అందాల పోటీల్లో విశ్వవేదికపై భారత్ పలు మార్లు సత్తా చాటింది. నేడు ఇజ్రాయెల్‌లో జరిగిన మిస్ యూనివర్స్ 2021 పోటీలలో భారత్‌కు చెందిన నటి, మోడల్ హర్నాజ్ కౌర్ సంధు విజేతగా అవతరించారు. తద్వారా భారత్ ఖాతాలో ముచ్చటగా మూడో మిస్ యూనివర్స్ టైటిల్ చేరింది. ప్రపంచ సుందరి టైటిల్స్‌లోనూ భారత్ ఖాతాలో అరుదైన ఘనత ఉంది. వెనిజులాతో పాటు సంయుక్తంగా భారత్ అత్యధికంగా 6 పర్యాయాలు ప్రపంచ సుందరి టైటిల్స్ నెగ్గింది. ఆసియా ఖండానికి చెందిన బ్యూటీస్ మొత్తం 10 పర్యాయాలు మిస్ వరల్డ్‌గా నిలవగా.. అందులో ఏకంగా ఆరు టైటిల్స్ భారత్‌కు చెందిన ముద్దుగుమ్మలు తమ ఆత్మవిశ్వాసం, తెలివితేటలతో సాధించడం విశేషం. వీరు దేశంలోని ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.


భారత్ నుంచి 1966, 1994, 1997, 1999, 2000, 2017 సంవత్సరాలలో అందగత్తెలు మిస్ వరల్డ్ కిరీటాలు దక్కించుకున్నారు. 1966లో రీటా ఫారియా భారత్ కలను తొలిసారి సాకారం చేశారు. భారత్ నుంచి ప్రపంచ సుందరి టైటిల్ నెగ్గిన ఫస్ట్ బ్యూటీగా రీటా ఫారియా నిలిచారు. 38 ఏళ్ల అనంతరం 1994లో నీలి కళ్ల సుందరి ఐశ్వర్వరాయ్ మిస్ వరల్డ్ టైటిల్ సాధించారు. అదే ఏడాది సుస్మితా సేన్ మిస్ యూనివర్స్ కావడం విశేషం. దీంతో ఒక్కసారి ప్రపంచ వ్యాప్తంగా అందాల పోటీలలో భారత్ పేరు మార్మోగిపోయింది.






1997లో భారత్‌ మూడోసారి మిస్ వరల్డ్ టైటిల్ గెలిచింది. అదే ఏడాది ఫెమినా మిస్ ఇండియాగా నిలిచిన ఆంగ్లో ఇండియన్ డయానా హెడెన్ ప్రపంచ సుందరిగా నిలిచి సత్తా చాటారు. కేవలం రెండేళ్ల వ్యవధిలో మన దేశానికి యుక్తాముఖి మిస్ వరల్డ్ కిరీటాన్ని అందించారు. 1999లో ప్రపంచ సుందరిగా నటి యుక్తాముఖి నిలిచారు. మరుసటి ఏడాదే భారత్‌ను ప్రపంచ వేదికపై సగర్వంగా తలెత్తుకునేలా చేశారు ప్రియాంక చోప్రా. 2000 ఏడాది లారాదత్తా మిస్ యూనివర్స్‌గా నిలవగా.. అదే ఏడాది ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ టైటిల్ సాధించారు. 






ఆ తరువాత ప్రియాంక చోప్రా బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించారు. హాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈ బ్యూటీ హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహం చేసుకుని విదేశాలలో స్థిరపడ్డారు. ప్రియాంక తరువాత 17 ఏళ్ల విరామానికి తెరదించారు మానుషి చిల్లర్. కూచిపూడి డ్యాన్సర్, మోడల్ అయిన మానుషి చిల్లర్ 2017లో మిస్ వరల్డ్ టైటిల్ సాధించి భారత్ కీర్తి పతాకాన్ని ప్రపంచ వేదికపై రెపరెపలాడేలా చేశారు. 


Also Read: Miss Universe 2021: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు... 21 ఏళ్ల విరామం తరువాత తీరిన కల 
Also Read: Miss Universe2021: హర్నాజ్ కౌర్ సంధు... విశ్వ వేదికపై మెరిసిన పంజాబీ అందం





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి