మనదేశంలో మహిళలకు సోకే క్యాన్సర్లలో రొమ్ముక్యాన్సర్ దే మొదటిస్థానం. ఈ క్యాన్సర్ ను చికిత్స ద్వారా నయం చేయచ్చు. కానీ చాలామంది మహిళకు ఈ క్యాన్సర్ పట్ల సరైన అవగాహన లేక పరిస్థితి చేయిదాటే దాకా వైద్యులను సంప్రదించడం లేదు. దీంతో పరిస్థితి ప్రాణాంతకంగా మారుతోంది. అందుకే ‘బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ మంత్’ అన్న పేరుతో అక్టోబర్ లో వివిధ రకాల చైతన్యకార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. 1985లో అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అక్టోబర్ ను ‘బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ మంత్’గా ఎంపిక చేసింది. రొమ్ముక్యాన్సర్ విషయంలో అవగాహన కల్పించేందుకు మేం ఇక్కడ ఆ క్యాన్సర్ లక్షణాలు, ఎవరికి వచ్చే అవకాశం ఉంది, లక్షణాలేంటి అనేవి మీకు అర్థమయ్యే రీతిలో అందిస్తున్నాం. మీరు చదవడమే కాదు, మరింతమందికి ఈ సమాచారాన్ని చేరేలా చూడండి.
ఏంటి ఈ క్యాన్సర్?
రొమ్ము క్యాన్సర్ అనేది మహిళల వక్షోజాలకు వచ్చే క్యాన్సర్. రొమ్ము కణజాలాల్లో కలిగే క్యాన్సర్ ఇది. అసాధారణ రీతిలో శరీరంలో కణజాలాలు పెరిగి ఒక గడ్డగా మారతాయి. ఆ గడ్డల వల్ల నొప్పి విపరీతంగా పెరుగుతుంది. అలా ఆగకుండా పెరిగి చాలా ప్రమాదకరంగా మారుతుంది.
లక్షణాలేంటి?
రొమ్ములు నొప్పిగా అనిపిస్తుంటాయి. నొక్కితే గడ్డల్లాంటివి తగులుతాయి. రొమ్ముపై చర్మం ఎర్రగా మారుతుంది. పరిమాణం, ఆకారంలో కూడా తేడా వస్తుంది. చనుమొనల నుంచి ద్రవాలు వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు ఏవి ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించడం అత్యవసరం.
ఎవరికి వస్తుంది?
రొమ్ముక్యాన్సర్ 50 ఏళ్లు పైబడిన వారికే వచ్చే అవకాశం 80 శాతం ఎక్కువ. అంత కన్నా తక్కువ వయసువారికి రాదని కచ్చితంగా చెప్పలేం. వారసత్వంగా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా పది శాతం ఉంది. తల్లి, అమ్మమ్మ, అక్క వంటి దగ్గరి బంధువుల్లో రొమ్ము క్యాన్సర్ లేదా గర్భాశయ క్యాన్సర్ ఉంటే ఆ కుటుంబంలోని స్త్రీలకు వచ్చే అవకాశం ఉంది. చిన్నవయస్సులోనే రుతు చక్రం మొదలైన వారిలో, యాభై ఏళ్లు దాటినా కూడా రుతుక్రమం ఆగని వారిలో రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువే. ఎందుకంటే వీరిలో ఈస్ట్రోజన్ హార్మోను ఎక్కువ ఉత్పత్తి అవుతుంది.
ఎలా పరీక్షిస్తారు?
రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు ముందు మామోగ్రామ్ పరీక్ష నిర్వహిస్తారు. క్యాన్సర్ ఉందేమోనన్న అనుమానం వైద్యుడిలో బలపడితే బయాప్సీ చేస్తారు. దాని ద్వారా క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉందో నిర్ధారిస్తారు. స్టేజ్ ను బట్టి వైద్యులు చికిత్సను నిర్ణయిస్తారు. కీమో థెరపీ, హార్మోన్ థెరపీ, ప్రోటాన్ రేడియేషన్ థెరపీ, సర్జరీ... ఇలా మీ పరిస్థితిని బట్టి డాక్టర్లు నిర్ణయం తీసుకుంటారు.
ఏం తినాలి?
రొమ్ము క్యాన్సర్ రాకుండా ముందే జాగ్రత్త పడాలి. ఇందుకోసం యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తినాలి. పుట్టగొడుగులు, బ్రకోలి, దానిమ్మ, బీన్స్, నల్ల ద్రాక్ష, వాల్నట్స్, బచ్చలి, గుడ్డు, చేపలు... మహిళలు అధికంగా తినడం అలవాటు చేసుకోవాలి.
Also read: డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి... హార్వర్డ్ ఆరోగ్య నిపుణుల సలహా
Also read: రైస్ కుక్కర్ ను పెళ్లాడిన యువకుడు, నాలుగు రోజులకే నిజం తెలిసి...
Also read: ఈ మహాత్ముడు మనకే కాదు ఎన్నో దేశాల ప్రజలకు స్పూర్తి