యోగా ఆరోగ్యానికి చాలా మంచిది. మనసుకి, శరీరానికి, మెదడుకి హాయిని ఇస్తుంది. ఒక్కొక్క ఆసనం ఒక్కో ప్రయోజనాన్ని అందిస్తుంది. అనేక రోగాలని నయం చేయగల గుణం వృక్షాసనంకి ఉంది. వృక్ష అనే సంస్కృత పదం నుంచి ఈ పేరు వచ్చింది. దీని అర్థం చెట్టు. ఈ ఆసనంలో ఒక కాలు మీద నిలబడి మరొక కాలు వంచి నిలబడి ఉంచిన కాలు లోపలి తొడకు వ్యతిరకేంగా అరికాలు తగిలే విధంగా పెట్టాలి. ఈ భంగిమ చెట్టుని పోలి ఉంటుంది. అందుకే వృక్షాసనం అని పేరు వచ్చింది. యోగా మొదలు పెట్టిన ఎవరైనా సులభంగా ఈ ఆసనం వేసుకోగలరు.


ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?


రెండు చేతులు శరీరం పైకి నిటారుగా నమస్కారం చేస్తున్నట్టుగా పెట్టాలి. కుడి మోకాలు వంచి ఎడమ మోకాలి తొడ లోపలకు పెట్టాలి. నేలపై ఖచ్చితంగా 90 డిగ్రీల కోణాన్ని ఇది ఉండేలా చూపిస్తుంది. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ యోగా చేయాలి. ఒక కాలు మీద నిలబడటం అంటే మీలోని స్థిరత్వాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఈ భంగిమ ఏకాగ్రత, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వృక్షాసనం క్వాడ్రిస్ప్స్, హామ్ స్ట్రింగ్స్, కండరాలని బలపరుస్తుంది. కాళ్ళకి బలాన్ని ఇస్తుంది.


ఈ వ్యాధులు తగ్గిస్తుంది


వృక్షాసనం మొత్తం ఆరోగ్యానికి దోహద పడుతుంది. రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా కాళ్ళకి, పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి వంటి సమస్యల్ని నివారిస్తుంది. హృదయ ఆరోగ్యాన్ని పెంచుతుంది. గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గించి విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. ఈ భంగిమలో ఆసనం వేయడం వల్ల వెన్ను నొప్పి, మెడనొప్పి వంటి మస్క్యులోస్కెలెటల్ సమస్యల్ని నివారిస్తుంది. దీర్ఘకాలిక నొప్పుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది. నిద్రలేమిని కూడా నయం చేస్తుంది.


ఈ తప్పులు నివారించండి


వృక్షాసనం వేసేటప్పుడు కొంతమంది తెలియకుండానే తప్పులు చేస్తూ ఉంటారు. కానీ వాటిని తప్పనిసరిగా నివారించాలి. స్నాయువు, కీళ్ల గాయాల పరిస్థితులు ఉన్న వారు ఈ ఆసనం వేయడం వల్ల గాయాల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. మొదటి సారిగా యోగా చేస్తున్న వాళ్ళు ఈ భంగిమ వేసే ముందు గోడకి ఆనుకుని వేయడం మంచిది. ఎందుకంటే ఒక్కసారిగా ఒక పాదం మీద శరీర బరువు మొత్తాన్ని మోయాలంటే కష్టంగా అనిపిస్తుంది. చేతులు తలపైకి పెట్టడం కష్టంగా అనిపిస్తే ఛాతీ ముందుకి మడత పెట్టుకోవచ్చు. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఈ ఆసనం వేస్తే ఆరోగ్యానికి మంచిది.


ఎవరు చేయకూడదు?


వృక్షాసనం అనేక ప్రయోజనాలు అందిస్తున్నప్పటికీ కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళు దీన్ని వేయకపోవడమే మంచిది. అధిక రక్తపోటు, మైగ్రేన్, నిద్రలేమి, తలనొప్పి, కాళ్ళు, చేతులు, వీపుపై గాయాలు ఉన్న వ్యక్తులు ఈ భంగిమ ప్రయత్నించే ముందు మరేదైనా వ్యాయామం చేయడం మంచిది. ఆరోగ్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాత ఈ ఆసనం వేయడం ఉత్తమం.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: ఈ అలవాట్లు మీ చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయని మీకు తెలుసా?