వేడి వేడి అన్నంలో  వెల్లుల్లి కారం కలుపుకుని తింటే ఆ రుచే వేరు. కనీసం అయిదారు ముద్దలైనా ఆ పొడితో తినాలనిపిస్తుంది. అది కేవలం రుచి కోసం తినే పదార్థం, దానిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఒక్కసారి చేసుకుంటే మూడు నెలల పాటూ తాజాగా ఉంటుంది. రుచి కూడా మారదు. ఈ పొడి కలుపుకుని రోజూ తినడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. జలుబు, జ్వరం, ఫ్లూ, క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా అడ్డుకోవడానికి సాయపడుతుంది. అందుకే భోజనం చేసేటప్పుడు మొదటి ముద్ద దీనితోనే తింటే మంచి ఫలితాలు అందుతాయి. 


ఎలా కాపాడుతుంది?
డయాబెటిస్, డిప్రెషన్ ఉన్నవారికి వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది. వాటి తీవ్రతలను తగ్గిస్తుంది. అలాగే గుండె సమస్యలు కూడా రావు. రక్తం గడ్డకట్టకుండా వెల్లుల్లి కాపాడుతుంది. కాబట్టి గుండెకు రక్తప్రసరణ సక్రమంగా జరిగి గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. జీర్ణక్రియ మెరుగవ్వడానికి కూడా ఈ పొడి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో వాడిని ధనియాల వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. శరీరంలోని వేడిని బయటకు పంపేందుకు ధనియాలు సాయం చేస్తాయి. గ్యాస్ వంటి సమస్యల నుంచి ఇవి బయటపడేస్తాయి. ఇవి మగవారికి చాలా మేలు చేస్తాయి. వారిలోని లైంగిక శక్తిని పెంచుతాయి. అంతేకాదు శరీరంలోని ఇన్ ఫ్లమ్మేషన్ ను తగ్గించేందుకు సహకరిస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ ను కూడా తగ్గిస్తుంది. కాబట్టి డయాబెటిస్ వారికి చాలా మంచిది. 


ఎలా చేసుకోవాలంటే...
వెల్లుల్లి రెబ్బలు - 30
ఎండు మిరపకాయలు - పది
ధనియాలు - మూడు స్పూనులు
జీలకర్ర - ఒక స్పూను
నూనె - రెండు టీస్పూనులు
ఉప్పు - రుచికి సరిపడా


తయారీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. 
2. నూనె వేడెక్కాక ఎండుమిరపకాయలు, ధనియాలు వేసి వేయించాలి. 
3. అవి వేగాక జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. తొక్క తీయకుండానే వెల్లుల్లి వాడుకోవచ్చు. అలా వాడితే రుచి కూడా బావుంటుంది. 
4. అన్నింటినీ కలిపి మిక్సీలో పొడిలా చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా కలుపుకునే పొడి కొట్టుకోవాలి. 
5. వెల్లుల్లి పొడి సిద్ధమైనట్టే. దీన్ని గాలి చొరబడని డబ్బాలో వేసి దాచుకోవాలి. రోజుకో ముద్ద వెల్లుల్లి పొడితో తినాలి. రోజుకోసారి తిన్నా చాలు. 


Also read: ఘుమఘుమలాడే కసూరీ మేతీ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి


Also read: వంకాయ కూర తింటే అది బాగా పని చేస్తుందట, మీ పిల్లలకు తిరిగే ఉండదు