బ్రెయిన్ స్ట్రోక్ అనే మెదడును తీవ్రంగా ప్రభావితం చేసే ఒక పరిస్థితి. ప్రాణాంతకమైనది కూడా. ఇది గుండె పోటుతో సమానమైనది. మనదేశంలో ప్రతి ఏడాది దాదాపు 18 లక్షల బ్రెయిన్ స్ట్రోక్ కేసులు నమోదవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. సమస్య వచ్చాక బాధపడడం కన్నా, రాకుండా అడ్డుకోవడం మేలని చెబుతున్నారు వైద్యులు. 1996కు ముందుతో పోలిస్తే 1996-2019 మధ్య కాలంలో మనదేశంలో బ్రెయిన్ స్ట్రోకుల సంఖ్య వంద శాతం పెరిగంది. ఇది నిజంగా కలవరపెట్టే అంశమే. బ్రెయిన్ స్ట్రోక్ సాధారణంగా శరీరానికి ఒకవైపు బలహీనంగా, తిమ్మిరిగా అనిపించడంతో మొదలవుతుంది. తరువాత చూపు, మాట్లాడడంలో సమస్య మొదలవుతుంది. చివరికి శరీరం అవయవాల మధ్య సమన్వయాన్ని కోల్పోతుంది. మెదడుకు రక్త సరఫరా తగ్గడం లేదా రక్తనాళాల్లో చీలిక రావడం కావచ్చు. ఈ పరిస్థితి వల్ల స్ట్రోక్స్ కలగవచ్చు. స్ట్రోక్ రావడం వల్ల మెదడులోని చాలా కణాలు మరిణిస్తాయి. దీనివల్ల మంచానికి పరిమితమవుతారు చాలా మంది. ఇలాంటి భయంకరమైన స్ట్రోక్ ను నివారించాంటే ముందునుంచి జాగ్రత్త పడడం అవసరం అంటున్నారు వైద్యులు. అందుకు ఏం చేయాలో సూచిస్తున్నారు.


1. హైపర్ టెన్షన్‌కు చికిత్స తీసుకోండి
మీకు హైపర్ టెన్షన్ ఉండే దాన్ని తేలికగా తీసుకోకండి. ఎందుకంటే స్ట్రోక్ కు మొదటి ప్రమాద కారకం ఇదే. అధికరక్తపోటు రక్త నాళాలను దెబ్బతీస్తుంది, ఒక్కోసారి చీలిపోయేలా చేస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ ను అడ్డుకోవాలంటే అధికరక్తపోటుకు మందులు వాడుతూ అదుపులో ఉంచడం చాలా అవసరం.


2. మధుమేహంతో జాగ్రత్త
రక్తంలో అధిక చక్కెర స్థాయిలు రక్తనాళాలకు హాని కలిగిస్తాయి. రక్త గడ్డకట్టడానికి కూడా దారితీస్తాయి. దీని వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకే మధుమేహం ఉన్న వారు సక్రమంగా మందులు వాడుతూ, ఆహారపద్దతులు పాటిస్తూ షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలి. 


3. ఆరోగ్యకరమైన ఆహారం
అన్నింటికీ మూలం ఇదే. నిత్యం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేవారికి ఎలాంటి అనారోగ్యం దరిచేరదు. తాజా పండ్లు, కూరగాయలు ఆహారంలో ఉండేట్టు చూసుకోవాలి. ఉప్పు తక్కువగా తినాలి. శాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, పీచు పదార్థం అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. దీనివల్ల అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గే అవకాశం ఉంటుంది. దీని వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. 


4. వ్యాయామం
శారీరకంగా చురుకుగా ఉండడం ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగం. రోజూ కాసేపు నడవడం, చిన్నచిన్న వ్యాయామాలు చేయడం  అలవాటు చేసుకోవాలి. వ్యాయామాలు బరువు తగ్గేందుకు, రక్తపోటును నియంత్రించేందుకు సహకరిస్తాయి. తద్వారా స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. 


5. ధూమపానం మానేయండి
స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్లు దాన్ని విడిచిపెట్టడం మంచిది. ధూమపానం రక్తాన్ని చిక్కగా చేసి గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. దీనివల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం పెరుగుతుంది. 


పైన చెప్పిన అయిదు సూచనలను కచ్చితంగా పాటిస్తే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని దాదాపు తగ్గించుకున్నట్టే. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: ఇది మంగళసూత్రం ప్రకటనా లేక లోదుస్తుల ప్రకటనా?


Also read:  అష్టఐశ్వర్యాలుగా చెప్పుకునేవి ఇవే`


Also read:  తెల్లవెంట్రుక పీకేస్తే... అవి మరింత ఎక్కువవుతాయంటారు నిజమేనా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి