బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయ్యి ఇప్పటికే రెండు వారాలు దాటిపోయింది. మామూలుగా ఏ బిగ్ బాస్ సీజన్ ప్రారంభమయినా కూడా కొన్నిరోజుల్లోనే అందులో ఒక ప్రేమ కహానీ మొదలయిపోతుంది. కానీ ఈసారి అసలు ఆ ప్రేమ కహానీ ఏ ఇద్దరి మధ్య జరుగుతుంది అనే విషయం ఇంకా ప్రేక్షకులకు క్లారిటీ రావడం లేదు. బిగ్ బాస్ ప్రారంభమయిన మొదటిరోజు నుండే పల్లవి ప్రశాంత్‌కు రతిక అంటే ఇష్టం ఏర్పడినట్టుగా అనిపించింది. రతిక కూడా ప్రశాంత్‌తో చనువుగా ఉండడం మొదలుపెట్టింది. కానీ నామినేషన్స్‌లో రతిక అన్న ఒక్క మాటతో వారిద్దరి మధ్య మాటలు కూడా ఆగిపోయాయి. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత రతిక, ప్రశాంత్ సరదాగా మాట్లాడుకున్నారు. ఎక్కువమంది ప్రేక్షకులు చూడని ఆ వీడియోను.. బిగ్ బాస్ బజ్‌లో లీక్ చేశారు.
లేడీ లక్..
బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ అయ్యి హౌజ్‌లోకి అడుగుపెట్టిన మొదటి రోజే రతికను తన లేడీ లక్ అంటూ ప్రకటించాడు పల్లవి ప్రశాంత్. ఆ తర్వాత రెండురోజుల పాటు వీరిద్దరూ ఒకరిని విడిచి మరొకరు లేరు. ప్రేమగా మాట్లాడుకోవడం, సరదాగా ఉండడం చూసి ఇతర కంటెస్టెంట్స్ కూడా ఈ సీజన్‌కు చెందిన లవ్ బర్డ్స్ వీరే అని ఫిక్స్ అయిపోయారు. ఒక్కొక్కసారి ఈ ఇద్దరూ.. ఇతర కంటెస్టెంట్స్‌ను పట్టించుకోకుండా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఎవరి మాట వినని రతిక.. కేవలం ప్రశాంత్ మాట మాత్రమే వినేది. కానీ బిగ్ బాస్ హౌజ్‌లో రెండో వారం జరిగిన నామినేషన్స్‌లో అంతా రివర్స్ అయిపోయింది.
అక్కడే మొదలయిన గొడవ..
బిగ్ బాస్ సీజన్ 7లో రెండో వారం నామినేషన్స్‌లో చాలామంది కంటెస్టెంట్స్.. పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేయడానికి ముందుకొచ్చారు. తన ప్రవర్తనను, మాటలను తప్పుపట్టారు. అదే సమయంలో రతిక వెనుక తిరగడం తప్పా ఏమీ చేయడం లేదు అంటూ ఒక కంటెస్టెంట్ కామెంట్ చేశారు. దానికి ఒప్పుకోని ప్రశాంత్.. ‘‘నేను నిన్ను లవ్ చేస్తున్నా అని ఎప్పుడైనా చెప్పానా’’ అని రతికను అడిగాడు. రతిక నేరుగా కాకపోయినా ‘‘చూస్తున్నవాళ్లకు తెలుసు’’ అన్నట్టుగా సమాధానం చెప్పింది. ఆ నామినేషన్స్‌లో ప్రశాంత్‌కు రతిక సపోర్ట్ చేయకపోవడం, పైగా లవ్ విషయంలో అలా ముక్కుసూటిగా చెప్పడం.. ఇదంతా ప్రశాంత్‌ను చాలా బాధపెట్టాయి. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా కలిసి రతికకు దూరంగా ఉండమని సలహా కూడా ఇచ్చారు. అప్పటినుండి వీరిద్దరు మధ్య పెద్దగా మాటలు లేవు.
నామినేషన్స్ తర్వాత మాటల్లేవు..
గతవారం జరిగిన పవర్ అస్త్రా టాస్క్‌లో రతిక, పల్లవి ప్రశాంత్.. ఒకే టీమ్‌లో ఉన్నారు. అయినా కూడా వారు అసలు మాట్లాడుకోలేదు. ప్రశాంత్ కూడా రతికతో మాట్లాడడానికి ప్రయత్నించలేదు. అలా ఒక వారం రోజులు గడిచిన తర్వాత రతికతో ఉన్న మనస్పర్థలను క్లియర్ చేసుకోవాలి అనుకున్న ప్రశాంత్.. తన దగ్గరకు వెళ్లి చేసిన తప్పులేంటో అడిగాడు. రతిక చెప్పిన సమాధానాలకు ఒప్పుకొని, ఇంకెప్పుడూ అలా చేయను అన్నాడు. అప్పటినుండి వీరిద్దరూ మళ్లీ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తాజాగా కంటెస్టెంట్స్ అంతా పడుకున్న తర్వాత వీరిద్దరు పడుకోకుండా కబుర్లు చెప్పుకున్న సందర్భం బిగ్ బాస్ బజ్‌లో ప్రసారం అయ్యింది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.
రతిక, ప్రశాంత్ ప్రేమ కబుర్లు..
బెడ్ రూమ్‌లో రతిక పడుకొని ఉండగా.. గ్లాస్‌కు అటువైపుగా ప్రశాంత్ కూర్చొని ఉన్నాడు. ‘‘కొంచెం ముందుకు రా’’ అని ప్రశాంత్ అడగడంతో ఈ బిగ్ బాస్ బజ్ ప్రోమో మొదలయ్యింది. ‘‘డ్యాన్స్ రాదని బాగానే డ్యాన్స్ చేశావు’’ అంటూ రతిక.. ప్రశాంత్‌ను పొగిడింది. దానికి ప్రశాంత్ సరదాగా డిస్కో డ్యాన్సర్ అంటూ పాటపాడాడు. ఫ్లోర్ మూమెంట్ అంటూ కామెడీ చేశాడు. ఆ తర్వాత కబుర్లు చెప్పుకున్నారు, సరదాగా చేతులతో ఆడుకున్నారు. ఇదంతా చూసిన బిగ్ బాస్ ప్రేక్షకులు.. మళ్లీ వీరి మధ్య ప్రేమ చిగురిస్తుందని అనుకోవడం మొదలుపెట్టారు.
Also Read: దామినితో ‘డ్రామా’ గొడవ - పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన ప్రిన్స్ యావర్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial