ఫాస్ట్ ఫుడ్స్.. వీటిపై వైద్యులు, నిపుణలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. ఎక్కువగా తినకూడదని సూచిస్తుంటారు. అయితే తాజాగా ఓ అధ్యయనంలో ఫాస్ట్ ఫుడ్స్‌పై షాకింగ్ విషయాలు తెలిశాయి. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరమని మరోసారి తేల్చాయి. 'జర్నల్ ఆఫ్ ఎక్స్‌పోజర్ సైన్స్ & ఎన్వీరాన్‌మెంటల్ ఎపిడెమియాలజీ'లో ఈ అధ్యయన ఫలితాలు పబ్లిష్ అయ్యాయి.


హానికరం..


మెక్‌డొనాల్డ్స్‌, బర్గర్ కింగ్, పిజ్జా హట్, డోమినోస్, టాకో బెల్ వంటి ప్రప్రముఖ ఫుడ్ రెస్టారెంట్లలోని ఆహారంలో హానికరమైన 'ఫెలేట్స్' అనే ప్లాస్టిక్ సాఫ్ట్ ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.



సాధారణంగా ఈ ఫేలేట్స్‌ను  ప్లాస్టిక్ వస్తువులు మరింత ఫ్లెక్సిబుల్‌గా ఎక్కువకాలం మన్నేందుకు ప్లాస్టిసైజర్స్‌గా వాడతారు. వినైల్ ఫ్లోరింగ్, లూబ్రికేటింగ్ ఆయిల్స్, సబ్బులు, హెయిర్ స్ప్రేస్, లాండ్రి డిటర్జెంట్‌లలో కూడా వీటిని వినియోగిస్తారు.


అధ్యయనం..


జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం, సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, బోస్టన్ యూనివర్సిటీ, హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధనకర్తలు ఈ ప్రముఖ రెస్టారెంట్ల నుంచి తెచ్చిన మొత్తం 64 శాంపిళ్లను పరీక్షించారు. హామ్‌బర్గర్లు, ఫ్రైస్, చికెన్, చీజ్ పిజ్జా వంటి పదార్థాలను పరిశీలించారు. ఇందులో దాదాపు  80 శాతానికి పైగా వాటిలో డీఎన్‌బీపీ అనే ఫెలేట్, 70 శాతం వాటిలో డీఈహెచ్‌టీ అనే ఫెలేట్ ఉన్నట్లు తేలింది. ఈ మేరకు హిందూస్థాన్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.


ఈ డీఈహెచ్‌టీ అనే ప్లాస్టిసైజర్‌ను ఎక్కువగా గ్లోవ్స్, బాటిల్ క్యాప్స్, బెల్ట్స్, వాటర్ ప్రూఫ్ క్లాతింగ్‌లో వినియోగిస్తారు. ఇవి ఆహారంలో ఎక్కువగా ఉపయోగించడం వల్ల పిల్లల ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిపారు. గర్భవతులకు కూడా ఇది ప్రమాదకరమన్నారు. అయితే ఈ అధ్యయనాన్ని ఇంకా విస్తృత స్థాయిలో చేయాల్సి ఉందని వారు వెల్లడించారు. ఎందుకంటే ఈ శాంపిళ్లన్నీ కేవలం ఒక నగరం నుంచి తీసుకున్నవేనని స్పష్టం చేశారు.