ఫస్ట్ ఎయిడ్... ఏదైనా అనారోగ్య పరిస్థితి హఠాత్తుగా తలెత్తినప్పుడు చేసే మొదటి పని. దీన్నే ప్రాథమిక చికిత్స అంటాం. ఫస్ట్ ఎయిడ్ అంటే కేవలం వైద్యులు, నర్సులే చేసేది కాదు, పౌరులుగా మనం కూడా దాని గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలబడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ ఈ మధ్య ఎక్కువ మందిని బలి తీసుకుంటోంది. గుండె పోటు రాగానే చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. నిజానికి అందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలి. గుండె పోటు అనేది వైద్యపరమైన అత్యవసర పరిస్థితి. మీ ఎదురుగా ఎవరికైనా గుండెపోటుకు గురైతే, ఆసుపత్రికి తరలించేలోపు ఆ వ్యక్తిని కాపాడుకునేందుకు ప్రాథమిక చికిత్స అందిస్తే అతని ప్రాణాలు నిలబడే అవకాశం ఉంది. 


ఏం చేయాలి?
ఒక వ్యక్తిలో గుండె పోటు లక్షణాలు కనిపించగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. ఆ సమయంలో ప్రతి సెకను చాలా విలువైనది. 


1. ముందుగా పక్కనున్నవ్యక్తినెవరినైనా అంబులెన్స్ కు ఫోన్ చేయమని చెప్పండి. చాలా ఆసుపత్రులు ఎమర్జెన్సీ నెంబర్లను ప్రొవైడ్ చేస్తున్నాయి. మీరొక్కరే ఉంటే మీరే ఆ పని చేయాలి. 


2. గుండె పోటు లక్షణాలు కనిపిస్తున్న వ్యక్తిని సౌకర్యవంతంగా కూర్చొబెట్టండి. నిల్చున్నప్పుడు గుండె పోటు వస్తే గుండెపై చాలా ఒత్తిడి కలుగుతుంది. అదే కూర్చుంటే ఒత్తిడి తగ్గుతుంది. 


3. అంబులెన్స్ వచ్చే వరకు లేదా వైద్య సహాయం అందే వరకు రోగితో కాస్త సున్నితంగా మాట్లాడండి. ఏమీ జరగదనని వారిలో ధైర్యం నింపేలా మాట్లాడండి. 


4. గుండె పోటుకు గురైన వ్యక్తి స్పృహ కోల్పోతే వెంటనే CPR మొదలుపెట్టాలి. వ్యక్తి శ్వాస తీసుకోవడం ఆగిపోయినా, లేక పల్స్ ఆగిపోయినట్టు అనిపించినా గుండెకు రక్తం ఆగకుండా CPR ఇవ్వాలి. వ్యక్తి ఛాతీ మధ్యలో రెండు చేతులతో గట్టిగా ఒత్తాలి. ఎంత వేగంగా ఒత్తాలంటే నిమిషానికి వంద సార్లు ఒత్తాలి. ఇలా చేయడం వల్ల ఆగిపోయిన గుండె కొట్టుకునే అవకాశం ఎక్కువ. 





Also read: వెల్లుల్లి కారంతో రోజుకో ముద్ద తిన్నా చాలు, ఎన్ని లాభాలో


Also read: ఘుమఘుమలాడే కసూరీ మేతీ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి