అన్ని విటమిన్లు రోజు వారీ మనం తినే ఆహారంలో ఎంతో కొంత లభిస్తాయి. కానీ విటమిన్ డి కోసం మాత్రం కాస్త ప్రత్యేకశ్రధ్ధ అవసరం. అది అన్ని ఆహారపదార్థాలలో దొరకదు. అందుకే ఇప్పుడు ఎక్కువ మందిలో విటమిన్ డి లోపం ఎదురవుతోంది. విటమిన్ డి లోపం ఉన్నవారిలో గుండె జబ్బులు, అధిక రక్తపోటు కలిగే అవకాశం ఎక్కువని చెబుతోంది ఓ అధ్యయనం. ఈ పరిశోధనను యూనివర్సిటీ ఆప్ సౌత్ ఆస్ట్రేలియాలో నిర్వహించారు. దీని ప్రకారం సూర్యరశ్మి నుంచి మీరు సులభంగా పొందగలిగేది విటమిన్ డి, దీన్ని లోపం వల్ల ఎముకలే కాదు, గుండె ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది. ఈ పరిశోధన తాలూకు వివరాలను ‘యూరోపియన్ హార్ట్ జర్నల్’ మ్యాగజైన్లో ప్రచురించారు. 


ఈ అధ్యయనం ప్రకారం విటమిన్ డి సాధారణ స్థాయిలో అందే వారితో పోలిస్తే తక్కువ స్థాయిలో అందేవారిలో గుండెజబ్బులు వచ్చే అవకాశం రెట్టింపు కన్నా ఎక్కువని తేలింది. అలాగే హైబీపీ కూడా త్వరగానే దాడి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా హృదయ సంబంధ వ్యాధుల వల్ల ప్రతి ఏడాది 17.9 మిలియన్ల మంది మరణిస్తున్నట్టు అంచనా. ఆస్ట్రేలియాలోనే ప్రతి నలుగురిలో ఒకరు గుండె జబ్బులతోనే చనిపోతున్నారు. ఈ వ్యాధుల వల్ల ప్రతి ఏడాది ఐదు బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ ఖర్చును ఆస్ట్రేలియన్ ప్రభుత్వం భరించాల్సి వస్తోంది. ఇంతమంది గుండె వ్యాధుల బారిన ఎందుకు పడుతున్నారో తెలుసుకునేందుకే అధ్యయనాలు నిర్వహిస్తున్నాయి ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలు. 


లోపం అధికంగానే...
ఓ సర్వేలో ఆస్ట్రేలియా జనాభాలో 23 శాతం మంది, అమెరికాలో 24 శాతం మంది, కెనడాలో 37 శాతం మంది ప్రజలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నట్టు తేలింది. అంటే వీరందరికీ గుండె సంబంధ వ్యాధులు సులువుగా వచ్చే అవకాశం ఉన్నట్టే. 


ఇవి తినండి
అధ్యయనకర్తలు తమ ప్రజలకు విటమిన్ డి అధికంగా పొందే మార్గాలను సూచిస్తున్నారు. కొవ్వు పట్టిన చేపలు, గుడ్లతో పాటూ రోజూ ఓ గంట పాటూ సూర్యరశ్మి సోకేలా చూసుకోవాలి. అలాగే  తీవ్రమైన లోపంతో బాధపడుతుంటే వైద్యుని సలహాతో విటమిన్ డి సప్లిమెంట్లు వాడినా మంచిదే. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Read Also: థర్డ్ వేవ్ ఒమిక్రాన్‌ రూపంలోనే రాబోతోందా? ఈ వేరియంట్‌ను తట్టుకోవాలంటే బూస్టర్ డోస్ అవసరమా.. అధ్యయనంలో ఏముంది!
Read Also:  మీ హక్కులు మీకు తెలుసా? మీ స్వేచ్ఛని లాక్కునే హక్కు ఈ భూమ్మీద ఎవరికీ లేదు
Read Also:  పిల్లల్లో టైప్1 డయాబెటిస్... ఎలా గుర్తించాలి? ఏం చేయాలి?
Read Also: : పాలలో చిటికెడు పసుపు... దీని వేడి ముందు చలి మంట కూడా బలాదూర్



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి