ఓటీఎస్ (వన్ టైమ్ సెటిల్మెంట్) వ్యవహారం ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు నేతలు ఇది పూర్తి స్వచ్ఛందం అని చెబుతున్నా.. మరోవైపు అధికారులకు మాత్రం టార్గెట్లు పెడుతున్నారని తెలుస్తోంది. దీంతో సచివాలయ సిబ్బంది ఓటీఎస్ డబ్బులు వసూలు చేయలేక అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో ఓటీఎస్ డబ్బులు కట్టలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందడంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది.
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పుకొండారెడ్డి పల్లెకు చెందిన మూల పెద గురవయ్య(70) భార్య లక్ష్మమ్మ, పెద్ద కోడలు భాగ్యమ్మ పేరు మీద గతంలో ఇళ్లు నిర్మించారు. ప్రభుత్వం పథకం ఓటీఎస్ ప్రకారం రూ.20 వేలు డబ్బులు కట్టాల్సి ఉంది. ఈ క్రమంలో పలుమార్లు వాలంటీర్ ఆయన ఇంటికి వచ్చి డబ్బులు కట్టాలని అడిగాడు. అయితే ఆ వ్యక్తి తన వద్ద డబ్బులు లేవని చెప్పాడు. ఇదే విషయంపై సచివాలయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. అయితే సచివాలయంలో కూడా తనకు భరోసా లభించకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. ఏం చేయాలో పాలుపోక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్సకోసం గురవయ్యను స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకి తరలించి చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది.
పరిస్థితి విషమించడంతో గురవయ్య చనిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటీఎస్ పథకం వల్లే తన భర్త ఆత్మహత్యాయత్నం చేశాడని ఆయన భార్య లక్ష్మమ్మ ఇటీవల మీడియా ముందు వాపోయారు. అది మినహా తన భర్తకు ఇంకే ఆర్థిక ఇబ్బందులు కూడా లేవని, కుటుంబ సమస్యలు కూడా లేవని చెప్పుకొచ్చారు.
Also Read: Cheddi Gang: చెడ్డీ గ్యాంగ్ మూలాలు తెలుసా.. వాళ్లు నరరూప రాక్షసులుగా ఎందుకు మారారు?
ఏది నిజం..? ఎవరు హంతకులు..?
గురవయ్య భార్య మాటల ప్రకారం ఓటీఎస్ కారణంగానే ఆయన ఆత్మహత్యాయత్నం చేశాడని అర్థమవుతోంది. ఓటీఎస్ డబ్బులు చెల్లించలేక ఆత్మహత్యాయయత్నం చేసిన గురవయ్య చికిత్స పొందుతూ చనిపోయాడు. మరి ఇలాంటి వాటికి ఎవరు సమాధానం చెప్పాలి, పోయిన ప్రాణాన్ని ఎవరు తీసుకు రాగలరు. తమ కుటుంబానికి అండగా ఎవరు నిలబడతారంటూ బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల నెల్లూరు జిల్లాలోనే ఓటీఎస్ పై మహిళా ఎంపీడీవో వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఓటీఎస్ డబ్బులు జమచేయకపోతే అలాంటి వారికి పథకాల ప్రయోజనాలు ఆపేయాలంటూ ఆమె పెట్టిన ఆడియో మెసేజ్ కలకలం రేపింది. దీంతో ఆమెను ఉన్నతాధికారులు సంజాయిషీ అడిగారు. ఆ తర్వాత మరో సభలో.. ప్రజకు బుద్ధిలేదంటూ సదరు ఎంపీడీవో ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి ఓటీఎస్ వ్యవహారంలో ఆమె విమర్శలపాలయ్యారు. ఇప్పుడు ఇదే జిల్లాలో ఓటీఎస్ పేరుతో వ్యక్తి ఆత్మహత్య మరింత సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
Also Read: Weather Updates: ఏపీలో మరో 48 గంటలు ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణలో భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు