సుస్మితా సేన్, లారా దత్తా, హర్నాజ్ సంధు.... మిస్ యూనివర్స్ కిరీటాన్ని మన దేశానికి అందించిన అందాల రాణులు. 


రీటా ఫారియా, ఐశ్వర్యరాయ్, డయానా హెడెన్, ప్రియాంక చోప్రా, యుక్తా ముఖి, మానుషి చిల్లర్... మిస్ వరల్డ్ కిరీటాన్ని భారతావనికి అందించిన అప్సరసలు.


అసలు మిస్ యూనివర్స్‌ పోటీలకు, మిస్ వరల్డ్ పోటీలకు మధ్య తేడా ఏమిటి? రెండూ అందాల రాణిని నిర్ణయించేవే... అయినా సరే రెండు వేరువేరుగా ఎందుకు నిర్వహిస్తున్నారు? ఇవి ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న సందేహాలు.


ప్రస్తుతం హర్నాజ్ కౌర్ సంధు మిస్ యూనివర్స్ కాగా, జమైకాకు చెందిన టోనీ ఆన్ సింగ్ మిస్ వరల్డ్ గా కొనసాగుతున్నారు. ఈ రెండింటిలో ఏది పెద్ద టైటిలో సూచించడానికి అధికారిక డేటా ఏమీ లేదు. రెండు టైటిళ్లు తెలివైన అపురూప అందగత్తెలకిచ్చేవే. 


మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించేది ఎవరంటే... 
ఈ రెండు అందాల పోటీలను నిర్వహించేవి రెండు వేరు వేరు సంస్థలు. మిస్ వరల్డ్ పోటీలను యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన ఎరిక్ మోర్లే ప్రారంభించారు. ఆయన ఒక బ్రిటిష్ టీవీ యాంకర్. 1951లో ‘మిస్ వరల్డ్’పేరుతో ఈ పోటీలను మొదలుపెట్టారు. తొలిసారి అదే ఏడాది జులైలో ఈ బ్యూటీ పెజెంట్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని లండన్ హెడ్‌క్వార్టర్‌గా పనిచేస్తున్న ‘మిస్ వరల్డ్ లిమిటెడ్’ అనే సంస్థ నిర్వహిస్తుంది. 2000వ సంవత్సరంలో ఎరిక్ మోర్లే మరణించాక అతని భార్య జూలియా మోర్లే బాధ్యతలను స్వీకరించారు. 1951 తొలి మిస్ వరల్డ్ కిరీటాన్ని స్వీడన్ కు చెందిన కికి హకన్సన్ గెలుచుకుంది. ఇక మనదేశం నుంచి ఈ కిరీటాన్ని పొందిన తొలి మహిళ రీటా ఫారియా. ఆమె 1966లో మిస్ వరల్డ్ గా నిలిచింది. మిస్ వరల్డ్ పోటీలు పూర్తిగా ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్నవే. కానీ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. చివరగా 2019లో ఈ పోటీలు జరిగాయి. అప్పుడు జమైకాకు చెందిన యువతి టోనీ ఆన్ సింగ్ గెలిచింది. ఇప్పటివరకు మళ్లీ వాటిని నిర్వహించలేదు. వచ్చే ఏడాది జరిగే అవకాశాలు ఉన్నాయి. 


మిస్ యూనివర్స్ కథేంటంటే...
మిస్ యూనివర్స్ ను మొదలుపెట్టింది కూడా ప్రైవేటు వ్యక్తులే. మిస్ వరల్డ్ బ్రిటన్లో మొదలయ్యాక దానికి పోటీగా అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన పసిఫిక్ మిల్స్ అనే దుస్తుల కంపెనీ ఈ పోటీలను ప్రారంభించింది. దీన్ని కొన్నాళ్లకు ‘మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్’గా మార్చారు. దీని హెడ్ క్వార్డర్ న్యూయార్క్ సిటీలో ఉంది. 1952లో తొలిసారిగా ఫిన్లాండ్‌కు చెందిన అర్మి కూసెలా మిస్ యూనివర్స్ గా నిలిచింది. ఇండియా నుంచి తొలిసారి ఈ టైటిల్ ను గెలిచింది సుస్మితా సేన్ (1994). ఆ తరువాత లారా దత్తా (2000), ఇప్పుడు హర్నాజ్ సంధు. 


రెండింటికీ ఏంటి తేడా?
రెండింటికీ ఎంపికయ్యే విధానంలోనే తేడా ఉంటుంది తప్ప, దాదాపు రెండూ ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న పోటీలే. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులారిటీని సంపాదించుకోవడంతో వాటికి విలువ పెరిగింది. అందాల రాణిగా గెలిచిన విజేతతో పలు సంస్థలు అనుసంధానమై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. 


ఎంపిక ఎలా?
మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించే సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లోని స్థానిక మోడలింగ్ సంస్థలతో అనుసంధానమవుతాయి. ఇదొక ఫ్రాంచైజీ ప్రాసెస్. మిస్ యూనివర్స్ ఫ్రాంచైజీని స్థానిక సంస్థలు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి దేశంలోను  మిస్ యూనివర్స్ లేదా మిస్ వరల్డ్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సంస్థలు జాతీయస్థాయిలో అందాల పోటీని నిర్వహిస్తాయి. ఆ పోటీలో గెలుపొందిన విజేతను అంతర్జాతీయ స్థాయికి పంపిస్తాయి. 


Read Also: అందమా అందమా.. టైటిల్ అందకుంటే న్యాయమా.. భారత్ నుంచి మిస్ వరల్డ్‌ విజేతలు వీరే..
Read Also: విశ్వ వేదికపై సత్తా చాటిన ఇండియన్ బ్యూటీస్ వీరే.. భారత్‌కు ముచ్చటగా మూడో మిస్ యూనివర్స్ టైటిల్
Read Also: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు... 21 ఏళ్ల విరామం తరువాత తీరిన కల
Read Also: హర్నాజ్ కౌర్ సంధు... విశ్వ వేదికపై మెరిసిన పంజాబీ అందం
Read Also: ఆ సమాధానమే 21 ఏళ్ల తర్వాత 'విశ్వసుందరి' టైటిల్ తెచ్చిపెట్టింది!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి