హిడెన్ కిల్లర్... ఇదేదో హాలీవుడ్ సినిమా అనుకుంటున్నారా? కాదు ఓ ప్రాణాంతక వ్యాధికి బిరుదు. ఆ వ్యాధి పేరు ‘సెప్సిస్’. శరీరంలోనే ఉన్నా దాన్ని గుర్తించడం చాలా కష్టం. లోపల్లోపలే మనిషిని చావుకు దగ్గరగా తీసుకెళ్తుంది. మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా తన చివరి రోజుల్లో సెప్టిక్ షాక్ కు గురయ్యారు. దీని గురించి ప్రజల్లో అవగాహన చాలా తక్కువ. అసలు ఈ సెప్సిస్ అంటే ఏమిటి? దాని లక్షణాలేంటి? ఎలా గుర్తించాలి? ఈ విషయాలను తెలుసుకుందాం.
సెప్సిస్ అంటే...
చిన్న దెబ్బ తగిలినా కూడా సెప్టిక్ అవుతుంది జాగ్రత్త అనే హెచ్చరికలు చిన్నప్పట్నించి వింటూనే ఉన్నాం. అసలు సెప్టిక్ అంటే ఏమిటో ఆలోచించారా? సెప్టిక్ కావడం అంటే ఆ దెబ్బ ఇన్ఫెక్షన్ గా మారడం. అలా శరీరంలోని ఇన్ఫెక్షన్ల కారణంగానే సెప్సిస్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. బయటి నుంచి తీవ్రమైన వ్యాధికారక బ్యాక్టిరియాలు శరీరంలోకి చొరబడినప్పుడు, వాటికి శరీరంలోని రోగనిరోధక శక్తికి పెద్ద యుద్ధమే జరుగుతుంది. అలాంటప్పుడు సెప్సిస్ అనే స్థితి ఏర్పడుతుంది. సాధారణంగా చిన్న ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంది. అదే శరీరమంతా ఇన్ఫెక్షన్ పాకినప్పుడు మాత్రం మన రోగనిరోధక వ్యవస్థ కార్గిల్ వార్ స్థాయిలో స్పందించి పోరాడుతుంది. ఇలాంటప్పుడు శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ యుద్ధంలో ఒక్కోసారి అవయవాలు పనిచేయడం మానేస్తాయి. దాన్నే సెప్టిక్ షాక్ అంటారు. దీని వల్ల చివరికి మరణం సంభవించే అవకాశం కూడా ఉంది.
ఎలా తెలుస్తుంది?
నిజానికి ఈ సెప్సిస్ ను గుర్తించడానికి సరైన పరీక్ష విధానం ఏదీ లేదు. అందుకే దీనిని హిడెన్ కిల్లర్ (దాక్కుని చంపే హంతకుడు) అన్నారు. కడుపులో మంటగా అనిపించడం, గుండెలో మంట, జ్వరం రావడం ఇలా సాధారణంగానే ఉంటాయి దీని లక్షణాలు. కాబట్టి ఎవరూ ప్రాథమిక స్థాయిలో దీన్ని గుర్తించలేరు. తరువాత శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం, చర్మం ఎర్రగా మారడం, లేదా పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయినా సరే... సెప్సిస్ అని నిర్ధారించలేరు.
లక్షణాలు ఇలా...
పెద్దలు, పిల్లలు ఇద్దరిలోనూ సెప్సిస్ వచ్చే అవకాశం ఉంది. శరీరంలో సెప్సిస్ పరిస్థితి ఉంటే చర్మం రంగు మారడం, అతిగా నిద్రపోవడం, శరీరం చల్లగా అనిపించడం, గుండెకొట్టుకునే వేగం పెరగడం, మూత్ర విసర్జన చేయలేకపోవడం, వణుకు ఇలా... అనేక లక్షణాలు కనిపిస్తాయి.
చికిత్స
ఇది ఒకరి నుంచి మరొకరికి సోకదు. ప్రాథమిక స్థాయిలోనే సెప్సిస్ ను గుర్తించగలిగితే చికిత్స సులువవుతుంది. కానీ తీవ్రమైన స్థితికి చేరుకున్న గంటలోనే వైద్య సహకారం అందాలి. లేకుంటే పరిస్థితి చేయి దాటి పోతుంది. సెప్సిస్ వచ్చాక బతికే అవకాశాలు... ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి వైద్యం అందించే వేగంపై ఆధారపడి ఉంటుంది. వ్యాక్సిన్లు సరిగా వేయించుకోవడం, పరిశుభ్రతగా ఉండడం ఈ రెండింటి వల్ల సెప్సిస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: బొప్పాయి వల్ల నిజంగానే గర్భం పోతుందా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?
Also read: చాలామందికి భోజనం చేసేటప్పుడు ఇదే సమస్య.. మీకూ ఉందా? తేలికగా తీసుకోకండి
Also read: ప్యాకెట్ పాలను మరగబెట్టాల్సిన అవసరం ఉందా? నేరుగా తాగొచ్చా?