Somireddy Chandramohan Reddy : ఏపీలో నాటు సారా, మద్యం బ్రాండ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మత్స్యకార హోరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాయకష్టం చేసేవారు మద్యం వైపు చూడటం సహజం అని చెప్పారు. అయితే ఏపీలో ఇప్పుడు సరైన బ్రాండ్లు దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులు మెక్ డొవెల్ బ్రాందీ తాగొద్దా..? ఓల్డ్ ట్రావెన్ కంపెనీ మందు కొనద్దా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కింగ్ ఫిషర్ బ్రాండ్ అప్పట్లో పిల్లలందరికీ తెలుసు, ఇప్పుడది ఏపీలో దొరకడంలేదని చెప్పారు. ప్రభుత్వం ఆరేడు రూపాయలకు మందు బాటిల్ కొని, దాన్ని 150 రూపాయలకు అమ్ముతోందని మండిపడ్డారు సోమిరెడ్డి. 


మద్యం షాపుల ముందు టీడీపీ ధర్నాలు 


ఏపీలో నాటు సారా, జె బ్రాండ్ మద్యం నిషేధించాలని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆందోళనలకు చేసింది. మద్యపాన నిషేధం విధించాలంటూ ఆ పార్టీ శ్రేణులు మద్యం షాపుల ముందు పెద్ద ఎత్తున పోరాటానికి దిగారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల పోరాటానికి మద్దతుగా గ్రామస్థాయి నుంచి ఆందోళనలు చేపట్టారు. నాసిరకం మద్యం తాగి ప్రజల అనారోగ్యం బారిన పడుతున్నారని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పేరిట తొమ్మిది రకాలుగా నాసిరకం మద్యం బ్రాండ్లు తెచ్చారని మండిపడ్డారు. 


సహజ మరణాలు కాదు సారా మరణాలే


రాష్ట్రంలో కల్తీసారా మరణాలకు నైతిక బాధ్యత వహించి సీఎం జగన్ తన పదవికి రాజీనామా చేయాలని తెలుగుదేశం టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ డిమాండ్ చేశారు. కల్తీ సారా వలన వందలాది మంది చనిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జె బ్రాండ్ మద్యం ధరలు విపరీతంగా పెంచడం వలన పేదలకు మద్యం అందుబాటులో లేక నాటు సారా, కల్తీ సారా, శానిటైజర్ లు, వైట్నర్లు, గంజాయి తాగి పేదలు అర్థంతరంగా చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం తదితర ప్రాంతాల్లో ఇప్పటివరకు 45 మంది వరకు చనిపోతే అవన్నీ సహజ మరణాలే అంటూ జగన్ ప్రభుత్వం, వైసీపీ నాయకులు బుకాయించడం దారుణమని ఆయన విమర్శించారు.


ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం 


కల్తీ సారా వల్ల చనిపోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఇంటి స్థలాలు ఇవ్వాలని రామ్మోహన్ డిమాండ్ చేశారు. నాటు సారా, కల్తీసారా అమ్మకాలతో అక్రమ సంపాదనకు వైసీపీ నాయకులు అక్రమాలు చాస్తున్నారని, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న వారికి ఏమాత్రం బాధ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.