గర్భిణిలకు బొప్పాయి తినవద్దని ఇంట్లోని పెద్దలు చెబుతుంటారు. దీని వల్ల గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తారు. ఇది ఎంతవరకు నిజం? అసలు బొప్పాయికి, గర్భస్రావానికి మధ్య సంబంధం ఏమిటి? ఈ విషయంలో ఆరోగ్యనిపుణులు ఇచ్చే సలహాలేమిటి?


ప్రాచీనకాలంలో ఈజిప్షియన్లు బొప్పాయి గింజలను ఉపయోగించి ఒంటెలలో గర్భధారణను నివారించడం లేదా గర్భస్రావం చేయడం వంటివి చేసేవారు. అప్పటి నుంచి బొప్పాయి అంటే గర్భస్రావం చేసేది అనే ముద్ర పడింది. అయితే ఇందులో కొంత నిజం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పచ్చిగా, కాయలా ఉండే బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు. మీరే గమనించండి, పండిన బొప్పాయితో పోలిస్తే, పచ్చి బొప్పాయిలో పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. పచ్చి బొప్పాయిపై చిన్న గీత పడినా  పాలు కారతాయి. పాలు కారే పచ్చి బొప్పాయిని తినడం వల్ల ఆ పాలు శరీరంలో ప్రొస్టగ్లాండిన్స్ అనే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఇది గర్భసంచి గోడలు ముడుచుకుపోయేలా చేస్తాయి. దీనివల్ల గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. అయితే బాగా పండిన బొప్పాయి వల్ల ఈ సమస్య ఉండదు. ఇందులో ఉత్పత్తి అయ్యే పాల శాతం చాలా తక్కువగా ఉంటుంది. కనుక తిన్నా కూడా ఎలాంటి ప్రభావం ఉండదు. 


బొప్పాయిలోని పపైన్ అనే ఎంజైమ్ రుతుచక్రంలో కూడా ఎలాంటి మార్పులు చేయదు. చాలా మంది ఈ పండు తినడం వల్ల రుతుక్రమంపై ప్రభావం పడుతుందని నమ్ముతారు. కానీ అదొక అపోహే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గర్భం ధరించినప్పడు మొదటి మూడు నెలలు ఈ పపైన్ ఎంజైన్ గర్భాశయ సంకోచం, జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది. అందుకే దాన్ని దూరం పెట్టమని సూచిస్తారు పెద్దలు. ఆ తరువాతా బాగా పండిన బొప్పాయి తింటే చాలా ఆరోగ్యం. అనేక రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. అయిదో నెల దాటాకా బాగా పండిన బొప్పాయిని తినడం వల్ల ఎలాంటి హాని కలుగదని చెబుతున్నారు వైద్యులు. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: కరివేపాకును తీసిపడేయకండి... షుగర్ కు చెక్ పెట్టే దమ్మున్న ఆకు ఇది 


Also read:  చాలామందికి భోజనం చేసేటప్పుడు ఇదే సమస్య.. మీకూ ఉందా? తేలికగా తీసుకోకండి


Also read: ప్యాకెట్ పాలను మరగబెట్టాల్సిన అవసరం ఉందా? నేరుగా తాగొచ్చా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి