శ్రమ‌దానం కార్యక్రమంలో పాల్గొనడానికి పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరం విమనాశ్రయానికి చేరుకున్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి పవన్‌ బాలాజీపేటకు భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, ప్రజలకు అభివాదం చేశారు. దారి పొడవునా జనసైనికులు ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. జనసేనాని రాకతో.. ఆ ప్రాంతానికి ఆయ‌న అభిమానులు, జ‌న‌సేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అయితే.. రాజమహేంద్రవరంలో  అడుగ‌డుగున ఆంక్షలు విధించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయినా శ్రమదానంలో పాల్గొనాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. 


రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై నిరసనలో భాగంగా జనసేన ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ రహదారిపై పవన్‌ శ్రమదానం చేయాలని నిర్ణయించారు. కాగా, భద్రతా కారణాలతో జలవనరుల శాఖ అధికారులు కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. అధికారుల సూచనతో హుకుంపేట రోడ్డుకు కార్యక్రమాన్ని మార్చారు. మరోవైపు అనంతపురం జిల్లాలో కూడా పవన్‌ పర్యటించనున్నారు.


మరోవైపు పవన్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు రాజమహేంద్రవరానికి వెళ్లే మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పవన్‌ అభిమానులను ఎక్కడికక్కడ ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. పవన్‌ సభ నిర్వహించనున్న బాలాజీపేటకు ఇరువైపుల 5 కి.మీ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. బాలాజీపేట పరిసరాల్లో ఎలాంటి ఆంక్షలు లేవని తూర్పు గోదావరి జిల్లా ఏఎస్పీ లలితకుమారి తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ సభకు ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పారు.



ఏపీలో రోడ్డు మరమ్మతుల కోసం పోరాటం చేసిన జనసేన పార్టీ.. వైసీపీ సర్కార్ కు డెడ్ లైన్ చెప్పిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వానికి జనసేన రోడ్డు మరమ్మతు పనులకు డెడ్లైన్ విధించినప్పటికీ పనులు చేయించకపోవడంతో గాంధీ జయంతి నాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రోడ్ల మరమ్మతుల కోసం రంగంలోకి దిగుతున్నట్లుగా ప్రకటించారు. ఇవాళ రాజమండ్రిలో ధవళేశ్వరం బ్యారేజ్ పై గుంతలను పూడ్చే శ్రమదానం కార్యక్రమంలో పవన్ పాల్గొంటారని, అలాగే అనంతపురం జిల్లా కొత్తచెరువు లోనూ పవన్ శ్రమదానం నిర్వహిస్తారని ప్రకటించారు.  అయితే  ధవళేశ్వరం బ్యారేజీ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఉంటుందని, దానిపైన గుంతలను పూడ్చడానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో ధవళేశ్వరం బ్యారేజ్ పైన గుంతలను రాత్రికి రాత్రి పూడ్చడం మొదలుపెట్టారు.


పవన్ కల్యాణ్ శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటానని ప్రకటించిన రోడ్ల మరమ్మతులకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్న జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లకుండానే, రోడ్ల మరమ్మతు పనులు చేయిస్తున్నారని చెబుతున్నారు. జనసేనాని రాకను అడ్డుకోవడం కోసం ఒకవైపు పోలీసులు అనుమతి ఇవ్వకుండా చేసి మరోవైపు ప్రభుత్వం పరువు గోదారిలో కలవకుండా రక్షించడం కోసం ఆగమేఘాలమీద నాసిరకం పనులతో ధవళేశ్వరం బ్యారేజ్ పై గుంతలు పూడ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జనసేన పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.





 




Also Read: Pawan Kalyan Tour: రాజమహేంద్రవరం నుంచి బాలాజీపేటకు బయలుదేరిన పవన్ కల్యాణ్.. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి