ఏపీలో పాఠశాలలకు ఈనెల 11 నుంచి 16 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి 18వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి. గతంలో పాఠశాలలకు దసరా సెలవులను ఆరు రోజులుగా ప్రభుత్వం ప్రకటించగా.. 9వ తేదీ రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం రావడంతో సెలవుల సంఖ్య పెరిగింది. దీనితో అక్టోబర్ 8వ తేదీ వరకే పాఠశాలలు పని చేయనున్నాయి. అటు 17వ తేదీ ఆదివారం కావడంతో స్కూల్స్ 18న పున: ప్రారంభం కానున్నాయి. మొత్తం 9వ తేదీ నుంచి 17 వరకు(9 రోజులు) పాఠశాలలకు దసరా సెలవులు ఉంటాయి.
తెలంగాణలో ఇవాళ్టి నుంచి 17వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నట్లుగా తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. ఈ నెల 18న పాఠశాలలు తెరుచుకుంటాయని వెల్లడించింది. ఈ నెల 13 నుంచి 16 వరకు నాలుగు రోజులు ఇంటర్ కాలేజీలకు సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి 17న కాలేజీలు ప్రారంభమవుతాయి.
దసరా పండగ సందర్భంగా.. ఈనెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఈ దసరాకు 4,045 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని వెల్లడించారు. దసరా సందర్భంగా 3,085 బస్సులను తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు, 950 బస్సులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రద్దీని బట్టి నడుపుతామని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ముఖ్యమైన బస్ స్టేషన్లు జేబీఎస్, ఎంజీబీఎస్‌తో పాటు బీహెచ్ఈఎల్, లింగంపల్లి, చందానగర్, మియాపూర్ క్రాస్ రోడ్, కేపీహెచ్‌బీ కాలనీ, అమీర్ పేట్, టెలీఫోన్ భవన్, దిల్‌సుఖ్‌గర్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్, అరాంఘర్ క్రాస్ రోడ్‌ల నుంచి ప్రత్యేక బస్సులు ఉంటాయి. రిజర్వేషన్ సౌకర్యం ఉన్న బస్సులపై ఒకటిన్నర శాతం ఛార్జీలు అధికంగా వసూలు చేస్తామని అధికారులు చెప్పారు.
జూబ్లీ బస్ స్టేషన్ నుంచి.. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ వెళ్లే బస్సులు ఉంటాయి. ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి వరంగల్, పరకాల, మహబూబాబాద్, భువనగిరి, యాదగిరి గుట్టకు వెళ్లే బస్సులు ఉంటాయి. నల్గొండ, కోదాడ, సూర్యాపేటకు వెళ్లే వారి కోసం దిల్‌సుఖ్‌నగర్ నుంచి బస్సులు ఉండనున్నాయి. కడప, కర్నూల్, చిత్తూర్, అనంతపురం, ఒంగోలు, నెల్లూర్‌కు ఓల్డ్ సీబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులుంటాయి. ఎంజీబీఎస్ నుంచి మిగిలిన బస్సులను నడిపించనున్నట్లు అధికారులు చెప్పారు.