‘‘ఇలాంటి ఒక వ్యక్తి రక్తమాంసాలు గల శరీరంతో ఈ భూ ప్రపంచం మీద నడిచారంటే ముందు తరాల వారు నమ్మలేకపోవచ్చు’’
గాంధీజీని ఉద్దేశించి ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ అన్న మాటలివి. నిజమే గాంధీజీ జీవితాన్ని మొదట్నించి చివరి పేజీ వరకు చదివి చూస్తే, ఆ మహాత్ముడి సందేశాలను, పద్ధతులను అర్థంచేసుకుంటే ఈ మాటలు సత్యమే అనిపించకమానవు. ఆయన జీవితమే మనకు మార్గనిర్దేశనం.
గాంధీజీ జీవితమంతా పోరాటాలమయం. చిన్నప్పుడు తనను తాను గెలిచేందుకు, తన మనసును అదుపులో పెట్టుకునేందుకు తనతో తానే యుద్ధం చేశారు. తరువాత దక్షిణాఫ్రికాలో అసలైన ప్రజా ఉద్యమాలకు నాయకుడిగా మారారు. అక్కడ్నించి స్వదేశానికి చేరి భారతావనికి స్వాతంత్య్రం వచ్చే వరకు పోరాడారు. సాధారణ కుటుంబంలో జన్మించినా... ఆయన జీవితం మొత్తం పోరాటాలు, ఉద్యమాలు, సంస్కరణల బాటలోనే సాగింది. అందుకే కేవలం మనకే కాదు ప్రపంచంలోని చాలా దేశాల వారికి గాంధీజీ స్పూర్తిదాయకం.
1. మహాత్మ గాంధీ నాలుగు ఖండాల్లోని 12 దేశాల్లో రాజుకున్న పౌర హక్కుల ఉద్యమాలకు స్పూర్తిగా నిలిచారు. అందులో ఒక దేశం అమెరికా. మార్టిన్ లూథర్ కింగ్ కు గురుతుల్యుడైన హువార్డ్ థుర్మాన్ 1936లో భారత్ వచ్చి గాంధీజీని కలిశారు. గాంధీ పాటిస్తున్న అహింస అనే ఆయుధం ఉద్యమంలో ఎంతో శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నట్టు అర్థంచేసుకున్నారాయన. అమెరికాలో పౌర హక్కుల ఉద్యమనేతల్లో ఈయన కూడా ఒకరు. గాంధీజీ స్పూర్తితో ఆ దేశంలో అహింసా పద్దతిలో ఉద్యమం నడిపేందుకు చాలా ప్రయత్నించారాయన.
2. స్వదేశానికి స్వేఛ్చను ఇవ్వమంటూ గాంధీజీ అహింసా పద్ధతిలో పోరాడింది బ్రిటన్ ప్రభుత్వంతోనే. అతని ఉద్యమాలను అణగదొక్కడానికి ప్రయత్నించి బ్రిటన్ ఓడిపోయింది. చివరకు గాంధీజీ మరణించిన 21 ఏళ్ల తరువాత తమ దేశంలో ఆయన గౌరవార్థం ఓ స్టాంపును విడుదల చేసింది. బ్రిటన్ లో గాంధీజీకి వీరాభిమానులున్నారు.
3. 1948, జనవరి 30 గాంధీజీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపారు. మహాత్ముడి మరణాన్ని జవహరల్ లాల్ నెహ్రూ రేడియోలో జాతినుద్దేశించి ప్రకటించారు. గాంధీ అంతిమయాత్రంలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. వారంతా 8 కిలోమీటర్ల పొడవునా పరుచుకున్నారు. వారిలో విదేశీయులు కూడా ఉన్నారు.
4. మహాత్మ గాంధీ తాను ఉద్యమంలో ఉన్నప్పుడే ప్రపంచంలోని ప్రముఖులతో ఉత్తరాల ద్వారా పరిచయం పెంచుకున్నారు. టాల్ స్టాయ్, ఆల్బర్ట్ ఐన్ స్టీన్, హిట్లర్, చార్లీ చాప్లిన్ వంటి వారందరికీ తరచూ ఉత్తరాలు రాసేవారు. వారందరికీ గాంధీ అంటే అమితమైన గౌరవం.
5. మనదేశంలో ఎన్నో వీధులకు, ఊళ్లకు, చిన్న రోడ్లకు గాంధీ పేరు ఉంది. అవన్నీ కాకుండా దాదాపు 53 ప్రధాన రహదారులకు ఆయన పేరును పెట్టారు. ఇతర దేశాల్లో కూడా 48 రహదారులకు ఆయా దేశాల ప్రభుత్వాలు గాంధీ పేరును పెట్టాయి.
Also read: ఆపిల్ కన్నా గుడ్డులోనే అవెక్కువట.. అందుకే తినమంటున్నారు
Also read: డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి... హార్వర్డ్ ఆరోగ్య నిపుణుల సలహా