ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో తాము నెగ్గడానికి చిరంజీవి ఎంతో తగ్గారని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. ఆయన నిజమైన మెగాస్టార్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. కర్ణాటకలో జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయన ఏమన్నారంటే...
‘కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌కు ధన్యవాదాలు. కర్ణాటక చక్రవర్తి, హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్‌కు ఎంతగానో ధన్యవాదాలు. కర్ణాటకలో మాత్రమే కాకుండా, తెలుగులో కూడా ఆయనను శివన్న అంటూ ఉంటారు. నేను కూడా మిమ్మల్ని అలాగే పిలుస్తాను. భౌతికంగా మన మధ్య లేకపోయినా పునీత్ రాజ్‌కుమార్ ఇక్కడే ఉండి మనల్ని ఆశీర్వదిస్తున్నారు.’
‘దానయ్య నాకోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశారు. చేస్తే పెద్ద సినిమానే చేద్దాం అన్నారు. ఇన్ని సంవత్సరాలు నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. కన్నడ ప్రొడ్యూసర్ వెంకట్‌కు కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఆయన సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు.’
‘ఇక్కడ నేను గొప్ప సంగమాన్ని చూస్తున్నాను. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, తెలుగు సూపర్ స్టార్లు చరణ్, తారక్‌ల మైత్రీ సంగమం ఈ స్టేజ్ మీద జరుగుతుంది. ఇదంతా చూస్తుంటే శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి సామ్రాజ్యం ఇలాగే ఉండేదేమోననిపిస్తుంది.’
‘మాకో అలవాటు ఉంది. కథ చెప్పడానికి హీరోల దగ్గరకు వెళ్లే ముందే మేం టెస్ట్ షూట్ చేస్తాం. అందులో పూర్తిగా నా అసిస్టెంట్లే నటిస్తారు. అదంతా ఎడిటింగ్ కూడా అయింది. ఆర్ఆర్ఆర్ విడుదల అయ్యాక దాన్ని కూడా రిలీజ్ చేస్తాం. దాన్ని మించిన కామెడీ సినిమా ఇంకోటి ఉండదు. అది మీ అందరికీ చూపిస్తాం.’
‘ప్రొడక్షన్ డిజైనర్ సాబు శిరిల్, కెమెరామెన్ సెంథిల్, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ శ్రీనివాస మోహన్, నా భార్య శ్రీవల్లి ఆర్ఆర్ఆర్‌కు నాలుగు స్తంభాలు. వీరంతా ఉన్నారు కాబట్టే ఆర్ఆర్ఆర్ విజువల్స్ అంత బాగా వచ్చాయి.’
‘మేం మా సినిమా గురించి చెప్పి రేట్లు పెంచాలి అనగానే ఇది తెలుగు వారు గర్వంగా చెప్పుకునే సినిమా అని అనుమతించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, వెంటనే సంతకం పెట్టిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌కు ధన్యవాదాలు. మా సినిమాకు రేట్లు కావాలనప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అర్థం చేసుకుని బ్యాలెన్స్‌డ్‌గా రేట్లు పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చారు. అలా చేయడానికి సాయం చేసిన పేర్ని నానికి, కొడాలి నానికి ధన్యవాదాలు.’
‘ఇక్కడ ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. 10 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల జీవో ఇచ్చినప్పుడు ఇది సరిగ్గా లేదని చెప్పడానికి చాలా ప్రయత్నించాం. నేను కూడా ప్రయత్నించాను. ఎవరం ముందుకు వెళ్లలేకపోయాం. కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రితో ఆయన సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని రెండు, మూడు సార్లు కలిసి కొత్త రేట్లు రావడానికి కారణం అయిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయనను చాలా మంది ఎన్నో మాటలన్నారు. కానీ మమ్మల్ని నెగ్గించడానికి ఆయన తగ్గారు. ఆయన నిజమైన మెగాస్టార్. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం ఆయనకు ఇష్టం లేకపోయినా ఆయనను నేను అలాగే భావిస్తాను.’ అన్నారు. ఆ తర్వాత హీరోల గురించి మాట్లాడి స్పీచ్‌ను ముగించారు.