ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నులను ప్రజల నుంచి వసూలు చేస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పన్నుల పేరుతో ప్రజల పరువు తీస్తూ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఆస్తిపన్ను , నల్లా పన్ను కట్టకపోతే ఇంట్లో సామాన్లు తీసుకెళ్తామంటూ కాకినాడలో వాహనాలకు బ్యానర్లు కట్టి మరీ ప్రజల్ని హెచ్చరిస్తున్న ఫోటోలను పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రోజువారీ వడ్డీ వ్యాపారుల్లా ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తోందని మండిపడ్డారు.
అలాగే కర్నూలు చెత్తపన్ను చెల్లించలేదని దుకాణాల ముందు చెత్త పోసిన అంశంపైనా పవన్ కల్యాణ్ స్పందించారు. చెత్త పన్ను విధింపే ఓ దరిద్రం అనుకుంటే దాన్ని వసూలు చేస్తున్న విధానం మరింత దిగజారుడుగా ఉందన్నారు. ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు.
ఏపీ ప్రభుత్వం ప్రజల నుంచి పన్నుల వసూలు విషయంలో చాలా దూకుడైన పద్దతులు పాటిస్తోంది. ఈ కారణంగా అనేక విమర్శలు ఎదుర్కోంటోంది. ప్రజల నుంచి నేరుగా వసూలు చేసే చెత్త పన్ను విషయంలో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నా వెనక్కి తగ్గడం లేదు. చెత్త పన్ను కట్టకపోతే ఇంటి ముందు చెత్త పోస్తామని .. పోయాలని అధికారులు.. ప్రజాప్రతినిధులు కూడా హెచ్చరిస్తున్నారు. వీటిని హెచ్చరికలతోనే సరి పెట్టడం లేదు. నిజంగానే పోస్తున్నారు. శ్రీకాకుళంలో.. కర్నూలులోనూ అలాగే చేశారు. దీనిపై ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్తకొత్త పన్నుల భారం ప్రజలపై ఏపీ ప్రభుత్వం మోపుతోందనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.