ఇరవై ఒక్కేళ్లు... మిస్ యూనివర్స్‌గా ఓ భారతీయ అందం మెరవడానికి పట్టిన కాలం. 2000లో లారాదత్తా మిస్ యూనివర్స్ గా గెలిచాక, మళ్లీ ఆ కిరీటం మనవారికి దక్కలేదు. ఇప్పుడు 2021లో హర్నాజ్ కౌర్ సంధు ఆ ఘనతను సాధించింది. ఆ సుదీర్ఘవిరామానికి హర్నాజ్ అందంగా ముగింపు పలికింది. 80 దేశాల నుంచి వచ్చిన అప్సరసలతో  పోటీ పడి విశ్వ కిరీటాన్ని దక్కించుకుంది. మిస్ యూనివర్స్ పోటీలు ఇజ్రాయెల్ లో జరిగాయి. పోటీకి వెళ్లే ముందే హర్నాజ్ ‘కిరీటాన్ని తిరిగి భారతదేశం తెచ్చేందుకు శాయశక్తులా కష్టపడతా’ అని చెప్పి మరీ వెళ్లింది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంది ఈ పంజాబీ అందం. 







మొదటగా మిస్ ఛండీఘడ్...
హర్నాజ్ పంజాబ్ రాష్ట్రంలోని ఛండీఘడ్ లో 2000 సంవత్సరం మార్చి 3న జన్మించింది. చిన్నప్పట్నించి మోడలింగ్, నటన అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే అందాల పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టింది. పదిహేడేళ్ల వయసులోనే మిస్ చండీఘడ్ గా ఎంపికైంది.  చండీఘడ్ లోని ప్రభుత్వ మహిళా కళాశాలలోనే డిగ్రీ పూర్తి చేసింది.  మనసంతా నటన, మోడలింగ్ మీదే ఉండడంతో చదువు కన్నా తన కలలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. కొన్ని పంజాబీ సినిమాలలో కూడా నటించింది. కానీ అవి పెద్దగా హిట్ కొట్టకపోవడంతో ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలియలేదు. 




ఫెమీనా మిస్ ఇండియాగా...
2019లో హర్నాజ్ ఫెమినీ మిస్ ఇండియా టైటిల్ ను గెలుచుకుంది. అలాగే 2021లో ప్రతిష్థాత్మకమైన ‘మిస్ దివా 2021’ అవార్డును సాధించింది. మిస్ యూనివర్స్ గా గెలిచిన హర్నాజ్ ఇకపై న్యూయార్క్ లో నివసించబోతోంది. అక్కడే ఉండి ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక చైతన్య కార్యక్రమాలకు దేశం తరుపున హాజరవ్వబోతోంది. 


ఆ ఆలోచనకు ఫిదా
మిస్ యూనివర్స్ పోటీలో కేవలం అందానికే కాదు, మంచి ఆలోచనకు, తెలివి తేటలకు కూడా మార్కులుంటాయి. హర్నాజ్ తన అందమైన భావాలను విశ్వవేదికపై పంచుకుంది. అవి న్యాయనిర్ణేతల మనసును తాకాయి. ‘ఒక రోజు కచ్చితంగా మన జీవితం మన కళ్ల ముందు ఒక ఫ్లాష్ లా మెరుస్తుంది. దాన్ని మనం కచ్చితంగా చూడాలి. నిజానికి అది మనం చూడాలనుకున్న జీవితం కాకపోవచ్చు, కానీ చూడాలి. మన చుట్టూ వాతావరణం మారుతోంది,  పచ్చని పర్యావరణం మరణిస్తోంది. ఇది మనుషులమైన మనం చేస్తున్న ఘోరాలలో ఒకటి. మన బాధ్యతారాహిత్యమైన ప్రవర్తనను మార్చుకోవడానికి ఇంకా సమయం ఉందని నేను నమ్ముతున్నాను. ఈ రోజు రాత్రి నుంచే మనం మారుదాం, ఇంట్లో అవసరం లేకుండా వెలుగుతున్న బల్బులను ఆపుదాం’అంటూ తన మనసులోని మాటలను చెప్పింది. హర్నాజ్ లాగే ఆమె ఆలోచన కూడా ఎంతందంగా ఉందో కదా... అందుకే విశ్వ కిరీటం ఆమె తలపై హుందాగా కూర్చుంది.  




Read also: కరోనా సోకితే ఈ ఆహారపదార్థాలు దూరం పెట్టాలి... తిన్నారో అంతే సంగతులు
Read also: పొగతాగని వారిలో ఆ క్యాన్సర్ త్వరగా నయమయ్యే అవకాశం
Read also: విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు... చెబుతున్న కొత్త పరిశోధన, తినాల్సినవి ఇవే
Read also: పొట్ట నిండా లాగించాక అసౌకర్యంగా ఉందా... ఇలా చేయండి
Read also: థర్డ్ వేవ్ ఒమిక్రాన్‌ రూపంలోనే రాబోతోందా? ఈ వేరియంట్‌ను తట్టుకోవాలంటే బూస్టర్ డోస్ అవసరమా.. అధ్యయనంలో ఏముంది!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.