ఇలాంటి ఒక సమస్య గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ చిన్న సమస్యలే పెద్దవిగా మారి జీవితాన్ని కబళిస్తాయి. అందుకే దేనినీ తేలికగా తీసుకోకూడదని చెబుతోంది కొత్త అధ్యయనం. చాలా మందికి మనలో భోజనం చేసేటప్పుడు కడుపునొప్పిగా అనిపిస్తుంది. ఆ నొప్పి సాధారణ స్థాయిలోనే ఉంటుంది కాబట్టి పెద్దగా పట్టించుకోం. కానీ ఆ కడుపునొప్పి కొన్ని మానసిక సమస్యలకు సూచన కావచ్చు అంటున్నారు పరిశోధకులు. బెల్జియం, స్వీడన్ యూనివర్సీలలో పీహెచ్ డీ చేస్తున్న పరిశోధకులు ఈ పరిశోధనను నిర్వహించారు. ఇలా తరచూ భోజనం చేసేటప్పుడు కడుపు నొప్పి అనుభూతి చెందే వాళ్లు అతి త్వరగా డిప్రెషన్ బారిన పడే అవకాశం చాలా ఎక్కువ. అంతేకాదు ఇలా పొట్ట నొప్పిగా అనిపించినప్పుడు వారిలో ఆందోళన కూడా అధికంగానే ఉంటుంది. కానీ ఈ పరిస్థితిని తేలికగా తీసుకుని వదిలేయడం వల్లే అనేక మంది మానసిక వ్యాధుల బారిన పడుతున్నారు. 


కొత్త పరిశోధనలో శాంపిల్ కోసం దాదాపు యాభై వేల మందిని పరీక్షించారు. వారిలో 13 శాతం మంది మహిళల్లో, 9 శాతం మంది పురుషుల్లో ఈ సమస్య ఉందని తేలింది. అంటే ప్రపంచ జనాభాలో 11 శాతం మంది భోజనం చేసేప్పుడు కడుపునొప్పిని ఫీలవుతున్నారు. ముఖ్యంగా కేవలం 18 నుంచి 28 ఏళ్ల మధ్యలోని వారిలోనే ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. ఇలా తింటున్నప్పుడు కడుపునొప్పి కలిగేవారిలో కడుపుబ్బరం, గాభరాగా తినేయడం, కాస్త తినగానే కడుపు నిండినట్టుగా అనిపించడం, అన్నింటి కన్నా ముఖ్యంగా కడుపులో తిప్పినట్టు ఏదో ఆందోళనగా అనిపించడం, వెనుక నుంచి ఎవరో తరుముతున్నట్టు ఆదరాబాదరాగా తినేయడం ఇలాంటి లక్షణాలను గుర్తించారు పరిశోధకులు. ఇలా లక్షణాలున్న వారు తీవ్రమైన మానసిక వ్యాధుల బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువని కూడా చెబుతున్నారు. కాబట్టి ఈ లక్షణాలుంటే కచ్చితంగా వైద్యులను కలువమని సిఫారసు  చేస్తున్నారు. 


ఇలాంటి సమస్యతో బాధపడేవారిలో 30 శాతం మందికి పొట్ట - మెదడుల మధ్య అనుసంధానతను దెబ్బతీసే పరిస్థితి ఏర్పడవచ్చు. దీనివల్ల మలబద్ధకం లేదా విరేచనాలు కావడం వంటివి కలుగుతాయి. కాబట్టి మీకు భోజనం చేసేప్పుడు తరుచూ పొట్ట నొప్పిగా అనిపించినా, ఆందోళనగా అనిపించినా ఓసారి వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: స్నాక్స్ గా నాలుగు గింజలు నోట్లో వేసుకున్నా చాలు... ఎంతో మేలు


Also read: రొమ్ము క్యాన్సర్ వారసత్వంగా వస్తుందా? లక్షణాలేంటి? ఎలా చెక్ చేసుకోవాలి?


Also read: రాత్రి పడుకోబోయే ముందు ఈ టీ తాగితే... ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు