2021 ముగిసిపోయింది, 2022కు స్వాగతం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. కొత్త ఏడాదిలో ఎన్నో కొత్త రుచులను ఆస్వాదించబోతున్నాం. గడిచిపోయిన ఏడాదిలో కూడా ఎన్నో రుచులు ప్రపంచాన్ని శాసించాయి. అత్యంత ప్రజాదరణ పొందిన రెపిసీలు ఇవన్నీ. 2021లో వైరల్ గా మారి ఇంటర్నెట్‌ను ఉప్పెనలా ముంచెత్తాయి. వాటిలో కొన్ని ఇవిగో...
1. డాల్గోనా క్యాండీ
ఇదొక కొరియన్ మిఠాయి. ఇది 1970,80లలో కొరియాదేశాల్లో ప్రసిద్ధమైన చిరుతిండి. పాప్గి అని కూడా పిలుస్తారు. దీన్ని కరిగించిన చక్కెర, బేకింగ్ సోడాతో చేస్తారు. ఇప్పుడు మళ్లీ స్వ్కిడ్ గేమ్ సిరీస్ వల్ల ఇది వెలుగులోకి వచ్చింది. అందులో ఈ స్వీటును సిద్ధంచేయడంపై స్క్విడ్ ఛాలెంజ్ 2021లో బాగా ట్రెండయ్యింది. దాంతో డాల్గోనా క్యాండీ కూడా బాగా వైరల్ అయింది.
2. చపాతీ ర్యాప్స్
టోర్టిల్లా లేదా చపాతీ ర్యాప్స్... ఇవి కూరగాయలు, మసాలా దినుసులతో నింపి ఉంటాయి. త్రిభుజం ఆకారంలో మడవడం ఈ ర్యాప్స్ ప్రత్యేకత. ఇలా మడిచాక కాలుస్తారు. తింటే భలేరుచిగా ఉంటాయి.
3. వీగన్ బేకన్
బేకన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మాంసాహారమే. ఇంతవరకు మాంసాహార బేకన్లే బాగా వైరల్ అయ్యాయి. 2021లో మాత్రం వీగన్ల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన క్యారెట్ బేకన్లు కూడా పాపులర్ అయ్యాయి. క్యారెట్ పలుచగా పొరలా కత్తిరించి కాల్చడం ద్వారా వీటిని తయారుచేస్తారు.
4. క్రీమీ నూడిల్స్
హక్కా నుంచిన సూప్ రామెన్ వరకు అనేక రకాల నూడిల్స్ అందరికీ నచ్చుతాయి. కానీ తొలిసారి 2021లో క్రీము రూపంలో నూడిల్స్ వచ్చాయి. ఇది టిక్ టాక్లో ‘క్రీమీ రామెన్’ పేరుతో ట్రెండయ్యింది. దీన్ని క్రీమీ వైట్ సాస్‌తో తయారు చేస్తారు.
5. విప్డ్ కాఫీ
లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉండి డాల్గోనా కాఫీలకు ఎక్కువ మంది అలవాటు పడ్డారు. దీన్నే విఫ్ట్ కాఫీ అని కూడా పిలుస్తారు. 2021లో క్రీమీ ట్రిక్ విప్ట్ మచా, విప్డ్ స్ట్రాబెర్రీ డ్రింక్, విప్డ్ నుటెల్లా, విప్డ్ లెమనేడ్ వంటి ఎన్నో అధునాతన పానీయాలు తయారుచేశారు. విప్డ్ పానీయాల ఏడాదిగా 2021కి చెప్పుకోవచ్చు.