవరాల్‌గా చెప్పాలంటే... అల్లరి నరేష్ చేసిన మరో కొత్త తరహా ప్రయత్నం ‘ఉగ్రం’. ఇలాంటి ఓవర్ ది బోర్డ్ హీరోయిజం సినిమాలు టాలీవుడ్‌కు కొత్త కాకపోవచ్చు కానీ అల్లరి నరేష్‌ను ఇలా చూడటం కొత్తగా ఉంటుంది. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారిని ఆకట్టుకుంటుంది.


Also Read: రామబాణం రివ్యూ: గోపిచంద్ ‘రామబాణం’ లక్ష్యాన్ని ఛేదించిందా? గురి తప్పిందా?