ఆ యువకుడి పేరు కహిరోల్ ఆనమ్. అతడిది మనదేశం కాదు, ఇండోనేషియా. అందుకే పేరు అలా ఉంది. ఫేస్ బుక్ లో యమ యాక్టివ్. కొన్ని రోజుల క్రితం తన పెళ్లి ఫోటోలను పోస్టు చేశాడు. ఆ ఫోటోలు చూశాక అతడెంత ఫేమస్ అయిపోయాడో. ఆ ఫోటోలు ఖండాలు దాటి ఇతర దేశాలకు చేరాయి. పిల్ల దొరకలేదో లేక అన్నం వండి పెట్టే రైస్ కుక్కర్ అంటే అమిత ప్రీతో తెలియదు కానీ, ఏకంగా ఆ ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్ నే పెళ్లి చేసుకున్నాడు. తాను పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతూ, రైస్ కుక్కర్ పైన పల్చటి దుపట్టా కప్పి పెళ్లి కూతురిగా మార్చాడు. అధికారికంగా పెళ్లి చేసుకుంటున్నట్టు కాగితాలపై సంతకాలు కూడా చేశాడు. తన అందాల కుక్కర్ కు ఓ ముద్దు పెడుతూ ఫోటో దిగాడు. ఆ ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేసి తన భార్యను పొగుడుతూ ‘తెలుపు రంగులో, నిశ్శబ్దంగా ఉంటుంది. మాట్లాడదు, వండడంలో మేటి, నా కల నిజమైంది. నీవు లేకుండా నా ఆహారం ఉడకదు’ అని క్యాప్షన్ కూడా పెట్టాడు. ఆ పోస్టుకు 44,300 లైకులు, వేల షేర్లు వచ్చాయి. 


అంతలోనే...
నాలుగు రోజులు పోయాక ఫేస్ బుక్ పేజీలో మళ్లీ పోస్టు పెట్టాడు ఆనమ్. తన భార్యకు విడాకులు ఇచ్చేస్తున్నట్టు ప్రకటించాడు. ఎందుకంటే ఆమె కేవలం అన్నం మాత్రమే  చక్కగా వండుతుందని, మిగతా వంటలేవీ సరిగ్గా ఉడకడం లేదని, ఆ విషయం పెళ్లి తరువాతే తెలిసిందని చెప్పాడు. ఈ బాగోతం అంతా చూసిన నెటిజన్లు ఆనోమ్ పై రకరరకాల కామెంట్లు చేస్తున్నారు. కేవలం వైరల్ అవ్వడం కోసమే ఇలాంటి పోస్టులు పెడుతున్నాడని చాలా మంది భావించారు. నిజమే కావచ్చు, ఎందుకంటే ఆనమ్ ఫేస్ బుక్ పేజీలో హ్యుమరస్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అందులో భాగంగానే ఈ ఫోటోలు, పోస్టులు పెట్టి ఉండొచ్చు.  ట్విట్టర్ లో ఆయన పెళ్లి ఫోటోలు వైరల్ అయ్యాయి.